తురకపాలెంలో రిజిస్ట్రేషన్ పత్రాల్ని చూపుతున్న లబ్ధిదారులు
గుంటూరు రూరల్: జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం (ఓటీఎస్) పేదలకు వరంగా మారింది. రుణాలు పొంది ప్రభుత్వం ఇచ్చిన స్థలాల్లో, సొంత స్థలాల్లో ఇళ్లు కట్టుకున్న పలువురు నేటికీ పత్రాలు పొందలేక ఇబ్బంది పడుతున్నారు. ఓటీఎస్ పథకం వారికి ఎంతో ఊరటనిచ్చింది. వేలల్లో ఉన్న రుణాల్ని కొద్ది మొత్తంలో చెల్లింపులు చేసి రిజిస్ట్రేషన్ పత్రాల్ని పొందే అవకాశాన్ని వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కల్పించింది. దీనివల్ల బ్యాంకులు ఇతర సంస్థల్లో రుణాలు పొందేందుకు అవకాశం లభిస్తోందని పలువురు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
చేతిలో పత్రంతో ధీమా
ఉన్న ఆస్తి ఈ ఒక్క ఇల్లు మాత్రమే. పదిహేనేళ్ల కిందట ప్రభుత్వం నుంచి రు ణం తీసుకుని ఇల్లు నిర్మించుకున్నాం. ఇల్లు ఉన్నా అత్యవసర పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులు ఎదురైతే బ్యాంకు, ఇతర సంస్థల్లో రుణం పొందలేకపోయాం. ఆర్థిక ఇబ్బందులు వచ్చినపుడు రుణం కోసం బ్యాంకుకు వెళితే ఇంటిపై ఇంకా రూ. 27 వేల అప్పు ఉందని చెప్పి ఇవ్వలేదు. కానీ నేడు కొద్దిపాటి చెల్లింపుతో నాకు రుణం తీరిపోయి సొంత పత్రాలు చేతికి వచ్చాయి. ఇప్పుడు అత్యావసర సమయంలో బ్యాంకు, లేదా ఎక్కడైనా రుణం పొంది ఇబ్బందుల నుంచి బయటపడగలనని ధైర్యం వచ్చింది.
– కొరివి దీనమ్మ, తురకపాలెం
రుణం కోసం కాళ్లు అరిగేలా తిరిగా
నాకున్న ఆస్తి ఇల్లు మాత్రమే. కూలీ నాలీ చేసుకుని బతికేవాళ్లం. ఇరవై ఏళ్ల కిందట ప్రభుత్వం నుంచి రుణం పొంది ఇల్లు నిర్మించుకున్నా. తరువాత అదే ఇంటిపై రుణాలు పొందాలన్నా పొందే పరిస్థితి లేకపోయింది. ఇల్లు ఉన్నా లేనట్టేనన్నట్లు తయారైంది. ఏం చేయాలా అని ఆలోచిస్తున్న సమయంలో జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ద్వారా కొద్దిపాటి చెల్లింపుతో సొంత పత్రాలు పొందవచ్చని స్థానిక సచివాలయంలో తెలిపారు. దీంతో గతంలో రుణం రూ. 16 వేలు ఉంటే దానిని తగ్గించి రూ. 5400 చెల్లించి సొంత పత్రాలు పొందాను. ఇప్పుడు నాకు సొంత ఇంటి పత్రాలున్నాయి. ఎక్కడైనా అత్యవసర సమయంలో రుణం పొందవచ్చని ధైర్యం వచ్చింది.
– కొరివి జక్రయ్య, తురకపాలెం
సొంత ఇంటి పత్రాలతో ఆర్థిక భరోసా కలిగింది
కూలీ నాలీ చేసుకుని జీవిస్తున్నాం. ఈ పరిస్థితుల్లో ఆర్థి క ఇబ్బందులు వస్తే ఏంచేయాలో పాలుపోయేదికాదు. ఇంటిపై రుణం తీసుకుందామన్నా ఇచ్చేవారు కాదు. ఇరవై ఏళ్ల కిందట మా అత్త బోరుగడ్డ భాగ్యమ్మ రుణం తీసుకుని ఇల్లు నిర్మించింది. అప్పు అలానే ఉంది. కూలీ పనులు చేయలేక ఏదైనా చిన్నపాటి చిల్లర దుకాణం ఏర్పాటు చేసుకుందామని ఇంటిపై రుణం అడిగితే ఇవ్వలేదు. ఇంకా బాకీ ఉందని చెప్పారు. సచివాలయంలో సంప్రదిస్తే మొత్తం బాకీ రూ. 15500 ఉందని, రూ. 5480 చెల్లిస్తే సొంత రిజిస్ట్రేషన్ పత్రాలు ఇస్తామన్నారు. సొమ్ము చెల్లించి సొంత ఇంటి పత్రాలు తీసుకున్నా. ఇప్పుడు ఆ పత్రాలతో బ్యాంకులో రుణం పొంది చిల్లర కొట్టు ఏర్పాటు చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటాను.
– బోరుగడ్డ శాంతి, తురకపాలెం
Comments
Please login to add a commentAdd a comment