వ్యవసాయ చట్టాలతో రైతులకు మేలు | Benefit to farmers with agricultural laws says Nirmala Sitharaman | Sakshi
Sakshi News home page

వ్యవసాయ చట్టాలతో రైతులకు మేలు

Published Thu, Oct 8 2020 3:32 AM | Last Updated on Thu, Oct 8 2020 7:27 AM

Benefit to farmers with agricultural laws says Nirmala Sitharaman - Sakshi

సాక్షి, అమరావతి/జక్కులనెక్కలం (గన్నవరం/గన్నవరం రూరల్‌): కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలు రైతులకు మరింత ప్రయోజనం చేకూరుస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు. దళారుల ప్రమేయం ఉండదన్నారు. ఎలాంటి మార్కెటింగ్‌ రుసుములు చెల్లించకుండా రైతులు తమ పంటను దేశంలో ఎక్కడైనా విక్రయించుకునే అవకాశం కలుగుతుందన్నారు. వివిధ వస్తు ఉత్పత్తిదారులు దేశంలో ఎక్కడ మంచి ధర వస్తే అక్కడ అమ్ముకుంటున్నారని.. రైతుకు మాత్రం ఈ హక్కు ఉండకూడదా అని ప్రశ్నించారు. కేంద్రం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలపై అవగాహన కల్పించేందుకు రాష్ట్రాల పర్యటనలో భాగంగా ఆమె బుధవారం విజయవాడలో పర్యటించారు.

బీజేపీ రాష్ట్ర శాఖ రైతులతో నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ప్రసంగించడంతోపాటు తర్వాత మీడియాతోనూ మాట్లాడారు. గతంలో ఇతర రాష్ట్రాలకు వెళ్లి పంటను విక్రయించుకోవాలంటే రైతు 8 శాతం వరకు పన్నుల కింద కట్టాల్సి వచ్చేదని, ఇప్పుడు ఎలాంటి రుసుములూ లేవన్నారు. డిమాండ్‌ ఉన్నా దానికి తగ్గ ధర పొందలేకపోతున్న గుంటూరు మిర్చి, కరివేపాకు రైతులకు ఈ చట్టాల వల్ల అధిక ప్రయోజనం కలిగే వీలుంటుందని చెప్పారు.

దేశవ్యాప్తంగా 10 వేల ఫార్మర్‌ ప్రొడ్యూసింగ్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌పీవో)లను ఏర్పాటు చేయడమే కాకుండా పంట నిల్వకు గ్రామ స్థాయిలో గోడౌన్లను నిర్మించనున్నట్టు తెలిపారు. తక్కువ కాలం నిల్వ ఉండే కూరగాయలను ఫుడ్‌ ప్రాసెసింగ్‌ కోసం పెద్ద సంస్థలు కొనుగోలు చేసేలా నిత్యావసర సరుకుల చట్టంలో మార్పులు చేశామన్నారు. రాష్ట్రాల వ్యవసాయ మార్కెటింగ్‌ చట్టాల్లో కేంద్రం జోక్యం చేసుకోదని స్పష్టం చేశారు. 2022–23 నాటికే ఈ చట్టాల ద్వారా రైతులు ఇప్పుడు పొందే ఆదాయం రెట్టింపునకు చేరుకుంటుందని చెప్పారు. రైతులను గందరగోళ పరిచేలా కాంగ్రెస్, ఇతర పార్టీలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 

కోవిడ్‌–19 పూర్వ స్థితికి ఆర్థిక వ్యవస్థ  
కేంద్ర ఆర్థిక వ్యవస్థ కోవిడ్‌–19 పూర్వ స్థితికి చేరుకుందని ప్రస్తుత గణాంకాలు వెల్లడిస్తున్నాయని నిర్మల వెల్లడించారు. జీఎస్టీ నష్టపరిహారం విషయంలో రాష్ట్రాలతో సుదీర్ఘంగా చర్చలు జరిపామని, ఈనెల 12న జరిగే కౌన్సిల్‌ సమావేశంలో దీనిపై స్పష్టత వస్తుందన్నారు. కాగా, వరికి క్వింటాకు రూ.2 వేలు, చెరకుకు టన్నుకు రూ.2,750కు మద్దతు ధర పెంచాలని రైతులు ఆమెకు విజ్ఞప్తి చేశారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం జక్కులనెక్కలంలోని వ్యవసాయ క్షేత్రాన్ని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా కరివేపాకు రైతులు మాట్లాడుతూ ముంబై, పూణే వంటి నగరాలకు గతంలో ఉత్పత్తులు పంపినప్పుడు రూ.10 వేలయ్యేదని, ఇప్పుడా ఖర్చుల్లేవన్నారు. ఆమె వెంట పార్టీ నేతలు జీవీఎల్‌ నరసింహారావు, సునీల్‌ దియోధర్, కన్నా లక్ష్మీనారాయణ, మాధవ్‌ తదితరులున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement