
సాక్షి, అమరావతి: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్ని నిలిచిపోయిన దశ నుంచి నిర్వహించడాన్ని చట్ట విరుద్ధంగా ప్రకటించి, ఎన్నికల ప్రక్రియను మొదటి నుంచీ నిర్వహించేలా ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలని కోరుతూ బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది. ఎన్నికల నోటిఫికేషన్‌లకు సంబంధించిన తదుపరి చర్యలన్నింటినీ నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ బీజేపీ నేత పాతూరి నాగభూషణం, మరో ముగ్గురు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దీనిని న్యాయమూర్తి జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు శుక్రవారం హౌస్‌మోషన్ రూపంలో విచారించారు.
ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఎన్నికల కమిషన్, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. తదుపరి విచారణను శనివారం మధ్యాహ్నం 2.15 గంటలకు చేపడతామని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఈ లోపు కౌంటర్లను పిటిషనర్ల తరఫు న్యాయవాదికి అందజేయాలని సూచించారు. ఎన్నికల కమిషన్ తరఫున సీనియర్ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి వాదనలు వినిపించారు.