బీజేపీ నేతలు స్థానిక సమరంలో మట్టికరిచారు.. పురపోరులో ‘నోటా’తో పోటీ పడ్డారు.. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలోనూ ఘోర పరాభవం తప్పదనే ఆందోళనలో ఉన్నారు. ముందస్తుగా ఓటమికి సాకులు వెతుక్కునే పనిలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో నకిలీ ఓటరు కార్డులు ఉన్నాయనే వింత వాదనను తెరపైకి తీసుకువచ్చారు.
సాక్షి, తిరుపతి : బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి మంగళవారం తిరుపతిలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె వింత వాదనను వినిపించారు. 2లక్షల నకిలీ ఓటరు కార్డులు ఉన్నాయని, వాటి సాయంతోనే వైఎస్సార్‌సీపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించిందని ఆరోపించారు. బుధవారం ఆ పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ సైతం ఇదే వాదనను మళ్లీ వినిపించారు. దీనిపై పలువురు మేధావులు మాట్లాడుతూ బీజేపీ రాబోయే ఎన్నికల్లో పరాభవానికి సాకులు వెతుక్కుంటోందని అభిప్రాయపడుతున్నారు.
క్షేత్రస్థాయిలో కనీస మాత్రపు పట్టుకూడా లేని బీజేపికి వైఎస్సార్‌సీపీతో పోటీపడే స్థాయి లేదని విశ్లేషిస్తున్నారు. ఎలాగైనా ఓట్లు సాధించి ద్వితీయ స్థానంలో నిలిచి అధికార పార్టీకి తామే ప్రత్యామ్నాయం అని చెప్పుకునేందుకు తంటాలు పడుతున్నారని వెల్లడిస్తున్నారు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల తరహాలోనే తిరుపతి ఉపపోరులో ఓట్లు వస్తే పరువు పోతుందని కొత్త ఎత్తులు వేస్తున్నారని వివరిస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నకిలీ ఓటరు కార్డులపై వ్యాఖ్యానించడం అర్థరహితమని తెలియజేస్తున్నారు. రాబోయే ఓటమికి కారణాలు అన్వేషించుకునేందుకే ఇలాంటి ప్రకటనలు గుప్పిస్తున్నారని విశ్లేషిస్తున్నారు.
చదవండి: హోదా వద్దు అన్నది చంద్రబాబే
Comments
Please login to add a commentAdd a comment