మాట్లాడుతున్న విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ సమన్వయకర్త డి.విజయ్‌కుమార్, సొసైటీ సభ్యులు
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): జనవరి 1వ తేదీ నుంచి 32వ పుస్తక మహోత్సవం నిర్వహిస్తున్నట్లు విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ సమన్వయకర్త డి.విజయ్‌కుమార్ తెలిపారు. ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ.. పుస్తక మహోత్సవం విజయవాడలోని స్వరాజ్ మైదానం లేదా శాతవాహన కళాశాలలో నిర్వహిస్తామని వెల్లడించారు. జనవరి 1వ తేదీ సాయంత్రం 6 గంటలకు రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ జ్యోతి ప్రజ్వలన చేసి పుస్తక మహోత్సవాన్ని ప్రారంభిస్తారన్నారు.
జనవరి 3న రావిశాస్త్రి శత జయంతి సభ, 4న పుస్తక ప్రియుల ర్యాలీ నిర్వహిస్తామన్నారు. 4వ తేదీ సాయంత్రం 6 గంటలకు బాల గంగాధర తిలక్ శత జయంతి సభ, 6వ తేదీ సాయంత్రం ఆత్రేయ శత జయంతి సభ, 7వ తేదీ సాయంత్రం వడ్డాది పాపయ్య శత జయంతి సభ జరుగుతుందన్నారు. పుస్తక మహోత్సవం సందర్భంగా ప్రతిరోజూ వివిధ సామాజిక అంశాలపై మేధో చర్చలు, ప్రముఖుల ప్రసంగాలు, కవి సమ్మేళనం, గోష్టులు, పుస్తకావిష్కరణలు, సాహిత్య కార్యక్రమాలు, విద్యార్థులు, చిన్నపిల్లలకు ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయని వివరించారు.
10న ముగింపు సభ, విద్యార్థులకు బహుమతి ప్రదానోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం పుస్తక మహోత్సవ బ్రోచర్‌ను సొసైటీ సభ్యులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు టి.మనోహరనాయుడు, కార్యదర్శి లక్ష్మయ్య, కోశాధికారి కె.రవి, సంయుక్త కార్యదర్శి కొల్లూరి, ఉపాధ్యక్షుడు బి.రవికుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment