సాక్షి, విశాఖపట్నం: కార్యనిర్వాహక రాజధానిగా విశాఖకు లైన్ క్లియర్ కావడంతో పలు అంతర్జాతీయ కంపెనీలు విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఇందులో భాగంగా ఈ నెల ఆగస్టు 5న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రఖ్యాత బోస్టన్ గ్రూప్ తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. నార్త్ అమెరికా ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పండుగాయల రత్నాకర్, బోస్టన్ గ్రూప్, పీపుల్ ప్రైమ్ వరల్డ్ వైడ్ ఛైర్మన్ సుబ్బు ఒప్పంద పత్రాల పై సంతకాలు చేసుకున్నారు. దీంతో రాష్ట్ర ఐటీ రంగంలో భారీగా ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉంటుంది. విశాఖలో ఏర్పాటు కానున్న ఈ కొత్త కేంద్రం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్), సైబర్ సెక్యూరిటీ మరియు హ్యూమన్ రిసోర్సెస్ వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలపై పరిశోధనలు చేస్తుంది. వైజాగ్ వంటి టూ టైర్ నగరాల్లో గ్రాడ్యుయేట్లు మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ నిపుణుల ప్రతిభ ఆర్ధిక ప్రగతికి బాటలు వేస్తుందని సుబ్బు కోట అన్నారు. (వికేంద్రీకరణే అభివృద్ధి మార్గం)
విజయవాడకు చెందిన సుబ్బు.. భారతీయ-అమెరికన్ పారిశ్రామికవేత్తగా, ఫిలాంత్ర ఫిస్ట్గా గుర్తింపు పొందారు. అమెరికాలో నివాసముంటున్న సుబ్బు కోట గత 50 ఏళ్లలో దాదాపు 50 కంపెనీలను ప్రారంభించారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కన్సల్టింగ్, ఇ-లెర్నింగ్ సర్వీసెస్, ఫార్మాస్యూటికల్స్ రీసెర్చ్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ లో విస్తృత అనుభవాన్ని గడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందంపై సంతకం చేయడం ఆనందంగా ఉందన్నారు. ఏపీ ప్రభుత్వంతో తమ సంబంధాలు బలోపేతం అవుతున్నందుకు హర్షం వ్యక్తం చేశారు. పెట్టుబడులు ఆకర్షించడంలో విశాఖ దేశంలోనే అతిముఖ్యమైన గమ్యస్థానంగా మారుతోందని తెలిపారు. పెట్టుబడులకు విశాఖ అనువైన ప్రాంతమని, ఆర్థిక కేంద్రంగా ఎదిగేందుకు విశాఖకు అన్ని అవకాశాలు ఉన్నాయన్నారు. ప్రపంచం కరోనా కష్టకాలాన్ని ఎదుర్కొంటున్న ఈ పరిస్థితుల్లో ఇటువంటి సహకారాలు ఎంతో అవసరమన్నారు.
పీపుల్ ప్రైమ్ వరల్డ్‌వైడ్ (ది బోస్టన్ గ్రూప్ అనుబంధ సంస్థ) సీఈవో రవి అలెటి మాట్లాడుతూ “కనెక్టివిటీ, కాస్మోపాలిటన్ పాపులేషన్, అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్థలు, యూనివర్శిటీలతో విశాఖకు అన్ని అవకాశాలు ఉన్నాయన్నారు. భవిష్యత్ లో ప్రపంచ నగరంగా విశాఖ రూపుదిద్దుకోబోతుందని తెలిపారు. విశాఖలోని సెజ్ జోన్లలో తమ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నామని, రాష్ట్ర సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖతో కలిసి పని చేస్తామని రవి తెలిపారు. విశాఖను ఐటీ హబ్ గా, గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దేదుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం ఉత్తమమైనదని, ప్రతిభావంతులైన నిపుణులు, ప్రమాణాలతో కూడిన విద్యాసంస్థలకు విశాఖ నెలవు అని తెలిపారు.
ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి నార్త్ అమెరికా పండుగాయల రత్నాకర్ మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి కట్టుబడి ఉందని, సీఎం వైఎస్ జగన్ సారథ్యంలో రాష్ట్రం అన్ని రంగాల్లో విప్లవాత్మక నిర్ణయాలతో దూసుకుపోతోందని అన్నారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి నూతన విధానాన్ని తెచ్చారన్నారు .
బోస్టన్ గ్రూప్ గురించి..
1988 లో ది బోస్టన్ గ్రూప్ స్థాపించబడింది. ఫార్చ్యూన్ 500, మిడ్-మార్కెట్ క్లయింట్లకు సాఫ్ట్‌వేర్ కన్సల్టింగ్ మరియు ఐటి సేవలను అందించే ప్రధాన వ్యాపారంతో ఈ సంస్థ ప్రారంభమైంది. నాటి నుండి, టిబిజి తన సేవలను విస్తరిస్తూ వస్తోంది. ఐటి ఔట్ సోర్సింగ్, ఇ-లెర్నింగ్, ఇ- గవర్నెన్స్ తదితర సేవలను అందిస్తోంది. మొత్తం ఐదు దేశాలలో టీబీజీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఫార్మా, ఫైనాన్స్, ఇన్సూరెన్స్, వస్తు తయారీ, బ్యాంకింగ్, రిటైల్ వంటి అనేక రకాల పరిశ్రమలకు సేవలు అందిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment