బ్రహ్మంగారిమఠం(అన్నమయ్య జిల్లా): పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన గురుపూజ మహోత్సవాల్లో భాగంగా గురువారం బ్రహ్మంగారు, గోవిందమాంబల రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. సాయంత్రం 5 గంటలకు మఠం పెద్దాచార్యులు భద్రయ్య ఆధ్వర్యంలో రథం ప్రారంభానికి సిద్ధమైంది. ముందుగా రథం నిర్మాణ ఉభయ దాతలకు సన్మానం చేశారు.
అనంతరం దివంగత మఠాధిపతి పెద్దకుమారుడు వెంకటాద్రిస్వామి దంపతులతోపాటు ఆయన తమ్ముళ్లు, రెండవ భార్య కుమారులు రథానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు స్థానిక మఠం మేనేజర్ ఈశ్వరాచారితో కలిసి రథం వద్దకు చేరుకోగానే ఆలయ పూజారులు పూజలు చేశారు.అనంతరం గోవింద నామ స్మరణతో భక్తులు రథాన్ని లాగారు. ఈ కార్యక్రమంలో బద్వేలు ఆర్డీఓ వెంకటరమణ, జిల్లా దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్, మఠం పరిపాలన ఫిట్‌పర్సన్ శంకర్ బాలాజీ, తహసీల్దార్ లక్ష్మీనారాయణ, ఎంపీడీఓ వెంగమునిరెడ్డి, ఎంపీపీ సి.వీరనారాయణరెడ్డి, ఈశ్వరీదేవిమఠం పీఠాధిపతి వీరశివకుమారస్వామి పాల్గొన్నారు.
కిక్కిరిసిన భక్తజనం
వీరబ్రహ్మేంద్రస్వామి, గోవిందమాంబల రథోత్సవంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని బ్రహ్మంగారు, గోవిందమాంబలను కళ్లారా చూసి తరించారు. వర్షం వస్తున్నా లెక్క చేయకుండా రథోత్సవాన్ని తిలకించేందుకు గురువారం మధ్యాహ్నం నుంచి భక్తులు వేచి ఉండడమేగాకుండా రథోత్సవం ముగిసేంత వరకు ఉన్నారు.
రథోత్సవ శుభ్రత బాధ్యత లింగాలదిన్నెపల్లె భక్తులదే
ఆరాధన మహోత్సవాల్లో భాగంగా బ్రహ్మరథోత్సవ శుభ్రత బాధ్యతను మండలంలోని లింగాలదిన్నెపల్లె భక్తుడు ఎల్.కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఆ గ్రామానికి చెందిన భక్తులు మూడు రోజుల పాటు చేపట్టారు. గురువారం రథోత్సవం రోజు కూడా కీలకంగా వ్యవహరించారు. రాత్రి గజవాహనోత్సవంలో బ్రహ్మంగారు, గోవిందమాంబలు పురవీధుల్లో తిరిగారు.
భారీ పోలీసు బందోబస్తు: మైదుకూరు డీఎస్పీ మురళీదర్‌గౌడ్, రూరల్ సీఐ నరేంద్రరెడ్డిల ఆధ్యర్యంలో ఎస్‌ఐ విద్యాసాగర్ పర్యవేక్షణలో జిల్లా నుంచి సీఐలు, ఎస్‌ఐలు, ఏఎస్‌ఐలు, హెచ్‌సీలతోపాటు 400 మంది పోలీసులు, హోంగార్డులు, మహిళా పోలీసులు బందోబస్తు విధులు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment