CBN: కళ్లు మూసుకుని అవినీతిని ప్రోత్సహించి.. | Chandrababu Naidu Arrested: How AP Skill Development Scam Unfolded - Sakshi
Sakshi News home page

కళ్లు మూసుకుని అవినీతిని ప్రోత్సహించి...పాతాళభైరవిని మించిన మాయలు

Published Sat, Sep 9 2023 1:15 PM | Last Updated on Sat, Sep 9 2023 3:17 PM

CBN Arrested: How AP skill development scam unfolded - Sakshi

పాతాళభైరవి సినిమాలో మించిన మాయలు కనిపిస్తాయి
అలీబాబా దొంగలను మించిన దోపిడీ పర్వం కనిపిస్తుంది
ప్రజా ధనానికి కాపలాదారులే దోపిడీదారులయ్యారు
ప్రపంచంలో పేరుమోసిన మోసగాళ్లు కూడా వీరిముందు పనికిరారు
స్కిల్‌డెవల్‌మెంట్‌ స్కాంలో ఇలాంటి కుట్రకోణాలు ఎన్నోవెలుగుచూశాయి.
అవినీతి పరులైన ప్రభుత్వ పెద్దలు..
లంచాలు మరిగిన కొందరు అధికారులు..

మోసాలే చిరునామాగా మార్చుకున్న మరికొందరు వ్యాపారస్తులు.. 
ఇలా.. అందరూ ఒక గజదొంగలముఠాగా ఏర్పడ్డారు. 


నిబంధనలు చట్రం లేకుండా, నియమాలను బేఖాతరుచేస్తూ, పాలనా విధానాలను అపహాస్యం చేస్తూ..
చివరకు చట్టానికి దొరక్కుండా ఈ ముఠా చేసిన పన్నాగాలు ఒక్కొక్కటిగా బయటకువస్తున్నాయి
ఈ మహా స్కాంలో పైస్థాయి నుంచి కిందిస్థాయివరకూ అందరూ పాత్రధారులే.
ఈ స్కాం గురించే ఈడీ ఇటీవల దాడులు చేసి, అరెస్టు చేసింది. ఇప్పుడు ఏకంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ప్రధాన నిందితుడిగా నిర్ధారించుకుని ఏపీ సీఐడీ అరెస్ట్‌ చేసింది. 

సీమెన్స్‌ ఇండియా సాఫ్ట్‌వేర్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ మాజీ ఎండీ సౌమ్యాద్రిశేఖర్‌బోస్, డిజైన్‌టెక్‌ సిస్టమ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ వికాస్‌ వినాయక్‌ ఖాన్విల్కర్, మాజీ ఫైనాన్షియల్‌ అడ్వైజర్‌ ముకుల్‌ చంద్రఅగర్వాల్‌ను అరెస్టుచేసినట్టుగా ఈడీ ప్రకటించింది. అలాగే స్కిలర్‌ ఎంటర్‌ప్రైజెస్ ఇండియా ప్రైవేట్‌లిమిటెడ్‌ ఆథరైజ్డ్‌సిగ్నేచరీ సురేష్‌గోయల్‌ కూడా అరెస్టయినవారిలో ఉన్నారు. నిధులను దుర్వినియోగంచేసి..మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని కేసు నమోదు చేసింది.

అధికారంలోకి బాబు.. స్కిల్‌ స్కాం మొదలు
2014 ఎన్నికల్లో యువతకు చంద్రబాబు ఇచ్చిన హామీ ఇంటికో ఉద్యోగం ఇస్తానని.. అది ఇవ్వలేని పక్షంలోప్రతినెలా నిరుద్యోగభృతి ఇస్తానంటూ ఇంకో హామీ ఇచ్చాడు.    ఐదేళ్లపాలనలో చంద్రబాబు చేసింది ఏంటంటే.. ఇంటికో ఉద్యోగం మాట దేవుడెరుగు, రావాల్సిన ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టేశాడు. ఏకంగా రాష్ట్రంలోని యువత భవిష్యత్తును సర్వనాశనం చేశాడు. ఎన్నికల్లో మళ్లీ మోసం చేయాలనే ఉద్దేశంతో నిరుద్యోగభృతిని ఎన్నికలకు ముందు..చివరినెలల్లో అలా విదిల్చాడు.  యువతకుతానుఇచ్చినహామీలనునెరవేర్చలేదుగానీ, వారికిశిక్షణఇస్తామంటూ రూ.3,356 కోట్లప్రాజెక్టును చంద్రబాబు దోచుకున్నారు.  

2014 ఎన్నికల తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అధికారంచేపట్టారు. చంద్రబాబు జూన్‌లో అధికారం చేపడితే..  రెండునెలల వ్యవధిలోనే ఈ స్కిల్‌డెవలప్‌మెంట్‌ పేరిట స్కాం ఊపిరిపోసుకుంది. నిరుద్యోగులైన యువతీయువకులకు ఆశలు చూపించి దోపిడీ పర్వానికి తెరతీశారు. 
చంద్రబాబు అధికారంలోకి రాగానే.. తెలంగాణలోని మెదక్‌కు చెందిన ఇల్లెందుల రమేష్‌ కీలకంగా వ్యవహరించారు. భారత్‌లో సీమెన్స్‌ కంపెనీకి ఎండీగా పనిచేస్తున్న సౌమ్యాద్రి శేఖర్‌ బోస్‌కు, డిజైన్‌టెక్‌ ఎండీ వికాస్‌ ఖాన్విల్కర్‌కు సీఎం అపాయింట్‌మెంట్‌ ఇప్పించింది ఇల్లెందుల రమేషే. 2014 ఆగస్టులో వీళ్లు.. ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుకు తమ ప్రతిపాదిత ప్రాజెక్టుపై ఒక ఒకపవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. 

ఈ సమావేశం తర్వాత యువతకు శిక్షణ పేరిట స్కిల్‌డెవలప్‌మెంట్‌ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.3,356 కోట్లు అవుతుందని, ఇందులో ఏపీ ప్రభుత్వం 10శాతం ఇచ్చేట్టుగా, మిగిలిన 90 శాతం గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ కింద సీమెన్స్‌ డిజైన్‌టెక్‌ల నుంచి భరిస్తున్నట్టుగా పేర్కొన్నారు. ఇది జరిగిన కొన్నిరోజులకే స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ఎండీగా ఉన్న గంటా సుబ్బారావు ప్రభుత్వానికి ఒక నోట్‌ పెట్టారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు అమలుకు అనుమతి ఇవ్వాలని, అందుకు ప్రభుత్వం కూడా నిధులు కేటాయించాలని సదరు నోట్‌ ద్వారా కోరారు. 

ఫిబ్రవరి 16, 2015న ఈ నోట్‌ రాష్ట్రమంత్రివర్గంలో చర్చకు వచ్చింది. అజెండా కాపీలో లేనప్పటికీ.. గంటా సుబ్బారావు నోట్‌ను స్పెషల్‌ ఐటెంగా అప్పటి ప్రభుత్వం కేబినెట్‌ భేటీలోకి తీసుకువచ్చి.. ఆమోదింపచేసింది. దీనిపై తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా ఫిబ్రవరి 26వ తేదీన ప్రొసీడింగ్స్‌ ఇచ్చారు. మంత్రివర్గం ఆమోదం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం 2015, జూన్‌30వ తేదీన జీవోఎంఎస్‌ నంబర్‌4ను విడుదల చేసింది.

దాన్నే.. ప్రాజెక్టు రిపోర్టుగా తీసుకున్నారు

సీమెన్స్‌ డిజైన్‌టెక్‌ తయారుచేసిన ప్రాజెక్టు కాస్ట్‌ ఎస్టిమేషనే ప్రాజెక్టు రిపోర్టుగా తీసుకున్నారు. సాధారణంగా రాష్ట్రప్రభుత్వం ఏదైనా ఒక ప్రాజెక్టు తీసుకునే ముందు విధిగా కొన్నినియమాల్ని, నిబంధనల్ని పాటిస్తుంది. ప్రాజెక్టు అమలు కోసం ప్రజాధనాన్ని ఖర్చు చేయాల్సి ఉంటుంది. కాబట్టి, అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటుంది.  ప్రాజెక్టు ఎలా అమలు చేస్తారు?. ఏవిధంగా అమలు చేస్తారు?.. దీనిలోప్రభుత్వం వాటా ఎంత? మిగిలిన వారి వాటా ఎంత? ప్రభుత్వం ఏ రూపంలో ఖర్చు చేస్తుంది? మిగిలిన వారు డబ్బు రూపంలో ఖర్చుచేస్తారా? లేకవస్తు రూపంలో ఖర్చుచేస్తారా? ప్రతిస్థాయిలో కూడా ఖర్చు ఎంత ఉంటుంది? దాన్ని ఏరకంగా చేరుకుంటారు? ఫలితాలు ఎలా సాధించాలి? లక్ష్యాల సాధనకు నిర్దేశిత సమయం ఏంటి? ఏ స్థాయిలో ఎవరి బాధ్యత ఎంత ఉంటుంది? ఇలా అన్నిరకాలకోణాల్లో పూర్తిగా అధ్యయనం చేసి, అందుబాటులో అత్యుత్తమ విధానాలను పేర్కొంటూ సమగ్రమైన ప్రాజెక్టు రిపోర్టు( డిటైల్డ్‌ప్రాజెక్టురిపోర్టు  డీపీఆర్‌)ను తయారు చేయాల్సి ఉంటుంది. తర్వాత ఈ రిపోర్టును ఆధీకృత సంస్థ చేత ధృవీకరణ చేయిస్తారు. పలుదఫాల్లో దీనిపై చర్చలు జరుగుతాయి. సమగ్ర పరిశీలన జరుగుతుంది. 
 
అయితే చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన స్కిల్‌డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు కోసం డిటైల్డ్‌ ప్రాజెక్టు రిపోర్టుకాని, వ్యయం అంచనాలపై ఆధీకృత సంస్థ చేత ధృవీకరణలాంటివి లేవు. ప్రజాధనాన్ని కాజేసే ప్రయత్నాల్లో భాగంగానే వీటిని ఉద్దేశపూర్వకంగా పట్టించుకోలేదు. డీపీఆర్‌ను తయారుచేయించకుండా సీమెన్స్‌ డిజైన్‌టెక్‌ తమకు తాముగా తయారుచేసుకున్న అంచనా వ్యయాన్నే డీపీఆర్‌గా చూపిస్తూ స్కిల్‌డెవలప్‌మెంట్‌ ఎండీ ఉన్న గంటాసుబ్బారావు కేబినెట్‌కు నోట్‌పెట్టారు. ఈనోట్‌పైనే మంత్రివర్గం చర్చించి.. ప్రాజెక్టు అమలుకు ఓకే చెప్పేశారు. తర్వాత జీవో కూడా విడుదల చేశారు. సమగ్రమైన డీపీఆర్‌ లేకుండా, ఈపద్ధతిలో కేబినెట్‌కు నోట్‌ పెట్టడం అన్నది నియమాలకు, నిబంధలనకు, రూల్స్‌కు పూర్తిగా విరుద్ధం. 
 
సీమెన్స్‌ డిజైన్‌ టెక్‌ తమకు తాముగా తయారు చేసుకున్న అంచనాలు కూడా కుట్రపూరితమే. ఆ కంపెనీలకు చెందిన ఎండీలు, అప్పటి ప్రభుత్వ పెద్దలు కుమ్మక్కై ప్రభుత్వం వాటాగా రూ.330 కోట్లను ముందుగానే నిర్ణయించుకుని, ఈ అంచనాలు తయారు చేసినట్టుగా దర్యాప్తులో వెలుగుచూశాయి. దీనికి సంబంధించిన అన్ని ఆధారాలూ దర్యాప్తు అధికారులకు లభించాయి. 

ప్రతి దశలోనూకుట్ర..మోసం
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోలో నైపుణ్యాభివృద్ధి కోసం రాష్ట్రంలో 6 క్లస్టర్స్‌ఏర్పాటు చేస్తామని, ఒక్కో క్లస్టర్‌లో ఒక సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్, 5 టెక్నికల్‌ స్కిల్‌డెవలప్‌మెంట్‌ ఇనిస్టిట్యూషన్స్‌ కూడా ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఒక్కో సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ మరియు దాని కింద ఏర్పాటు చేసే 5 టెక్నికల్‌ స్కిల్‌డెవలప్‌మెంట్‌ ఇనిస్టిట్యూషన్స్‌కు కలిపి మొత్తంగా రూ.546,84,18,908 లు ఖర్చు చేస్తామని, ఇందులో 90శాతం ఖర్చును సీమెన్స్‌ మరియు డిజైన్‌టెక్‌ “గ్రాంట్‌ఇన్‌ఎయిడ్‌’’ కింద అందిస్తుందని, మిగిలిన 10శాతం ఖర్చును అంటే రూ.55,00,00,000లను రాష్ట్రప్రభుత్వం భరించాలని జీవోలో స్పష్టంగాపేర్కొన్నారు.
  ఈ లెక్కన మొత్తం ప్రాజెక్టు వ్యయంలో 10శాతం కింద రూ.370,78,80,000లను ప్రభుత్వం చెల్లించనున్నట్టు జీవోలో చెప్పారు.

ఏదైనా ప్రాజెక్టు ఖర్చులో భాగంగా గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ వచ్చింది అంటే.. సులభమైన భాషలో చెప్పాలంటే.. ఆ డబ్బును తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు అని అర్థం. 
కాని ఈ ప్రాజెక్టులో గ్రాంట్ ఇన్‌ ఎయిడ్‌ ఏ రూపంలో వస్తుంది? సీమెన్స్‌ డిజైన్‌టెక్‌లు గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ను ఏ రూపంలో ఇస్తున్నాయి? డబ్బు రూపంలో ఇస్తున్నారా? లేకవస్తువుల రూపంలో ఇస్తున్నారా? లేకటెక్నాలజీ రూపంలో ఇస్తున్నారా? ఈ అంశాలన్నింటినీ కలిపి గ్రాంట్‌ఇన్‌ఎయిడ్‌గా ఇస్తున్నారా? ఇస్తేదేనివాటా ఎంత? అన్నదానిపై ఇక్కడ ఎలాంటి స్పష్టతా లేదు.

ఒక్కో క్లస్టర్‌కు ప్రభుత్వం వాటాగా రూ.55 కోట్లు ఎలా నిర్ణయించారన్న విషయం సీమెన్స్‌ డిజైన్‌టెక్‌ సొంతంగా తయారు చేసిన ఎస్టిమేషన్స్‌లో కూడా లేదు.
దురుద్దేశంతోనే రాష్ట్ర స్కిల్‌డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఎండీగా ఉన్న గంటాసుబ్బారావు, డైరెక్టర్ లక్ష్మీనారాయణలు డిటైల్డ్‌ప్రాజెక్టురిపోర్టు (డీపీఆర్‌)ను తయారు చేయించలేదు. ఇదంతా కుట్రలో ఒక భాగమే. 

జీవోలో అలా.. ఒప్పందంలో మరోలా..  అంతా దోపిడీమయం
ప్రభుత్వం జీవో విడుదల చేయగానే మూడుపార్టీల మధ్య ఒప్పందం కుదిరింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రనైపుణ్యాభివృద్ధిసంస్థ (APSSDC), సీమెన్స్‌ డిజైన్‌టెక్‌లమధ్య ఈ ఒప్పందంకుదిరింది. కానీ.. కేబినెట్‌ నిర్ణయం ఆధారంగా వచ్చిన జీవోలో పేర్కొన్న నియమని బంధనలను అనుసరించి ఈ ఒప్పందం కురదలేదు. ప్రాజెక్టు వ్యయంలో 90శాతం సీమెన్స్‌ డిజైన్‌టెక్‌ కంపెనీలు భరిస్తాయని ప్రభుత్వం జీవోలో చెప్పగా.. ఒప్పందం దగ్గరకు వచ్చేసరికి ఆ ప్రస్తావనే లేదు. ఒప్పందంలో ఈ అంశాన్ని ఉద్దేశపూర్వకంగానే ఎగరగొట్టారు. వందలకోట్లను స్వాహా చేయాలన్న ఉద్దేశంతోనే దీనికి తెగబడ్డారు.

ప్రతిపాదితనైపుణ్యాభివృద్ధి కార్యక్రమానికి.. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పన్నులు కాకుండా రూ.330 కోట్లరూపాయలను ఆర్థికసహాయం కింద అందిస్తుందని ఒప్పందంలో పేర్కొన్నారు. ఇలా పేర్కొనడం.. జీవోకుపూర్తిగావిరుద్ధం. ప్రాజెక్టువ్యయంలో 90 శాతాన్ని గ్రాంట్‌ఇన్‌ఎయిడ్‌గా సీమెన్స్‌ డిజైన్‌టెక్‌ అందిస్తాయని, 10శాతం ప్రభుత్వం భరిస్తుందని జీవోలో పేర్కొనగా, ఒప్పందం దగ్గరకు వచ్చేసరికి మోసపూరితంగా వ్యవహరించి అగ్రిమెంటు స్వరూపాన్ని పూర్తిగా మార్చేశారు.  ప్రాజెక్టు వ్యయంలో ప్రభుత్వం అందించే 10శాతం నిధుల్ని, ఆర్థికసహాయంగా ఒప్పందంలో పేర్కొనడం చూస్తే..  ప్రజల డబ్బును కాజేయాలనే ఉద్దేశం ఇందులో చాలాస్పష్టంగా కనిపిస్తోంది. కుదుర్చుకున్న ఒప్పందంలో ఏ లెటర్‌ ఆధారంగా..  ఏ తేదీన జారీచేసిన ఏ జీవోఆధారంగా..  ఈ ఒప్పందం కుదుర్చుకున్నారనే విషయాన్ని రాయలేదు. ఈ వివరాలు నింపాల్సిన చోట నింపకుండా ఖాళీగా విడిచిపెట్టారు. డబ్బుకాజేశాక దర్యాప్తు సంస్థల నుంచి.. చట్టం నుంచి తప్పించుకునే ఉద్దేశంతో ముందస్తుగానే ఈ పన్నాగానికి తెరలేపారని అర్థం అవుతోంది. 

ఒప్పందం కుదిరిన తర్వాత డబ్బు విడుదల కోసం రాష్ట్రప్రభుత్వానికి రాసిన లేఖలో తాము పలానా తేదీన ఒప్పందం కుదుర్చుకున్నామంటూ, వెంటనే డబ్బు విడుదల చేయాలని సీమెన్స్‌ డిజైన్‌టెక్‌లు లేఖ రాశాయి. ఈ లేఖలో పేర్కొన్న ప్రకారం.. జీవో విడుదలైన రోజునే అంటే జూన్‌30, 2015నే అగ్రిమెంట్‌ కుదుర్చుకున్నట్టుగా తెలుస్తుంది తప్ప.. వాస్తవంగా ఎప్పుడు ఒప్పందం జరిగిందనేది స్పష్టంగా లేదు.

ప్రభుత్వం జారీచేసిన జీవోలో భాగం

జీవోకువిరుద్ధంగాఒప్పదంలోనిభాగం

కళ్లుమూసుకుని 5 దఫాల్లో డబ్బు విడుదల
ప్రజల డబ్బును దోచుకోవాలని కుట్ర చాలా స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ.. ప్రభుత్వం జారీచేసిన జీవోకు విరుద్ధంగా ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ, సీమెన్స్‌ డిజైన్‌టెక్‌ల నుంచి ఒక్కపైసా కూడా గ్రాంట్‌ఇన్‌ఎయిడ్‌ కింద రాకపోయినప్పటికీ కూడా.. నాటి ప్రభుత్వ పెద్దలు పట్టించుకోలేదు. డబ్బు విడుదల చేసే సమయంలో పాటించాల్సిన విధానాలు, ఒప్పందాలు, పత్రాలను ఇతరత్రా పరిశీలన చేయకుండానే ఐదు దఫాలుగా అంత పెద్దమొత్తం సొమ్మును విడుదల చేశారు. 

ఒప్పందంకుదిరిన తర్వాత డబ్బు విడుదల చేయాలంటూ ఏపీఎస్‌ఎస్‌డీసీ ఎండీ గంటా సుబ్బారావు పలుమార్లు ప్రభుత్వానికి లేఖలు రాశారు. డబ్బు విడుదల సమయంలో ఆర్థికశాఖలో అధికారిణి పలుఅభ్యంతరాలు లేవనెత్తినా పట్టించుకోలేదు. ఈ అభ్యంతరాలను పక్కనపెట్టి డిసెంబర్‌2015-మార్చి, 2016 మధ్య ఐదు దఫాల్లో పన్నులతో కలిపి మొత్తంగా రూ.371 కోట్లను విడుదల చేసేశారు. 2015 డిసెంబర్‌ 5వ తేదీన మొదటి విడతలో రూ. 185 కోట్లు,  2016 జనవరి 29వ తేదీన రూ. 85 కోట్లు,  2016 మార్చి 11వ తేదీన రూ. 67 కోట్లు, 2016 మార్చి 31వ తేదీన రూ. 34.25 కోట్లు.. మొత్తంగారూ. 371. 25 కోట్లరూపాయలను డిజైన్‌టెక్‌ రాష్ట్రప్రభుత్వం విడుదల చేసింది. 
 
ఇలా ఐదు దఫాలుగా డబ్బు విడుదల చేస్తున్నప్పుడు సీమెన్స్‌ లేదా డిజైన్‌టెక్‌ నుంచి ఒక్కపైసా అయినా రాలేదనే విషయం తెలిసి కూడా డబ్బును విడుదల చేశారు. 
డిటైల్డ్‌ ప్రాజెక్టు రిపోర్టు అన్నది లేకపోవడంతో ఒప్పందంలో భాగంగా ఏయే పరికరాలు క్లస్టర్లలో ఏర్పాటు చేస్తారన్న విషయంలో ఎలాంటి స్పష్టత లేదు. సీమెన్స్‌ డిజైన్‌టెక్‌లు కంప్యూటర్లు, సాఫ్ట్‌వేర్‌, ఇతరత్రా హార్డ్‌వేర్‌ వంటి సామగ్రిని బిగించకుండానే.. అంటే ఇన్‌స్టాల్చేయకుండానే ప్రభుత్వం నుంచి డబ్బు విడుదల చేయడం కుంభకోణాన్ని మరింత రుజువు చేస్తోంది. వారు ఏం పెట్టారు? ఎంత ఖర్చుచేశారు? అనే విషయాల్ని ధృవపరిచే ప్రక్రియ డబ్బు విడుదల చేసిన తర్వాత నామమాత్రంగా చేశారు. అదీ కూడా తప్పుడు పద్ధతుల్లో చేశారు. 

అవీనీతికి సీమెన్స్‌ ముసుగు
ఏపీ ప్రభుత్వంతో ఇలాంటి ఒప్పందం ఒకటి ఉందనికాని, 90 శాతం నిధులను తాము పెడుతున్నట్టుకాని సీమెన్స్‌ ఉన్నతస్థాయికి తెలియదు. ఇదేవిషయాన్ని సీమెన్స్‌ తన అంతర్గత విచారణలో తేల్చి చెప్పింది. ఈ నిధులు కాజేయడానికి వీలుగా అప్పట్లో.. సీమెన్స్‌ భారత విభాగానికి ఎండీ ఉన్న సౌమ్యాద్రి శేఖర్‌ బోస్‌ తనపేరును సుమన్‌ బోస్‌గా మార్చుకున్నారు. పేరుకు సీమెన్స్‌తో ఒప్పందం కుదిరినట్టు చూపించారుకానీ వాస్తవంగా ఒప్పందం కుదుర్చుకున్నది సౌమ్యాద్రి శేఖర్‌ బోస్‌ అలియాస్‌ సుమన్‌ బోస్‌. పూర్తి పేరుతో కాకుండా ఈ పేరుతోనే ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందంలో సంతకం చేశారు. ఇన్ని వందలకోట్ల రూపాయలతో ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు అసలు పేరుతోనే సంతకాలు చేయాలన్న కనీస నిబంధనను పట్టించుకోలేదు.

ప్రజల డబ్బు..షెల్‌కంపెనీలద్వారా..సొంతజేబులోకి:
స్కిల్‌డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న కంపెనీలు సీమెన్స్, డీజైన్‌టెక్‌. కానీ..  ప్రభుత్వం నుంచి వచ్చిన సొమ్మును కాజేసేందుకు పదుల కొద్దీ షెల్‌ కంపెనీలను సృష్టించారు. గొలుసుకట్టు మాదిరిగా క్రియేట్‌ చేసిన ఈషెల్‌ కంపెనీల్లోకి మొత్తం డబ్బు వెళ్లింది. దేశం దాటివిదేశాలకు కూడా వెళ్లింది. ఏ కంపెనీలకైతే డబ్బు చెల్లించారో ఆ కంపెనీలు అసలు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సర్వీసులు కూడా ఇచ్చేవికావు. కేవలం డబ్బును మళ్లించడం కోసమే ఈ షెల్‌ కంపెనీలను ఏర్పాటు చేసినట్టు స్పష్టమవుతోంది. 

ఏపీ స్టేట్‌ స్కిల్‌డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌కు రాష్ట్రప్రభుత్వం నుంచి రూ.371.25 కోట్లు డిజైన్‌టెక్‌కు బదిలీ అయితే..  ఆ డబ్బు పీవీఎస్‌పీ స్కిలర్‌ కంపెనీకి, ఏసీఐ అనే ఒక షెల్‌ కంపెనీకి బదిలీ చేశారు. స్కిలర్‌కు రూ.238.29 కోట్లు , ఏసీఐ షెల్‌ కంపెనీకిరూ.58 కోట్లు బదిలీచేశారు. పీవీఎస్‌పీ స్కిలర్‌ కంపెనీ నుంచి ఆ డబ్బు మళ్లీ ఏసీఐ షెల్, నాలెడ్జ్‌ ఈ పోడియం, ఈటీఏ, ఐటీస్మిత్, భారతీయగ్లోబల్, ఇన్వెబ్, పోలారిస్, కేడెన్సీ పార్ట్‌నర్‌లకు ఈ డబ్బు వెళ్లింది.  ఇవన్నీ కూడా షెల్‌కంపెనీలే. సింగపూర్‌లోనిబెన్‌ రీసెర్చ్, ఒక హాస్పిటల్‌ లాంటి కంపెనీ, ఇంక్‌ ఫిష్‌కూ డబ్బు వెళ్లింది.

డబ్బు మళ్లింపులో ఇదొక భాగంమాత్రమే.
రాష్ట్రం ప్రభుత్వం ఇచ్చిన డబ్బును ఇలా వివిధ మార్గాల్లో మళ్లించేశారు. 
డబ్బు ఏయే కంపెనీలకు ఎలా వెళ్లిందో కింద స్పష్టంగాచూడొచ్చు.

ప్రభుత్వం ఇచ్చిన సొమ్మును అనేక కంపెనీల ద్వారా, పదుల కొద్దీ కంపెనీలకు మళ్లించారు. ఇలా తరలివెళ్లిన డబ్బుకు సంబంధించి ఒక తీగను అధికారులు లాగితే.. పదుల కొద్దీ కంపెనీలు బయటపడ్డాయి. డిజైన్‌టెక్‌కు ఏపీ స్కిల్‌డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ నుంచి రూ. 371.25 కోట్లు ఐదు దఫాల్లో వచ్చాయి. తర్వాత ఇందులోపీవీఎస్‌పీ స్కిలర్‌ కంపెనీకి రూ. 238.29కోట్లు వెళ్లాయి. పీవీఎస్‌పీ స్కిలర్‌ కంపెనీ నుంచి మరొకషెల్‌ కంపెనీ ఏసీఐకి రూ.56  కోట్లు, డిజైన్‌టెక్‌నుంచి రూ.1.19 కోట్లు వెళ్లాయి. మొత్తంగా ఈ రూ.58 కోట్లు 34 కంపెనీలకు వెళ్లాయి. అక్కడనుంచి మరో 34 కంపెనీలకు ఈ డబ్బును మళ్లించారు. డబ్బుమళ్లింపులో ఈ గొలుసుకట్టులో ఒక భాగం మాత్రమే. దోచుకున్న ఈ సొమ్మును షెల్‌ కంపెనీల ద్వారా ఎలా తరలించారో చెప్పడానికి పైనచెప్పింది ఒక ఉదాహరణ మాత్రమే. మిగతా కంపెనీల బాగోతాలను కూడా దర్యాప్తు అధికారులు శోధిస్తున్నారు. 

అక్కడనుంచి ఇది ఎవరిచేతుల్లోకి వెళ్లిందన్న దానిపై ఇప్పుడు రాష్ట్రదర్యాప్తు సంస్థ దృష్టిపెట్టింది.  దీనికి సంబంధించి సీమెన్స్‌ ఇండియా ఎండీ సుమన్‌బోస్, డిజైన్‌టెక్‌ ఎండీ వికాస్‌ఖానిల్వికర్‌ ఇద్దరూ చేసుకున్న మెసేజ్‌లు, సందేశాలను దర్యాప్తుసంస్థ అధికారులు ఛేదించారు. ఈమెసేజ్‌ల్లో “హైదరాబాద్‌కు రెండు టోకెన్లు వెళ్లాయి’’ అనే మెసేజ్‌కూడా ఉంది. ఈ టోకెన్లు ఎవరెవరు తీసుకున్నారు? ఈ కోడ్‌భాష్‌వెనుక ఎంత డబ్బు దాగిఉంది? అది ఎవరిచేతుల్లోకి వెళ్లిందన్నదానిపై అధికారులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. 

స్కాం బయటపడింది ఇలా, తీగలాగితే..డొంక కదిలింది:
వందల కోట్ల ప్రజాధనం మరొకరు కాజేస్తున్నప్పుడు ఏ ప్రభుత్వమైనా అప్రమత్తమవుతోంది. వెంటనే చర్యలు తీసుకుని.. ఆ డబ్బును కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది. కారకులను చట్టం ముందు నిలబెతుంది. కానీ స్కిల్‌స్కాంలో అవేమీ జరగలేదు. కారణం.. ప్రభుత్వ పెద్దలే ఇందులో భాగస్వాములు కావడం.  వాస్తవంగా స్కిల్‌స్కాం గురించి ఒక అజ్ఞాత వ్యక్తి రాష్ట్రంలో ఏసీబీకి కాల్‌ చేస్తూ.. పుణె కేంద్రంగా ఉన్న డిజైన్‌టెక్‌ పెద్దఎత్తున ప్రజాధనాన్ని కాజేస్తోందని, పన్నులు ఎగ్గొడుతోందని కాల్‌ చేశారు. ఈ కాల్‌ 2018లో వచ్చింది. ప్రభుత్వానికి ఒక విజిల్‌బ్లోయర్‌ ఈ రకంగా జూన్‌ 2018న ఒక హెచ్చరిక జారీచేశారు. కీలక సమాచారం అందించారు. కాని అప్పటి చంద్రబాబు ప్రభుత్వం అది పట్టించుకోలేదు.

ఈ స్కాం మరో కోణంలో కూడా బద్దలైంది. స్కిల్‌స్కాంలో ప్రధాన పాత్ర పోషించినపీవీఎస్‌పీ స్కిల్లర్, డిజైన్‌టెక్‌.. ఈరెండు కంపెనీలు సర్వీస్‌ ట్యాక్స్‌ కట్టకుండా సెన్‌వాట్‌ కోసం క్లెయిమ్‌ చేశాయి. తాను చెల్లించిన పన్నులను క్లయిమ్‌ చేసుకునేందుకు ఈ రెండు కంపెనీలు జీఎస్టీ అధికారులకు దరఖాస్తు చేసుకున్నాయి. ఇన్ని కోట్ల రూపాయల మేర క్లెయిమ్‌ చేయడంతో జీఎస్టీ అధికారులకు అనుమానం వచ్చి.. ఆ కంపెనీ లావాదేవీలపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టారు. డిజైన్‌టెక్‌ సహా షెల్‌ కంపెనీల అడ్రస్‌ల్లోనూ, సీమెన్స్‌ ఇండియా కార్యాలయంలోనూ సోదాలు నిర్వహించారు. వందలకోట్ల డబ్బులు హవాలా మార్గంలో తరలించినట్టు ఆ తనిఖీల్లో వెల్లడైంది. ఈ అక్రమాలపై సీమెన్స్‌ ప్రధాన కార్యాలయానికి కూడా సమాచారం అందించారు. 

2017లోనే ఇది బయటపడింది.
తమకు తెలియకుండా ఇంత వ్యవహారం నడవడంపై సీమెన్స్‌ సంస్థ ఉలిక్కిపడింది. వెంటనే అంతర్గత విచారణకు ఆదేశించింది. ఈ విషయం తెలియగానే సుమన్‌బోస్‌ డిజైన్‌టెక్‌తో నిర్వహించిన ఉత్తరప్రత్యుత్తరాలు, ఈ మెయిల్స్, టెక్ట్స్‌మెసేజ్‌లు అన్నీకూడా డిలీట్‌ చేశారు. అయితే తమకున్న అత్యున్నత సాంకేతికపరిజ్ఞానాన్ని వినియోగించి వాటన్నింటినీ కూడా సీమెన్స్‌ సంస్థ రిట్రీవ్‌ చేయగలిగింది. డిజైన్‌టెక్‌తో సుమన్‌బోస్‌ నడిపిన వ్యవహారంపై పూర్తి ఆధారాలను సంపాదించింది. ఇక చేసేది లేక సుమన్‌బోస్‌ రాజీనామా చేసి వెళ్లిపోయారు. అప్పుడు సుమన్‌బోస్‌ వ్యవహారంతో కంపెనీకి ఎలాంటి సంబంధంలేదని సీమెన్స్‌ స్పష్టంచేసింది. 2017లోనే ఈ వ్యవహారం అంతా జరిగింది. తర్వాత కూడా సీమెన్స్‌ తన అంతర్గత విచారణను కొనసాగించింది.

కోర్టుకు కీలక వాంగ్మూలం
 ఇదే అంశాన్ని సీమెన్స్‌ సంస్థ దర్యాప్తు అధికారులకు, ఆ సంస్థ ఉన్నతాధికారులు విచారణ చేస్తున్నకోర్టుకు తెలియచేశారు.  ఏపీ స్కిల్‌డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌తో సీమెన్స్‌ ఒప్పందం కుదుర్చుకున్న సందర్భంలో.. కుదుర్చుకున్నప్పుడు తమ సంస్థ ప్రతినిధి సుమన్‌బోస్‌మేనేజ్‌మెంట్‌నుకాని, లీగల్‌టీమ్‌నుకాని సంప్రదించలేదని కోర్టుకు తెలియజేశారు. సీమెన్స్‌లోని ఎలాంటి గ్రాంట్‌ఇన్‌ఎయిడ్‌కాని ఆర్థికసహాయంతో కూడిన కార్యక్రమాలు ఎప్పుడూ నిర్వహించలేదని, అసలు లాంటి స్కీంలు తమసంస్థలో లేవని కోర్టుకుస్పష్టం చేశారు. ప్రభుత్వం విడుదల చేసిన రూ.371 కోట్లలో రూ.58.8 కోట్లరూపాయలతో తమ సంస్థ ఉత్పత్తులను, ప్రొడక్ట్స్‌ను కొనుగోలు చేశారని కోర్టుకు వెల్లడించింది.

అంటే దీని అర్థం సీమెన్స్‌ నుంచి ఒక్క రూపాయి కూడా రాలేదని తెలిసినా.. గత చంద్రబాబు ప్రభుత్వం ఈ విషయంలో మిన్నకుండిపోయింది. జర్మనీ నుంచి సీమెన్స్‌ గ్లోబల్‌ టీం వచ్చి సుమన్‌బోస్‌ ఈమెయిల్స్‌ను పరిశీలిస్తే.. హవాలా మార్గాల్లో డబ్బు తరలించినట్టు వెల్లడైందని కోర్టుకు తెలిపింది. ఈ డబ్బును ముంబై, హైదరాబాద్‌లోని కొందరు వ్యక్తులకు అందించినట్టు కూడా తెలిసిందని సీమెన్స్‌ ఉన్నతాధికారులు కోర్టుకు తెలిపారు.

అక్రమాలు దృష్టికి వచ్చినా దాటేసిన నాటి ప్రభుత్వ పెద్దలు
 సీమెన్స్‌ అంతర్గత విచారణ అంశాలు, అలాగే 2018లో ఏపీ ఏసీబీకి విజిల్‌బ్లోయర్‌ అందించిన సమాచారం.. ఇవన్నీకూడా గత ప్రభుత్వం(చంద్రబాబు హయాంలోనే) దృష్టికి వచ్చినా పట్టించుకోలేదు.  దీనిపై సమాచారం ఇవ్వాల్సిందిగా స్కిల్‌డెవలప్‌మెంట్‌కార్పొరేషన్‌ను ఏసీబీ అధికారి కోరితే.. ఎలాంటి స్పందనలేదు.  2018లో కేంద్రం జీఎస్టీ అధికారులు తనిఖీల్లో నకిలీ ఇన్వాయిస్‌ వ్యవహారం వెలుగు చూసింది. అప్పుడు రాష్ట్రంలో అధికారంలోఉన్నది చంద్రబాబే. 
నకిలీ ఇన్వాయిస్‌ల వ్యవహారాన్ని జీఎస్టీ అధికారులు సీమెన్స్ కంపెనీ అత్యున్నత అధికారులకు నివేదించారు. కంపెనీ కూడా అంతర్గత విచారణ చేపట్టింది. తన వ్యవహారం బటయపడుతుందని సీమెన్స్‌భారత్‌ ఎండీ సౌమ్యాద్రిశేఖర్‌బోస్‌ అలియాస్‌ సుమన్‌ బోస్‌ రాష్ట్ర స్కిల్‌డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌తో జరిపిన లావాదేవీలు, ఈ-మెయిల్స్, ఉత్తరప్రత్యుత్తరాలు, ఇతర రికార్డులను తమ కంప్యూటర్ల నుంచి డిలీట్‌చేశారు. కాని జర్మనీలోని  సీమెన్స్‌ అత్యున్నతాధికారులు ఉన్నతసాంకేతికపరిజ్ఞానాన్ని వినియోగించి డిలీట్‌చేసిన మెయిల్స్‌ను, ఇతర రికార్డులను వెలికితీసింది. స్కిల్‌డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌తో ఒప్పందం రూపేణా.. కొల్లగొట్టిన నిధుల వ్యవహారంపై బయటపడింది. ఈ వ్యవహారంలో టీడీపీ పెద్దల పాత్ర ఉంది కాబట్టే.. ఈ విషయాలన్నీ బయటకు వచ్చినా సరే అప్పటి రాష్ట్రప్రభుత్వం స్పందించలేదు. మౌనంగా ఉండిపోయింది. పైగా ఆ అధికారిని బదిలీ చేశారు కూడా. 

స్కిల్‌డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ బోర్డు సూచనలూ బేఖాతర్
సీమెన్స్, డిజైన్‌టెక్‌ ఒప్పంద వ్యవహారాలు నడుస్తున్న సమయంలోనే స్కిల్‌డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ బోర్డు సమావేశమైంది. సీమెన్స్‌ మాత్రమే కాకుండా అంతర్జాతీయంగా ఇతర సంస్థల శిక్షణ మాడ్యుల్స్‌ను కూడా పరిశీలించాలని కూడా సూచించింది. అంతేకాకుండా ఈ శిక్షణ కార్యక్రమానికి మొత్తం ప్రాజెక్టు వ్యయాన్నిమదింపుచేయాలని కూడా సూచించింది. కాని ప్రభుత్వం దాని జోలికి పోలేదు.  అలాగే థర్డ్‌ పార్టీ చేత వాల్యుయేషన్‌ చేయించాలన్న అంశాన్ని పట్టించుకోలేదు. 
తర్వాత కాలంలో వాల్యుయేషన్‌ చేయించేందుకు సెంట్రల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టూల్‌డిజైనింగ్‌కు స్కిల్‌డెవలప్‌మెంట్‌ రాసింది.  ఇక్కడకూడా సీమెన్స్‌ సుమన్‌ బోస్, డిజైన్‌టెక్‌ వికాస్‌లు అక్రమాలకుపాల్పడ్డారు.

సెంట్రల్‌ ఇనిస్ట్యూట్‌ ఆఫ్‌ టూల్‌ డిజైనింగ్‌ డైరెక్టర్‌ను ఒత్తిళ్లకు గురిచేశారు. చివరకు వాళ్లు చెప్పిన విధంగా వాల్యుయేషన్‌ చేసి ఇచ్చి.. ‘‘మమ’’ అనిపించారు. ఇదంతా కుట్రలో భాగమే. ఈ వ్యవహారంపై సెంట్రల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టూల్‌ డిజైనింగ్‌ డైరెక్టర్‌ సుజాయిత్‌ ఖాన్‌ పూస గుచ్చినట్టు దర్యాప్తు అధికారులకు చెప్పారు. ఈమేరకు కేసును విచారణ చేస్తున్న కోర్టుకు తన వాంగ్మూలం కూడా ఇచ్చారు. 

స్కాం కోసం నచ్చినవాళ్లకు పోస్టింగులు.. నోట్‌ఫైళ్లనూ మాయం చేసిన వైనం:
స్కిల్‌ స్కాం కోసమే అన్నట్టుగా ఏపీఎస్‌ఎస్‌డీసీలో ఆనాటి ప్రభుత్వం పోస్టింగులు ఇచ్చింది. అత్యంత అనుకూలంగా ఉండే, ప్రైవేటు వ్యక్తి గంటా సుబ్బారావును ఎండీ, సీఈవోగా నియమించింది. తర్వాతి కాలంలో గంటాసుబ్బారావును స్పెషల్‌ సెక్రటరీగా ఆనాటి ప్రభుత్వం పదోన్నతి కల్పించింది.  రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి కె.లక్ష్మీనారాయణను ఇదే కార్పొరేషన్‌లో డైరెక్టర్‌గా నియమించింది. లక్ష్మీనారాయణ సమీపబంధువునే ఆడిటర్‌గా నియమించుకుని కంపెనీ లెక్కలను వారికి అనుకూలంగా తయారుచేసుకున్నారు.


గంటా సుబ్బారావు(ఎడమ), లక్ష్మీనారాయణ(కుడి)

ప్రభుత్వం నుంచి స్కిల్‌డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌కు డబ్బును విడుదల చేయించుకోవడం అక్కడ నుంచి డిజైన్‌టెక్‌కు బదిలీచేయడం, ఆ తర్వాత షెల్‌ కంపెనీలకు మళ్లించడం.. ఈ మొత్తం వ్యవహారంలో వీళ్లు కీలకంగా వ్యవహరించారు. గంటా సుబ్బారావుకు ఓఎస్డీగా పనిచేసిన నిమ్మగడ్డవెంకట కృష్ణప్రసాద్‌ తనబాస్‌తో కలిసి స్కాంలో చాలా చురుగ్గా పాలుపంచుకున్నాడు. ప్రభుత్వంవద్ద ఉండాల్సిన కీలక ఫైళ్లు అన్నింటినీ తన వద్దే ఉంచుకున్నాడు. అంతేకాక సీమెన్స్, డిజైన్‌టెక్‌తో ఒప్పందానికి సంబంధించిన నోట్‌ఫైళ్లను పూర్తిగా మాయం చేసేశాడు. సుబ్బారావు, లక్ష్మీనారాయణలను కాపాడేందుకే ఈ చర్యలకు పాల్పడినట్టుగా దర్యాప్తు అధికారులు తేల్చారు. 
 ఈ ప్రాజెక్టు కోసం సీమెన్స్‌ ఏర్పాటు చేసిన కమిటీలో సభ్యుడైన జీవీఎస్‌ భాస్కర్‌ భార్య అపర్ణను ఆంధ్రప్రదేశ్‌రాష్ట్ర స్కిల్‌డెవల్‌మెంట్‌ కార్పొరేషన్‌ డిప్యూటీ సీఈఓగా నియమించారు. అపర్ణ నియామకం అఖిలభారతసర్వీసులకు విరుద్ధంగా జరిగింది. 

స్థూలంగా చూస్తే.. 
గత టీడీపీ ప్రభుత్వం చేపట్టిన స్కిల్‌డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టుకు సంబంధించి ఎలా డీపీఆర్‌లేదు. డీపీఆర్‌ లేకుండా ఆమోదించేశారు. ప్రాజెక్టు వ్యయంపై కూడా వాల్యూయేషన్‌ సక్రమంగా జరగలేదు. కేవలం స్కిల్‌డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఎండీ పంపిన నోట్‌ ఆధారంగా స్పెషల్‌ఐటెంగా తీసుకుని మంత్రివర్గంలోఆమోదించేశారు.
జీవోలో ఉన్న అంశాలు.. ఒప్పందంలో లేకపోయినా దురుద్దేశపూర్వకంగా సంతకాలు చేశారు. సీమెన్స్‌-డిజైన్‌టెక్‌ల నుంచి గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ ఏమీరాకపోయినా ఐదుదఫాల్లో ప్రభుత్వ వాటాడబ్బు విడుదల చేశారు.

డబ్బు విడుదల సమయంలో కూడా ఒప్పందపత్రాలు, డాక్యుమెంట్లు సక్రమంగా లేవంటూ ఆర్థికశాఖ అధికారులు అభ్యంతరం లేవనెత్తినా కళ్లు మూసుకుని డబ్బు విడుదల చేయించారు.  స్కాంపై మూడురూపాల్లో వార్నింగ్‌ బెల్స్‌ వచ్చినా పట్టించుకోలేదు. జీఎస్టీ అధికారులు చెప్పినా, ఏసీబీకి ఫిర్యాదు వచ్చినా, సీమెన్స్‌ అంతర్గ విచారణలో మోసాలు బయటపడ్డా ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వ పెద్దలు స్పందించలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement