సాక్షి, రాజమహేంద్రవరం: తప్పుడు కేసులతో జైల్లో పెట్టి తన భర్త చంద్రబాబును ప్రభుత్వం మానసిక క్షోభకు గురిచేస్తోందని నారా భువనేశ్వరి ఆరోపించారు. బాబు భోజనం చేసేందుకు కనీసం టేబుల్ కూడా ఇవ్వడం లేదని, ప్రత్యేకంగా అనుమతులు తీసుకున్న అనంతరం ఇచ్చారని చెప్పారు. ఇలాంటి చిల్లర ఆలోచనలతో బాబును ఎవరూ బెదరించలేరన్నారు.
స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడిíÙయల్ రిమాండ్‌లో ఉన్న చంద్రబాబుతో భార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సోమవారం ములాఖత్ అయ్యారు. సుమారు 40 నిమిషాల పాటు వివిధ అంశాలు, రాజకీయ పరిస్థితులపై చర్చించారు. జైలు నిబంధనల మేరకు ముగ్గురికి మాత్రమే అనుమతి ఉండటంతో ప్రత్తిపాటి పుల్లారావు బయటే ఉండిపోయారు. అనంతరం భువనేశ్వరి మాట్లాడుతూ.. ‘‘బాబు ధైర్యంగా, ఆత్మస్థయిర్యంతో ఉన్నారు.
టీడీపీ కార్యకర్తలు మా బిడ్డలు. పార్టీకి వెన్నెముకలాంటి వాళ్లు. వాళ్లే లేకుంటే పార్టీలేదు. పోలీసులు ఏం చేసినా వారు బెదరరు. టీడీపీ కుటుంబానికి పెద్ద అయిన చంద్రబాబు కోసం బిడ్డల్లాంటి కార్యకర్తలు నిరాహార దీక్ష చేస్తుంటే లాఠీలతో కొట్టడం బాధాకరం. అండగా నిలుస్తున్న కార్యకర్తలందరికీ ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు.
సీఐడీవి పనికిమాలిన ప్రశ్నలు: అచ్చెన్నాయుడు
కస్టడీలో చంద్రబాబును సీఐడీ అడిగినవన్నీ పనికిమాలిన ప్రశ్నలేనని అచ్చెన్నాయుడు విలేకరుల సమావేశంలో విమర్శించారు. ఆధారం లేని కేసుల్లో ఇరికించారన్నారు. రెండు రోజుల విచారణలో ఏమైనా ఆధారాలు దొరికాయా? అంటే సమాధానం చెప్పడం లేదన్నారు. కస్టడీలో 33 ప్రశ్నలు పనికిమాలిన, స్కామ్‌కు సంబంధం లేని ప్రశ్నలు అడిగారన్నారు.
ఆ ప్రశ్నలను తీసుకున్నామని, న్యాయ నిపుణుల సలహా సైతం తీసుకున్నామని, ప్రతి ప్రశ్నకు జవాబును విపులంగా ప్రజల ముందు ఉంచుతామన్నారు. చంద్రబాబు జైల్లో ధైర్యంగా, ఆరోగ్యంగా ఉన్నారన్నారు. ఆయన భద్రతపై భయంగా ఉందన్నారు. దోమలు ఎక్కువగా ఉన్నాయన్నారు. బాబుకు జైల్లో ఏమైనా జరిగితే అందుకు కర్త, కర్మ, క్రియ జగనేనన్నారు. యువగళం పాదయాత్ర తిరిగి ప్రారంభించేందుకు అన్ని అనుమతులు తీసుకున్నామని, త్వరలోనే ప్రారంభమవుతుందన్నారు.
16వ రోజుకు చేరిన చంద్రబాబు జైలు జీవితం
కాగా, సోమవారానికి చంద్రబాబు జైలు జీవితం 16వ రోజుకు చేరింది. మరో 10 రోజుల పాటు చంద్రబాబు రాజమండ్రిలోనే ఉండనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment