గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఫోన్ కాల్స్ (అన్ నోన్ నంబర్) బెడదకు త్వరలోనే ముగింపుపడనుంది. తమ మొబైల్ ఫోన్‌కు ఎవరు కాల్ చేస్తున్నారో తెలుసుకోవడం ఫోన్ వినియోగదారుల హక్కుగా మారనుంది. ట్రూ కాలర్ యాప్‌తో సంబంధం లేకుండానే తమ కాంటాక్ట్ నంబర్ల జాబితాలో లేని నంబరు నుంచి ఫోన్ కాల్ వస్తే అది ఎవరు చేశారో తెలిసిపోనుంది. తద్వారా సైబర్ నేరాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా విధాన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రూపొందించిన కొత్త టెలికాం విధానం పార్లమెంటులో ఆమోదం పొందగానే అమల్లోకి రానుంది. - సాక్షి, అమరావతి
ఫేక్ ఐడీ కార్డులతో కనెక్షన్లు...
సైబర్ నేరాలకు చెక్ పెట్టేందుకు...
దేశంలో అమాంతంగా పెరుగుతున్న సైబర్ నేరాల కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమాయత్తమవుతున్నాయి. సైబర్ నేరగాళ్లు ప్రధానంగా ఫేక్ ఐడీ కార్డులతో సిమ్ కార్డులు, ఓవర్ ద టాప్(వోటీటీ) కనెక్షన్లు తీసుకుని దర్జాగా మోసాలకు పాల్పడుతున్నారు. దాదాపు 90శాతం సైబర్ నేరాల ముఠాలు ఇలా ఫేక్ కనెక్షన్లతోనే సామాన్యులను బురిడీ కొట్టిస్తున్నాయి. ఫేక్ ఐడీ కార్డులతో తీసుకున్న ఫోన్ కనెక్షన్లతోనే ఆడియో, వీడియో, వాట్సాప్ కాల్స్, ఇన్‌స్ట్రాగామ్ మెసేజ్‌లు, యూపీఐ మెసేజ్‌లు చేస్తూ మోసాలకు పాల్పడుతున్నాయని జాతీయ నేర గణాంకాల (ఎన్‌సీఆర్‌బీ) నివేదిక వెల్లడించింది.
వాటిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నప్పటికీ ఆ మొబైల్ కనెక్షన్లు ఫేక్ ఐడీ కార్డులతో తీసుకున్నవి కావడంతో ఆయా చిరునామాల్లో సంబంధిత వ్యక్తులు ఉండటం లేదు. దీంతో కేసు దర్యాప్తు ముందుకు సాగడం లేదు. ఈ సమస్యకు పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం టెలికాం సంస్థలకు కొత్త విధివిధానాలను రూపొందించింది. ఈ మేరకు పార్లమెంటుకు ఇప్పటికే నూతన విధాన పాలసీ డ్రాఫ్ట్‌ను సమర్పించింది. రానున్న పార్లమెంటు సమావేశాల్లో దీనికి ఆమోదముద్ర పడుతుందని భావిస్తున్నారు.
కేవైసీ తప్పనిసరి...
టెలికాం కంపెనీలు తమ ఖాతాదారుల పూర్తి వివరాలను పరిశీలించి నిర్ధారించుకోవాలి. అందుకోసం బ్యాంకులు చేస్తున్నట్టుగా ‘నో యువర్ కస్టమర్(కేవైసీ) ప్రక్రియను పాటించాలి. తమ కంపెనీ నుంచి మొబైల్ సిమ్ కార్డ్, వోటీటీ కనెక్షన్ తీసుకున్న ప్రతి ఒక్క ఖాతాదారు సమర్పించిన గుర్తింపు కార్డులను తనిఖీ చేసిన తర్వాతే కనెక్షన్ ఇవ్వాలి. లేదా కనెక్షన్ ఇచ్చిన వారం రోజుల్లోనే ఆ గుర్తింపు కార్డులను పరిశీలించాలి. ఖాతాదారులు సమర్పించిన గుర్తింపు కార్డులు సరైనవి అని నిర్ధారణ అయితే సరే. నిర్ధారణ కాకపోతే వెంటనే ఆ కనెక్షన్లను నిలుపుదల చేయాలి. ఏ సందర్భంలో అయినా సరే పోలీసుల విచారణలో ఫేక్ గుర్తింపు కార్డులతో ఎవరైనా కనెక్షన్ తీసుకున్నారని తెలిస్తే సంబంధిత టెలికాం కంపెనీలు బాధ్యత వహించాల్సి ఉంటుంది.
ఫేక్ ఐడీతో తీసుకుంటే కఠిన చర్యలు...
ఇక ఫేక్ గుర్తింపు కార్డుతో ఎవరైనా మొబైల్ కనెక్షన్ గానీ, వోటీటీ కనెక్షన్ గానీ తీసుకున్నారని టెలికాం కంపెనీల ‘కేవైసీ’లో వెల్లడైతే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి. వారిపై పోలీసులు కేసు నమోదు చేస్తారు. వివిధ కేసుల దర్యాప్తులో భాగంగా ఫేక్ ఐడీ కార్డులతో మొబైల్, వోటీటీ కనెక్షన్ తీసుకున్నారని పోలీసులు గుర్తించినా వారిపై కేసు నమోదు చేస్తారు. అలా ఫేక్ ఐడీ కార్డుతో కనెక్షన్ తీసుకున్నవారికి రూ.50వేల జరిమానా లేదా ఏడాది జైలు లేదా రెండూ విధించేలా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది.
ఎవరు కాల్ చేస్తున్నారో తెలిసిపోతుంది...
నూతన పాలసీ ప్రకారం తమ కాంటాక్ట్ నంబర్ల జాబితాలో లేని నంబరు నుంచి కాల్ వచ్చినా సరే ఆ ఫోన్ చేసింది ఎవరో ఇకపై తెలిసిపోతుంది. ప్రస్తుతం ట్రూ కాలర్ యాప్‌ను ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకుంటే ఆవిధంగా ఎవరు కాల్ చేస్తున్నారో తెలుస్తుంది. కానీ, దానికి కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి. అయితే, ట్రూ కాలర్ యాప్‌తో నిమిత్తం లేకుండానే తమకు ఎవరు కాల్ చేస్తున్నారో తెలుసుకోవడం ప్రతి మొబైల్ ఫోన్ వినియోగదారుడికి హక్కుగా కేంద్రం నూతన పాలసీ డ్రాఫ్ట్‌ను సిద్ధం చేసింది. ఇందుకోసం మొబైల్ కంపెనీలు తమ సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేయాలని ఆదేశించనుంది.
Comments
Please login to add a commentAdd a comment