పోలవరం ఎత్తును ఒక్క అంగుళం కూడా తగ్గించం.. 45.72 మీటర్ల ఎత్తుతో, 194.6 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తాం. కావాలంటే ప్రాజెక్టు పూర్తయ్యాక టేపు తెచ్చి కొలుచుకోవచ్చు.
– 2022 మార్చి 22న అసెంబ్లీ సాక్షిగా టీడీపీ, ఎల్లో మీడియాకు సీఎం జగన్ సవాల్
పోలవరం ఎత్తు తగ్గిస్తున్నామని చంద్రబాబు పదేపదే అబద్ధాలు చెబుతున్నారు. ఎల్లో మీడియా పనిగట్టుకుని దుష్ఫ్రచారం చేస్తోంది. వాటిని నమ్మవద్దు. ఒక్క అంగుళం కూడా ఎత్తు తగ్గించం.
– ఈ నెల 23న శాసనసభలో సీఎం జగన్
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తున్నారంటూ రెండేళ్లుగా టీడీపీ నేతలు, ఎల్లో మీడియా సాగిస్తున్న దుష్ఫ్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం మరోసారి ఖండించింది. ఈ మేరకు రాజ్యసభలో టీడీపీ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ సోమవారం అడిగిన ప్రశ్నకు కేంద్ర జల్‌శక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు సమాధానమిస్తూ ప్రాజెక్టు ఎత్తు ఒక్క అంగుళం కూడా తగ్గదని మరోసారి తేల్చి చెప్పారు.
గోదావరి ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం 45.72 మీటర్ల గరిష్ట నీటి మట్టం(ఎఫ్‌ఆర్‌ఎల్)తో పోలవరాన్ని నిర్మిస్తున్నామని పునరుద్ఘాటించారు. ప్రాజెక్టు ఎత్తు తగ్గించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమకు ఎలాంటి ప్రతిపాదన పంపలేదని పార్లమెంట్ సాక్షిగా స్పష్టం చేశారు.
నిజానికి పోలవరం ఎత్తు ఒక్క అంగుళం కూడా తగ్గించే ప్రశ్నే లేదని 2021 నుంచి ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం పదేపదే స్పష్టం చేస్తున్నా ఎత్తు తగ్గిస్తున్నారంటూ రాజ్యసభ, లోక్‌సభలో టీడీపీ సభ్యులు తరచూ ప్రశ్నలు వేస్తుండటంపై కేంద్రం అసహనం వ్యక్తం చేసింది. పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారంటూ రాజకీయ ప్రయోజనాల కోసం దుష్ప్రచారం చేయడం తగదని కేంద్ర జల్ శక్తి శాఖ అధికారవర్గాలు సూచిస్తున్నాయి.
మళ్లీ మళ్లీ ఒకే ప్రశ్నా..?
పోలవరం ఎత్తును 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్లకు తగ్గిస్తున్నట్లు ఈనాడులో 2021లో రామోజీరావు ఓ తప్పుడు కథనాన్ని అచ్చేశారు. అది పట్టుకుని పోలవరం ఎత్తును సీఎం జగన్ తగ్గించేస్తున్నారంటూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఆ పార్టీ నేతలు దుష్ప్రచారానికి దిగారు. టీడీపీ నుంచి బీజేపీలోకి పంపిన రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ ద్వారా ఈ అంశంపై 2021 ఫిబ్రవరి 8న ప్రశ్న అడిగించారు. దీనిపై కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ సమాధానమిస్తూ పోలవరం ఎత్తు తగ్గించాలన్న ప్రతిపాదన ఏదీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమకు పంపలేదని స్పష్టం చేశారు. ప్రాజెక్టు ఎత్తు ఒక్క అంగుళం కూడా తగ్గదని తేల్చిచెప్పారు.
ఆ తర్వాత మూడు రోజులకే ఫిబ్రవరి 11న ఎంపీ రఘురామకృష్ణరాజు కూడా అదే అంశంపై లోక్‌సభలో ప్రశ్న అడిగారు. దానిపై కూడా కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ మరోసారి సమాధానమిస్తూ పోలవరం ఎత్తు తగ్గించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమకు ఎలాంటి ప్రతిపాదన పంపలేదని స్పష్టం చేశారు. ప్రాజెక్టు ఎత్తు ఒక్క అంగుళం కూడా తగ్గదని మరోసారి తేల్చిచెప్పారు.
ఇక శాసనసభలో పోలవరంపై చర్చ జరిగిన ప్రతి సందర్భంలోనూ ప్రాజెక్టు ఎత్తు ఒక్క అంగుళం కూడా తగ్గదని సీఎం వైఎస్ జగన్ పదేపదే స్పష్టం చేస్తూ వస్తున్నారు. అయినా సరే టీడీపీ నేతలు దుష్ప్రచారాన్ని ఆపడం లేదు. ఎల్లో మీడియా తప్పుడు కథనాలను అచ్చేయడం కూడా మానడం లేదు. ఈక్రమంలో పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారా? అంటూ టీడీపీ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ మరోసారి రాజ్యసభలో పాత ప్రశ్నే వేయడం గమనార్హం.
నాడు శ్రీశైలంలోనూ..
శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం 1981 నాటికి పూర్తయింది. ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం 885 అడుగులు కాగా, పూర్తి నీటి నిల్వ 215.80 టీఎంసీలు. సీడబ్ల్యూసీ మార్గదర్శకాల ప్రకారం 1981–82లో 854 అడుగుల్లో నీటిని నిల్వ చేశారు. ఆ తర్వాత దశలవారీగా 1984–85 నాటికి పూర్తి స్థాయిలో అంటే 215.80 టీఎంసీలను నిల్వ చేశారు.
ఆ ప్రకారమే పోలవరం పూర్తయిన తొలి ఏడాది 41.15 మీటర్లలో నీటిని నిల్వ చేస్తామని సీఎం వైఎస్ జగన్ అనేక మార్లు స్పష్టం చేశారు. ఆ తర్వాత 45.72 మీటర్ల పరిధిలోని ముంపు గ్రామాల నిర్వాసితులకు పునరావాసం కల్పించి సీడబ్ల్యూసీ మార్గదర్శకాల మేరకు పూర్తి స్థాయిలో అంటే 194.6 టీఎంసీలు నిల్వ చేస్తామని చెప్పారు. సీడబ్ల్యూసీ మార్గదర్శకాలపై అవగాహన లేని టీడీపీ నేతలు, ఎల్లో మీడియా పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారంటూ పదేపదే దుష్ప్రచారం చేస్తుండటం గమనార్హం.
ప్రాజెక్టుల భద్రత దృష్ట్యా..
ఏదైనా కొత్తగా ఒక ప్రాజెక్టును నిర్మించినప్పుడు నిర్మాణం పూర్తయిన తొలి ఏడాదే పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేయరు. నిర్మాణంలో ఏవైనా లోపాలు ఉంటే.. పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేయడం ప్రాజెక్టు భద్రతకే ప్రమాదం. ప్రాజెక్టుల భద్రత దృష్ట్యా నీటిని నిల్వ చేయడంపై కేంద్ర జలసంఘం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన తొలి ఏడాది పూర్తి నీటి నిల్వ సామర్థ్యంలో 1/3వ వంతు.. రెండో ఏడాది 2/3వ వంతు.. మూడో ఏడాది పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేయాలని సీడబ్ల్యూసీ పేర్కొంది.
ప్రణాళికాయుతంగా పూర్తి చేస్తుంటే కడుపు మంట
విభజన చట్టం ప్రకారం కేంద్రమే కట్టాల్సిన పోలవరం నిర్మాణ బాధ్యతలను 2016లో దక్కించుకున్న చంద్రబాబు సులభంగా చేయగలిగి, అధికంగా లాభాలు వచ్చే పనులనే చేపట్టారు. వరద ప్రవాహాన్ని మళ్లించేలా అప్రోచ్ ఛానల్, స్పిల్ వే, స్పిల్ ఛానల్, పైలెట్ ఛానల్‌ను పూర్తి చేయకుండానే గోదావరి గర్భంలో ప్రధాన డ్యామ్(ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్) పునాది డయాఫ్రమ్ వాల్‌ను పూర్తి చేశారు. ఆ తర్వాత ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల నిర్మాణాన్ని ప్రారంభించి వాటిని పూర్తి చేయలేక ఇరువైపులా ఖాళీలను వదిలేసి చేతులెత్తేశారు.
గోదావరికి 2019లో వచ్చిన భారీ వరద ప్రవాహం ఎగువ కాఫర్ డ్యామ్ ఖాళీ ప్రదేశాల గూండా అధిక ఉద్ధృతితో ప్రవహించడం వల్ల ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతం కోతకు గురై నాలుగు చోట్ల భారీ అగాధాలు ఏర్పడ్డాయి. డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు స్వీకరించాక 18 నెలలపాటు కోవిడ్ మహమ్మారి విజృంభించినా, కేంద్రం నిధులు ఇవ్వకున్నా రాష్ట్ర ఖజానా నుంచే వెచ్చిస్తూ పోలవరం ప్రాజెక్టును ప్రణాళికాయుతంగా పూర్తి చేస్తున్నారు. స్పిల్ వేను 45.72 మీటర్ల ఎత్తుతో పూర్తి చేశారు.
అప్రోచ్ ఛానల్, స్పిల్ ఛానల్, పైలెట్ ఛానల్‌లను పూర్తి చేసి 2021 జూన్ 11న గోదావరి ప్రవాహాన్ని 6.1 కి.మీ. పొడవున మళ్లించారు. 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోని నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తూ ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లను పూర్తి చేశారు. డీడీఆర్పీ, సీడబ్ల్యూసీ మార్గదర్శకాల ప్రకారం ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో ఏర్పడిన అగాధాలను పూడ్చి డయాఫ్రమ్ వాల్‌ను సరిదిద్ది ప్రాజెక్టును పూర్తి చేసే దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఇది చంద్రబాబు, ఎల్లో మీడియాకు కంటగింపుగా మారింది. పోలవరం పూర్తయితే రాష్ట్రం సస్యశ్యామలమై తమకు రాజకీయంగా పుట్టగతులు ఉండవనే భయంతో ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తున్నారంటూ పాతపాటే అందుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment