గత ప్రభుత్వంలో దాదాపు పూర్తయిన పేదల ఇళ్లను తమ ఘనతగా చెప్పుకునేలా బాబు ప్రభుత్వం స్కెచ్
సాక్షి, అమరావతి: ‘మేం అధికారంలోకి వస్తే పేదల ఇంటి నిర్మాణానికి పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామాల్లో మూడు సెంట్లు చొప్పున స్థలాలు మంజూరు చేస్తాం. ఇంటి నిర్మాణం కోసం సీఎం జగన్ ప్రభుత్వం చేసిన దానికంటే ఇంకా ఎక్కువ సాయంచేసి చూపిస్తాం’.. అని సార్వత్రిక ఎన్నికలకు ముందు చంద్రబాబు హామీలిచ్చారు. ఇప్పుడాయన సీఎం కూడా అయ్యారు.
ఇక తమ సొంతింటి కల సాకారం చేయడానికి బాబు ఎంత పెద్ద సాయం చేస్తారోనని ఇళ్లులేని పేదలు ఓ పక్క ఎదురుచూస్తుంటే చంద్రబాబు ప్రభుత్వం మాత్రం పేదలకు మెరుగైన సాయం చేయడం అటుంచి గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నిర్మించిన ఇళ్లను తమ ఖాతాలో వేసుకునేందుకు పెద్ద స్కెచ్చే వేసింది. ఇందులో భాగంగా వంద రోజుల్లో 1.28 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తిచేస్తాం అని గొప్పగా ప్రకటించింది.
అండగా నిలిచిన సీఎం జగన్..
గడిచిన ఐదేళ్లలో సొంతింటి కల సాకారం చేస్తూ పేదలకు సీఎం జగన్ అన్ని విధాలుగా అండగా నిలిచారు. ఏకంగా 31 లక్షల మందికి పైగా పేద అక్కచెల్లెమ్మల పేరిట రూ.76 వేల కోట్లకుపైగా మార్కెట్ విలువ చేసే స్థలాలు పంపిణీ చేశారు.
ఇంటి నిర్మాణానికి యూనిట్‌కు రూ.1.80 లక్షలు బిల్లు మంజూరు చేయడంతో పాటు, స్వయం సహాయక బృందాల ద్వారా లబ్దిదారులైన మహిళలకు పావలా వడ్డీకి రూ.35 వేలు రుణ సాయం అందించింది. ఉచితంగా ఇసుకను పంపిణీ చేయడం ద్వారా రూ.15 వేలు, స్టీల్, సిమెంట్, ఇలా 12 రకాల నిర్మాణ సామగ్రిని సబ్సిడీపై సరఫరా చేయడం ద్వారా మరో రూ.40 వేలు చొప్పున మొత్తంగా రూ.2.70 లక్షల చొప్పున ప్రయోజనం చేకూర్చారు.
స్టేజ్ అప్‌గ్రేడ్ చేసి ఈ ప్రభుత్వ ఖాతాలోకి..
నిజానికి.. గత ప్రభుత్వ హయాంలో ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద గత ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 31 లక్షల మందికి పైగా పేదలకు ఉచితంగా ఇళ్ల స్థలాలు పంపిణీ చేసింది. స్థలాలు పొందిన వారిలో 19 లక్షల మందికి పైగా ఇళ్ల నిర్మాణానికి అనుమతులిచ్చారు. ఎన్నికలు ముగిసే నాటికి 1,28,058 ఇళ్లు శ్లాబ్ దశను పూర్తిచేసుకున్నాయి. వీటిలో చాలావరకూ తుదిదశ పనులు కూడా పూర్తిచేసుకున్నాయి.
అయితే, ఎన్నికల కోడ్ నేపథ్యంలో గృహ నిర్మాణ కార్యకలాపాలు నిలిచిపోవడంతో పాటు, ఆన్‌లైన్‌లో స్టేజ్ అప్‌డేట్ ప్రక్రియకు బ్రేక్ పడింది. దీంతో చివరి దశ బిల్ కోసం ఇళ్లు పూర్తయినట్లు స్టేజ్ అప్‌డేట్ చేయలేదు. ఈ ఇళ్లనే వంద రోజుల్లో మేం నిర్మాణం పూర్తిచేస్తామని ప్రభుత్వం ప్రకటన చేసింది.
దీంతో పాటు గత ప్రభుత్వంలోనే ప్రారంభించి వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న 6.08 లక్షల ఇళ్లనే స్టేజ్ కన్వర్షన్స్ చేపడతామని చెబుతున్నారు కానీ, తాము పేదలకు స్థలాలు పంపిణీ చేస్తామని, కొత్తగా ఇళ్లు మంజూరు చేస్తామని ఇప్పటివరకూ ప్రస్తుత ప్రభుత్వం చెప్పలేదు. ఆ దిశగా ఎక్కడా చర్చించనూ లేదు.
Comments
Please login to add a commentAdd a comment