బాబు మార్క్‌ కథలు మళ్లీ షురూ..! Chandrababu Comments On Polavaram Project | Sakshi
Sakshi News home page

బాబు మార్క్‌ కథలు మళ్లీ షురూ..!

Published Mon, Jun 17 2024 5:18 PM

Chandrababu Comments On Polavaram Project

బాబు గారు మళ్లీ గళమెత్తారు. తనదైన శైలిలో తిమ్మిని బమ్మి చేసే ప్రయత్నాలకు మరో దఫా శ్రీకారం చుట్టారు. పోలవరం నిర్మాణం విషయంలో తాను చేసిందంతా సక్రమమేనని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. ముఖ్యమంత్రి హోదాలో సోమవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించిన ఆయన ఆ తరువాత ఓ మీడియా సమావేశం నిర్వహించి ప్రాజెక్టు నిర్మాణం మరింత ఆలస్యమవుతుందని తేల్చేశారు. డయాఫ్రామ్‌ వాల్‌ మరమ్మతులకు రూ.2000 కోట్లకు పైగా ఖర్చు అవుతుందని కూడా ఆయన అంచనా వేశారు. ఈ క్రమంలోనే కొన్ని సత్యాలకు బోలెడన్ని అసత్యాలు జోడించి గత తప్పులన్నింటినీ కప్పిపెట్టే ప్రయత్నం చేయడమే కాకుండా.. తప్పు ఇతరులపైకి నెట్టేందుకూ కృషి చేశారు. అయితే 2014-19 మధ్యకాలంలో ముఖ్యమంత్రిగా ఉండగా చంద్రబాబు చేసిన పలు తప్పిదాలు.. తీసుకున్న నిర్ణయాలే పోలవరం ప్రాజెక్టు సకాలంలో పూర్తి కాకపోయేందుకు కారణమన్నది నిపుణులు చాలామంది చెప్పే విషయం.

ప్రాజెక్టు నిర్మాణంలో స్పిల్‌ వే నిర్మాణం మొదట చేపట్టి ఆ తరువాత అవసరానికి అనుగుణంగా కాఫర్‌ డ్యామ్‌ కట్టడం ఇంజినీరింగ్‌ పద్ధతి. అయితే చంద్రబాబు మాత్రం ముందు కాఫర్‌ డ్యామ్‌ కట్టేలా నిర్ణయం తీసుకున్నారు. ఇది నిబంధనలకు విరుద్ధమని నిపుణులు చెబుతున్నా పట్టించుకోలేదు. ప్రాజెక్టుకు సంబంధించిన చాలా కీలకమైన నిర్మాణ పనులన్నింటినీ పక్కనబెట్టి ఆఘమేఘాల మీద కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణం చేపట్టారు. ఫలితంగా 2020లో వచ్చిన వరదకు కాఫర్‌ డ్యామ్‌ బాగా దెబ్బతింది. మళ్లీ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాఫర్‌ డ్యామ్‌ డిజైన్లను కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ 2017లో తిరస్కరించినా పట్టించుకోని చంద్రబాబు ఫిబ్రవరి నెలలో డయా ఫ్రమ్‌ వాల్‌ నిర్మాణానికి, గేట్ల నిర్మాణ పనులు మొదలుపెట్టడం గమనార్హం.

కాఫర్‌ డ్యామ్‌ ఎత్తును 41 మీటర్ల వరకూ పెంచుకోవచ్చునని జల వనరుల శాఖ అనుమతిచ్చిన తరువాత దిగువభాగంలో ఊటను నియంత్రించేందుకు షీట్‌ ఫైల్స్‌ వాడతామని కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్‌ట్రాయ్‌ ప్రతిపాదించిన విషయం ఇక్కడ చెప్పుకోవాలి.అయితే ఈ షీట్‌ ఫైల్స్‌ ద్వారా ఊటను నియంత్రించలేమని సీడబ్ల్యూసీ స్పష్టం చేసింది. ట్రాన్స్‌ట్రాయ్‌ డిజైన్లను తిరస్కరించి కొత్త డిజైన్లను రూపొందించిమని ఆదేశించింది.

వాస్తవం ఇలా ఉంటే.. చంద్రబాబు మాత్రం 2019 మే నెలలో గద్దెనెక్కిన జగన్‌ ప్రభుత్వం కాఫర్‌ డ్యామ్‌ (డయాఫ్రమ్‌ వాల్‌)ను కాపాడలేకపోయారని విమర్శించడం గమనార్హం.

పోలవరం స్పిల్‌ వే బ్రిడ్జికి సంబంధించి 14 బ్లాకుల్లో ట్రూనియన్‌ స్తంభాలు విఫలమయ్యాయి. అప్పర్‌ కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణం కారణంగా గ్యాప్‌-1లోని అప్రోచ్‌ ఏరియా పూర్తిగా దెబ్బతినింది. పైగా ఈ అప్పర్‌ కాఫర్‌డ్యామ్‌ కట్టినందుకు 2019లోనే వరదనీరు స్పిల్‌ వేను దాటి మరీ ప్రవహించింది. ఫలితంగా అప్పటివరకూ చేపట్టిన స్పిల్‌ వే ఛానల్‌ పనులు వృథా అయ్యాయి. స్పిల్‌ వేలో చేరి నిలిచిపోయిన నీటిని తొలగించేందుకు దాదాపు రెండు నెలల సమయం పట్టిందంటేనే బాబు గారి నిర్ణయం వల్ల జరిగిన నష్టం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు.

2019, 2020లలో గోదావరికి వచ్చిన వరదలు ఎగువప్రాంతాల్లోని నీట మునిగేందుకు కారణమయ్యాయి. కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణం వల్ల వరద నీరు వెనక్కు వెళ్లిపోవడం దీనికి కారణం.

2014- 2019 మధ్యకాలంలో పోలవరం నిర్మాణంపై చంద్రబాబు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. కాఫర్‌ డ్యామ్‌లు (అప్పర్‌, లోయర్‌) నిర్మాణం పూర్తి కాకున్నా... వాటిని తమ ప్రభుత్వ ఘన విజయాలుగా చాటుకున్నారు. అప్రోచ్‌ ఛానల్‌, పైలట్‌ ఛానళ్లలో జరిగిన మార్పులు కూడా బాబుగారి డాంబికాలకు అద్దం పట్టే నిర్ణయాలే.
మూల లంక ప్రాంతంలో డంప్‌ యార్డ్‌ కోసం ఏడాదికి రెండు పంటలు పండే సుమారు 200 ఎకరాల భూమిని చంద్రబాబు ప్రభుత్వం బలవంతంగా లాక్కోవడమే కాకుండా.. బాధితులకు పరిహారం సైతం చెల్లించలేదు.

తొలి పర్యటన నుంచి పక్కా ప్రణాళికతో..
2019లో ముఖ్యమంత్రిగా  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించాక తొలిసారిగా 2019 జూన్‌ 20న పోలవరం పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తొలుత వరదను మళ్లించేలా స్పిల్‌ వేను పూర్తి చేయడం, ఆ తర్వాత ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లు, సమాంతరంగా నిర్వాసితులకు పునరావాసం, కాఫర్‌ డ్యామ్‌ల మధ్య ఈసీఆర్‌ఎఫ్‌ను చేపట్టి వరదలోనూ పనులు కొనసాగించడం ద్వారా 2022 నాటికి పూర్తి చేసేలా అదే రోజు కార్యాచరణ రూపొందించారు.

ఆలోగా కుడి, ఎడమ కాలువలు, అనుసంధానాలు, డిస్ట్రిబ్యూటరీల పనుల పూర్తికి ప్రణాళిక సిద్ధం చేశారు. టీడీపీ సర్కారు నామినేషన్‌ పద్ధతిలో అధిక ధరలకు కట్టబెట్టిన పనులను రద్దు చేసి  రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించడం ద్వారా ఖజానాకు రూ.838 కోట్లను ఆదా చేశారు. ప్రచార్భాటాలకు దూరంగా ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ 2020 ఫిబ్రవరి 28, డిసెంబర్‌ 14న క్షేత్ర స్థాయిలో పనులను పరిశీలించారు. గడువులోగా పనులు పూర్తి చేసేలా చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ఎంత పెద్ద వరద వచ్చినా  తట్టుకునేలా..!
పోలవరం ప్రాజెక్టును గత సీఎం వైఎస్‌ జగన్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కేంద్రం నిధులు ఇవ్వకున్నా రాష్ట్ర ఖజానా నుంచే ఇచ్చి, మరొకవైపు నిర్వాసితులకు పునరావసం కల్పించారు. కరోనా కష్టకాలంలోనూ రికార్డు సమయంలో స్పిల్‌ వే ను పూర్తి చేశారు. సీడబ్యూసీ మార్గదర్శకాల మేరకు దెబ్బతిన్న పనులు సైతం చేపట్టారు.గతేడాది జూలైలో ఎంత పెద్ద వరద వచ్చినా తట్టుకునేలా ఎగువ కాఫర్‌ డ్యామ్‌ ఎత్తును 44 మీటర్లకు పెంచడంతో పాటు దిగువ కాఫర్‌ డ్యామ్‌ను పూర్తి చేశారు.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement