మాయోపాయాలు.. బెదిరింపులు | Chandrababu conspiracy on poor farmers lands in andhra pradesh | Sakshi
Sakshi News home page

మాయోపాయాలు.. బెదిరింపులు

Published Tue, Apr 16 2024 1:06 AM | Last Updated on Tue, Apr 16 2024 11:34 AM

Chandrababu conspiracy on poor farmers lands in andhra pradesh - Sakshi

రాజధాని కుట్రలో బడుగులే సమిధలు 

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పేద రైతుల భూములపై పచ్చదండు కన్ను 

617.70 ఎకరాల అసైన్డ్‌ భూములు కొల్లగొట్టేందుకు కుట్రలు 

అసైన్డ్‌ భూములకు ప్యాకేజీ లేదంటూ పేద రైతులను బెదిరించి భూదందా

కుట్రతో రూ.3,737 కోట్ల విలువైన అసైన్డ్‌ భూములు బినామీల పేరిట బాబు స్వాహా 

ఎవరికీ చెందని ప్రభుత్వ భూములూ హాంఫట్‌.. 

328 ఎకరాలు కొల్లగొట్టిన ఎల్లో గ్యాంగ్‌ 

522 మంది బినామీల పేరిట చంద్రబాబు, నారాయణల పరం 

భూసమీకరణ ప్యాకేజీ కింద వాటి విలువ రూ.760.25 కోట్లు 

చంద్రబాబు అల్లిన ‘రాజధాని ఫైల్స్‌’ డ్రామాలో ట్విస్టుల మీద ట్విస్టులు.. కుట్రల మీద కుట్రలు.. పదేళ్లు అధికారానికి మొహం వాచి.. ఒక్క దెబ్బకు వేల కోట్లు ఎలా కొల్లగొట్టాలో పచ్చ దండు పన్నాగం ఈ డ్రామాకే హైలైట్‌. రాజధానిగా రోజుకో పేరు తెరపైకి తెచ్చి రియల్టర్లు, సామాన్యులకు నిజంగానే సినిమా చూపించారు. అసలు రాజధాని ఎక్కడో తన పరివారం చెవిలో బాబు ముందే ఊదేయడంతో అమరావతి ప్రాంతంలో పచ్చదండు వాలి గద్దల్లా భూములు తన్నుకెళ్లింది. ఇతర ప్రాంతాల్లో భూములు కొన్న రియల్టర్లు, సామాన్యులు ఘొల్లుమంటే.. బాబు అనుచరగణం పండుగ చేసుకుంది.

విభజనతో తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన చంద్రబాబు.. రావడమే రాజధాని పాటందుకున్నారు. సింగపూర్‌ను తలదన్నేలా రాజధానిని కట్టేస్తాను.. బడుగుల బతుకుల్ని బాగుచేస్తానంటే నిజమనుకున్నారు. తెరవెనుక ఆ బడుగుల భూములపై కన్నేసిన చంద్రబాబు పన్నాగాన్ని వారు పసిగట్టలేకపోయారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ పేదలు తేరుకునేలోపు వారి అసైన్డ్‌ భూముల్ని బినామీల రూపంలో గద్దల్లా తన్నుకుపోయారు. కుట్రలను పక్కాగా అమలు చేయడంలో సిద్ధహస్తుడైన చంద్రబాబు భూదాహానికి బలయ్యింది నిరుపేద రైతులే.. 

రూ.3,737.30 కోట్ల విలువైన 617.70 ఎకరాల భూ దోపిడీ  సమిధలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే

సాక్షి, అమరావతి :  ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలంటే చులకన భావన అడుగడుగునా జీర్ణించుకున్న చంద్రబాబు కన్ను వాళ్ల భూములపై పడింది. కేటగిరీ 1 నుంచి 4 కింద వచ్చే ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద రైతుల అసైన్డ్‌ భూములను అడ్డగోలుగా కాజేయడానికి చట్టాన్ని తన చుట్టంగా మలచుకుని కోర్టులను కూడా బురిడీ కొట్టించారు. రాజధానిలో 617.70 ఎకరాల అసైన్డ్‌ భూ దోపిడీలో రూ.3,737.30 కోట్లను స్వాహా చేసి దేశ చరిత్రలోనే అతిపెద్ద భూకుంభకోణానికి పాల్పడ్డారు. అసైన్డ్‌ భూముల పరిరక్షణ కోసం చేసిన అసైన్డ్‌ భూముల అన్యాక్రాంత నిరోధక చట్టాన్ని ఉల్లంఘించి భూముల్ని చెరబట్టారు.

2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేదల భూముల దోపిడీకి రోడ్‌ మ్యాప్‌ ముందుగానే సిద్ధం చేసుకున్నారు. భూసమీకరణ ప్యాకేజీని నిర్ణయిస్తూ 2015, జనవరి 1న జీవో నెంబరు 1 జారీ చేశారు. అందులో అమరావతిలో ప్రైవేటు భూములకే భూసమీకరణ ప్యాకేజీ ఇస్తామని, అసైన్డ్‌ భూములకు ప్యాకేజీ లేదని ముందుగా సిద్ధం చేసుకున్న ప్లాన్‌ను బయటపెట్టారు. అప్పుడే చంద్రబాబు, నారాయణ బినామీలైన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, వారి ఏజెంట్లు రంగంలోకి దూకారు. తమకు అసైన్డ్‌ భూములు విక్రయిస్తే ఎంతో కొంత డబ్బులొస్తాయని, లేదంటే భూములు కోల్పోతారని భయపెట్టారు.

దీంతో ఆందోళనకు గురైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పేద రైతులు ఎకరా కేవలం రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకే అసైన్డ్‌ భూములను బాబు బినామీలకు సేల్‌ డీడ్‌ ద్వారా విక్రయించారు. అనంతరం వాటిని ఆరు కేటగిరీలుగా విభజిస్తూ భూసమీకరణ ప్యాకేజీ ప్రకటిస్తూ 2016 ఫిబ్రవరి 17న జీవో నెంబరు 41 జారీ చేశారు. వాటికి భారీ ప్యాకేజీ దక్కేలా చూసుకున్నారు. రాజధానిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనార్టీ పేద రైతులకు స్థానం లేకుండా చేశారు.

అధికారుల అభ్యంతరాలూ బేఖాతరు 
అసైన్డ్‌ భూములకు ప్యాకేజీ ప్రకటించడానికి వీల్లేదు. 1954కు ముందు ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద రైతులకు పంపిణీ చేసిన భూములు మాత్రమే ఇతరులకు విక్రయించుకోవచ్చు. ఆ విషయాన్ని రె వెన్యూ ఉన్నతాధికారులతో పాటు అడ్వకేట్‌ జన రల్‌ సైతం గుర్తిస్తూ భూసమీకరణ ప్యాకేజీని వ్యతిరేకించారు. ఉన్నతాధికారులు తాము చెప్పినట్లు చేయాల్సిందేనని చంద్రబాబు, నారా యణ హుకుం జారీ చేశారు.  

కోర్టుల్ని బురిడీ కొట్టించి.. 
అసైన్డ్‌ భూములను కొల్లగొట్టేందుకు చంద్రబాబు ఏకంగా కోర్టునే మోసం చేశారు. అమరావతి పరిధిలోని రెవెన్యూ కార్యాలయాల్లో అసైన్డ్‌ భూముల రికార్డులను చంద్రబాబు, నారాయణ మాయం చేశారు. 1954 తరువాత భూపంపిణీ రికార్డులు ఏమీ లేవని కోర్టుకు నివేదిక ఇచ్చారు. 1954 తరువాత చాలాసార్లు పేదలకు అసైన్డ్‌ భూ ములు పంపిణీ చేశారు. వైఎస్సార్‌ ప్రభుత్వ హ యాంలో 2004–05లో అసైన్డ్‌ భూములు పంపిణీ చేశారు. ఆ రికార్డులు మాయం చేశారు. అసైన్డ్‌ భూ ముల్లో 1954 తరువాత పంపిణీ చేసిన భూము లు ఉన్నాయన్న విషయం సీఐడీ దర్యాప్తులో వెల్లడైంది. ఇలా 617.70 ఎకరాల అసైన్డ్‌ భూములు చంద్రబాబు, నారాయణలు బినామీల పేరిట దోపిడీ చేశారు. ఈ భూములకు ప్యాకేజీ ద్వారా వారి గ్యాంగ్‌ ఏకంగా రూ.3,737.30 కోట్లు కొల్లగొట్టింది.  

పచ్చ కుట్ర బట్టబయలు 
ప్రభుత్వ అసైన్డ్‌ భూముల కేటగిరీ 5, 6లో చూపించిన 522 మంది రైతుల్లో ఒక్కరూ అసలు అమరావతి గ్రామాల్లోనే లేరన్న నిజం సిట్‌ దర్యాప్తులో బృందాన్ని నివ్వెరపరిచింది. కేవలం భూసమీకరణ ప్యాకేజీ కింద రాజధానిలో అత్యంత విలువైన స్థలాలను కొల్లగొట్టేందుకే చంద్రబాబు ముఠా ఈ పన్నాగానికి పాల్పడిందన్నది ఆధారాలతో సహా తేటతెల్లమయింది.  

ప్రభుత్వ భూములకు ఎసరు 
ప్రభుత్వ అసైన్డ్‌ భూములను దర్జాగా దోచేశారు. 29 గ్రామాల పరిధిలోని ప్రభుత్వ స్థలాలు తమ బినామీలైన ప్రైవేటు వ్యక్తుల అనుభవంలో ఉన్నాయని తప్పుడు రికార్డులు సృష్టించి వాటిని గుప్పిట పట్టారు. ఏకంగా 328 ఎకరాల ప్రభుత్వ భూమిని 522 మంది బినామీల పేరిట చూపిస్తూ హస్తగతం చేసుకున్నారు. భూసమీకరణ ప్యాకేజీలో రూ.760.25 కోట్లు కొల్లగొట్టారు. ప్రభుత్వ భూములన్నీ గుర్తు తెలియని వ్యక్తుల ఆ«దీనంలో ఉన్నట్టుగా రికార్డుల్లో చూపించారు.

అందుకోసం అసైన్డ్‌ భూముల జాబితాను 5, 6 కేటగిరీలుగా పేర్కొన్నారు. అన్యాక్రాంతమైనప్పటికీ అభ్యంతరాలు లేని భూములను కేటగిరీ 5గా, అన్యాక్రాంతమైన, అభ్యంతరాలు ఉన్న భూములను కేటగిరీ 6గా చూపిస్తూ జీవో 41 జారీ చేశారు. కేటగిరీ 5లో 237.60 ఎకరాలు గుర్తించారు. ఆ భూములన్నీ 295 మంది ఆదీనంలో ఉన్నట్లుగా చూపించారు. కేటగిరీ–6లో 90.52 ఎకరాలు చూపి అవి 227 మంది స్వా«దీనంలో ఉన్నట్టు కనికట్టు చేశారు. వాస్తవానికి అవి ఎవరి ఆధీనంలోనూ లేవు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement