2014–19లో పీజీ మెడికల్ ఫీజులు భారీగా పెంచిన చంద్రబాబు సర్కారు
వాటిని 40 నుంచి 50% తగ్గించిన జగన్ ప్రభుత్వం
వైఎస్ జగన్ ప్రభుత్వం ఇచ్చిన జీవో రద్దు
కళాశాలల వారీగా ఫీజులకు నిర్ణయం!
తాజాగా చేరుతున్న విద్యార్థుల నుంచి అదనంగా వసూలు చేస్తున్న కాలేజీలు.. ఫీజులు పెరిగితే ఆమొత్తంచెల్లించాలంటూ అగ్రిమెంట్లు
ఫీజులు పెంచితే పేద, మధ్యతరగతి వర్గాలకు భారమే
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వ చర్యలతో రాష్ట్రంలో పీజీ వైద్య విద్య సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయే పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుత పరిణామాలను గమనిస్తే కేవలం డబ్బున్న వారికే వైద్య విద్య అన్నట్టుగా ఉంది. 2014 – 19 మధ్య బాబు పాలనలో మెడికల్ పీజీ ఫీజులను భారీగా పెంచేశారు.
ఇది సామాన్య, పేద వర్గాలకు భారంగా మారడంతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫీజులను గణనీయంగా తగ్గించారు. ఇప్పుడు వైఎస్ జగన్ ప్రభుత్వం ఇచ్చిన జీవో రద్దవడంతో కొత్తగా పీజీ కోర్సుల్లో చేరుతున్న వారి పరిస్థితి గందరగోళంగా మారింది.
పెరిగే ఫీజులు కట్టేలా బాండ్‌లు
ఇప్పటివరకూ అన్ని ప్రైవేటు కళాశాలలకు ఒకే విధమైన ఫీజుల విధానం ఉంది. కొత్త విధానంలో కళాశాలల వారీగా ఫీజులు నిర్ణయిస్తారని తెలుస్తోంది. దీంతో తాజాగా అడ్మిషన్లు పొందిన విద్యార్థుల నుంచి 2020–23 బ్లాక్ పిరియడ్ ఫీజులపై 15 శాతం అదనంగా కట్టించుకుంటున్నారు. మరోవైపు ఫీజు పెరిగితే ఆ మొత్తాన్ని చెల్లించేలా నాన్ జ్యుడిíÙయల్ బాండ్ పేపర్‌పై అగ్రిమెంట్లు రాయించుకుంటున్నారు.
చాలా ప్రైవేట్ కళాశాలల్లో ఎ, బి కేటగిరీ సీట్లు పొందిన విద్యార్థుల కుటుంబాలు ప్రస్తుతం ఉన్న ఫీజుల ఆధారంగా కోర్సు పూర్తయ్యే నాటికి ఎంత ఖర్చవుతుందో అంచనా వేసుకుని బ్యాంక్ రుణాలు, ఆస్తులు తనఖా లేదా అమ్మడం ద్వారా డబ్బు సమకూర్చుకుంటున్నారు. కోర్సు మధ్యలో ఫీజులు భారీగా పెరిగితే ఆర్థికంగా చిన్నాభిన్నం అవుతామని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
ఏడు రెట్లు ఫీజులు పెంచిన ఘనత
2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం పీజీ వైద్య విద్యను కోటీశ్వరులే చదువుకొనేలా ఫీజులను ఏకంగా ఏడు రెట్లు పెంచింది. అప్పటివరకూ కన్వినర్ కోటాలో క్లినికల్ డిగ్రీ/డిప్లొమా కోర్సుల్లో ప్రైవేట్ కళాశాలల్లో రూ.2.90 లక్షలుగా ఉన్న ఫీజును 2017–18లో ఏకంగా రూ.6.90 లక్షలకు పెంచింది.
యాజమాన్య కోటా ఫీజును రూ.5.25 లక్షల నుంచి రూ.24.20 లక్షలకు పెంచింది. దీంతో పేద విద్యార్థులకు కన్వినర్ కోటా కూడా కష్టంగా మారింది. పేద, మధ్య తరగతి వర్గాల కష్టాలను గమనించిన వైఎస్ జగన్ ప్రభుత్వం ఫీజులను 40 నుంచి 50 శాతం తగ్గించింది. దీనిని సవాలు చేస్తూ మంత్రి నారాయణకు చెందిన నారాయణ మెడికల్ కాలేజీ యాజమాన్యం కోర్టుకు వెళ్లింది.
సుప్రీం కోర్టు నారాయణ కళాశాల యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్య అంటే వ్యాపారం కాదంటూ తలంటింది. అంతేకాకుండా రూ.5 లక్షలు ఫైన్ వేసింది. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం మళ్లీ ప్రైవేటు కళాశాలలకు మేలు చేయడం కోసం పేద, మధ్య తరగతి వర్గాలపై భారాన్ని మోపే ప్రయత్నం చేస్తోంది.
ఎటు తేల్చుకోలేక పోతున్నారు
ప్రస్తుతం బి కేటగిరి సీటుకు సంవత్సరానికి రూ.10 లక్షల వరకూ ఫీజు ఉంది. దీని ఆధారంగా నాలాంటి ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, మధ్య తరగతి కుటుంబాల వారు పిల్లలను బి కేటగిరి సీట్లలో చేర్చడానికి డబ్బులు సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఫీజులు ఏడాదికి రూ.20 లక్షలకు పైబడి పెరుగుతాయని చెబుతున్నారు. కన్వినర్ కోటా ఫీజులు కూడా భారీగా పెరిగే అవకాశం ఉందంటున్నారు.
ప్రభుత్వం మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ఇప్పుడున్న ఫీజుల ఆధారంగా కోర్సుల్లో చేరి, మధ్యలో ఫీజులు భారీగా పెరిగితే పరిస్థితి తలకిందులవుతుంది. మధ్యలో కోర్సు నిలిపేసినా పెనాల్టీలు కట్టాలి. దీంతో ఎటూ తేల్చుకోలేక విద్యార్థులు, తల్లిదండ్రులు సతమతం అవుతున్నారు. ఇప్పటికే రెండు విడతల కౌన్సెలింగ్ పూర్తయింది. ప్రభుత్వం వెంటనే ఫీజుల విధానంపై స్పష్టత ఇవ్వాలి. ప్రస్తుతం ఉన్న ఫీజులను కొనసాగించాలి. – రఘుబాబు, వైద్య విద్యార్థి తండ్రి, గుంటూరు
Comments
Please login to add a commentAdd a comment