AP Skill Development Corporation Scam in Chandrababu's Govt - Sakshi
Sakshi News home page

ఆ ‘స్కిల్‌’ చంద్రబాబుదే

Published Wed, Mar 8 2023 2:25 AM | Last Updated on Wed, Mar 8 2023 8:39 AM

Chandrababu scam in Skill Development Corporation - Sakshi

సాక్షి, అమరావతి: టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ స్టేట్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎస్‌­ఎస్‌డీసీ) కుంభకోణంలో కర్త, కర్మ, క్రియ అప్పటి సీఎం చంద్రబాబే అన్నది స్పష్టమైంది. జర్మనీకి చెందిన సీమెన్స్‌ కంపెనీ పేరుతో కథ నడ­పటం.. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ నిధులు విడుదల చేయడం.. అందుకోసం ఉన్నతాధికారులపై ఒత్తిడి తేవడం.. అనంతరం ఆ నిధులను షెల్‌ కంపెనీల పేరిట హవాలా మార్గంలో టీడీపీ పెద్దల ఖాతాల్లోకి చేర్చడం.. అంతా కూడా చంద్రబాబు పక్కా పన్నాగం ప్రకారమే సాగిందన్నది ఆధారసహితంగా వెల్లడైంది.

టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.3,300 కోట్ల సీమెన్స్‌ ప్రాజెక్టు పేరిట ఏపీఎస్‌ఎస్‌డీసీ కుంభకోణంపై సీఐడీ దర్యాప్తులో కీలక విషయాలు వెలుగచూశాయి. ఈ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్టుచేసిన సీఐడీ అధికారులు తమ దర్యాప్తులో మరిన్ని కీలక ఆధారాలు రాబట్టినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు సమయంలో అప్పటి ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న ముగ్గురు ఉన్నతాధికారులను సీఐడీ విచారించగా ఈ వాస్తవాలు వెలుగుచూశాయి. పూర్తిగా చంద్రబాబు ఆదేశాలతోనే నిబంధనలకు విరుద్ధంగా నిధులు విడుదల చేసినట్లు తేలింది.

ప్రజాధనాన్ని కొల్లగొట్టేందుకే..
ఇకనైపుణ్యాభివృద్ధి ప్రాజెక్టు పేరిట నిధులు కొల్లగొట్టడానికి చంద్రబాబు ఏపీఎస్‌ఎస్‌డీసీని ఓ సాధనంగా చేసుకున్నారు. అందుకోసం జర్మనీకి చెందిన సీమెన్స్‌ కంపెనీ పేరిట రూ.3,300 కోట్ల ప్రాజెక్టును తెరపైకి తెచ్చారు. వాస్తవానికి ఈ ప్రాజెక్టు గురించి సీమెన్స్‌ కంపెనీ ప్రధాన కార్యాలయానికి ఏమీతెలీదు. అప్పట్లో సీమెన్స్‌ కంపెనీ ఎండీగా వ్యవహరించిన సుమన్‌ బోస్‌ను అడ్డంపెట్టుకుని కథ నడిపారు. అందుకోసం చంద్రబాబు కనుసన్నల్లోనే ప్రాజెక్టును రూపొందించారు.

ఆ పన్నాగంలో భాగంగానే 2014–15లో అప్పటి సీఎం చంద్రబాబును సుమన్‌ బోస్, డిజైన్‌ టెక్‌ కంపెనీ ఎండీ వికాస్‌ కన్విల్కర్‌ కలిశారు. ప్రభుత్వం 10 శాతం నిధులు సమకూరిస్తే సీమెన్స్, డిజైన్‌టెక్‌ సంస్థలు 90 శాతం నిధులు పెట్టుబడి పెట్టేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ వ్యవహారంలో ఏపీఎస్‌ఎస్‌డీసీకి అప్పట్లో డైరెక్టర్‌గా ఉన్న రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి, చంద్రబాబు సన్నిహితుడు కే లక్ష్మీనారాయణ, ఎండీగా ఉన్న గంటా సుబ్బారావు కీలకంగా వ్యవహరించారు. 

బాబు ఆదేశాలతో నిధుల విడుదల..
సీమెన్స్‌ కంపెనీ తన వాటా నిధులు ఒక్కరూపాయి కూడా వెచ్చించకుండానే ప్రభుత్వ వాటాగా రూ.371కోట్లు విడుదల చేయడంపై పెద్ద కథే నడిచింది. నిబంధనలకు విరుద్ధంగా నిధుల విడుదలకు అప్పటి ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఉన్న సునీత సమ్మతించలేదు. ఆమె మూడు అభ్యంతరాలను నోట్‌ ఫైల్‌లో పేర్కొన్నారు. 

– ఇంత పెద్ద ప్రాజెక్టును ముందుగా ఏదో ఒక జిల్లాలో పైలట్‌ ప్రాజెక్టుగా అమలుచేసి అధ్యయనం చేసిన తరువాత నిర్ణయం తీసుకోవాలి.
– సీమెన్స్‌ కంపెనీ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సీని ఏర్పాటుచేయకుండానే ప్రభుత్వ వాటా నిధుల విడుదల సరికాదు.
– సీమెన్స్‌ కంపెనీ తన వాటా 90శాతం నిధుల్లో ఒక్క రూపాయి కూడా వెచ్చించలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వాటా 10శాతం కింద జీఎస్టీతో సహా రూ.371కోట్లు విడుదల చేయడం సరికాదు.

కానీ, సునీత అభ్యంతరాలను నాటి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. అప్పట్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించిన ఐవైఆర్‌ కృష్ణారావు సీఎం చంద్రబాబు చెప్పారు కాబట్టి ఆ నిధులు విడుదల చేయాలని నోట్‌ఫైల్‌లో పేర్కొన్నారు. దాంతో అప్పటి ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న పీవీ రమేశ్‌ స్పందిస్తూ సీఎం, సీఎస్‌ ఆదేశాలతో నిధులు విడుదల చేస్తున్నట్లు ఫైల్‌లో రాసి నిధులు విడుదల చేశారు. ఈ వాస్తవాలన్నీ సీఐడీ దర్యాప్తులో వెల్లడయ్యాయి.

ఇక ఈ కేసు దర్యాప్తులో భాగంగా సీఐడీ అధికారులు జర్మనీలోని సీమెన్స్‌ కంపెనీ ప్రధాన కార్యాలయాన్ని సంప్రదించారు. తమ కంపెనీ ఎండీగా చెప్పుకున్న సౌమ్యాద్రి శేఖర్‌ బోస్‌తో తమకు సంబంధమేలేదని సీమెన్స్‌ కంపెనీ లిఖితపూర్వకంగా సీఐడీ, ఏపీఎస్‌ఎస్‌డీసీకి స్పష్టంచేసింది. ఇక ఆ ఎండీ, డైరెక్టర్ల పేర్లు, హోదాలు రెండూ వేర్వేరు ఒప్పంద పత్రాల్లో పరస్పర విరుద్ధంగా ఉన్నాయని ఫోరెన్సిక్‌ నివేదికలు వెల్లడించడం గమనార్హం. ఈ కుంభకోణం నుంచి తప్పించుకునేందుకు ముందస్తు ఎత్తుగడతోనే ఇలా చేశారని నిపుణులు చెబుతున్నారు.  

కూపీ లాగుతున్న ఈడీ 
మరోవైపు.. ఏపీఎస్‌ఎస్‌డీసీ కుంభకోణంపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) లోతుగా విచారణ మొదలుపెట్టింది. ఈ కేసులో నిందితులైన అప్పటి సీఎం చంద్రబాబుకు సన్నిహితులు, ఆ కుంభకోణంతో ప్రమేయమున్న షెల్‌ కంపెనీల ప్రతినిధులు మొత్తం 26 మందికి నోటీసులు జారీచేసింది. వారిలో పలువురిని ఇప్పటికే విచారించింది. షెల్‌ కంపెనీల బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించి అవి ఏఏ బ్యాంకు ఖాతాల నుంచి సింగపూర్‌కు వెళ్లాయి.. తిరిగి దేశంలోని ఏ ఖాతాలకు తిరిగి వచ్చాయన్న విషయంపై ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement