కొవ్వూరు: స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చిన తర్వాతే అరెస్టు చేశారని హోం మంత్రి తానేటి వనిత చెప్పారు. అంతా చట్టప్రకారమే జరిగిందని.. ఈ విషయంలో విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. శనివారం తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ కుంభకోణాన్ని గత ప్రభుత్వ హయాంలోనే గుర్తించారని పేర్కొన్నారు.
అవినీతి చేయడం వల్లే.. చంద్రబాబు ఇటీవల అరెస్ట్ పేరుతో సానుభూతి డ్రామా మొదలుపెట్టారని చెప్పారు. ఆయన అరెస్టును బీజేపీ నేత పురందేశ్వరి ఖండించడం హాస్యాస్పదమన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షాపై రాళ్లు వేయించి, ప్రధాని మోదీని తిట్టిన వ్యక్తులను సమర్థిస్తున్నారా? అని పురందేశ్వరిని ప్రశ్నించారు. ఆమె బీజేపీకి నిబద్ధతగా ఉంటున్నారో? లేదంటే తన మరిది చంద్రబాబుతో కలిసిపోయారో చెప్పాలని హోం మంత్రి తానేటి వనిత డిమాండ్ చేశారు.
చంద్రబాబు కేసులో ఈడీ వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు తప్పు చేశాయని బీజేపీ నేతగా పురందేశ్వరి చెప్పాలనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. ఈ స్కామ్‌పై ఇన్నాళ్లూ నోరు మెదపని జనసేన అధినేత పవన్‌కళ్యాణ్.. ఈరోజు చంద్రబాబుకు అండగా ముందుకు రావడాన్ని వనిత తప్పుబట్టారు. ఈ కుంభకోణంలో మీకు అందుతున్న ప్యాకేజీ ఎంతని పవన్‌ను ప్రశ్నించారు. సమావేశంలో పశ్చిమ గోదావరి జెడ్పీ వైస్ చైర్‌పర్సన్ పోసిన శ్రీలేఖ, మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్లు మన్నె పద్మ, గండ్రోతు అంజనీదేవి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment