నేను బాగుంటే చాలు అనుకోవడంతోనే రోజు మొదలవుతోంది. తోడబుట్టిన వాళ్లు.. బంధువులు కూడా డబ్బు ముందు కానివారవుతున్నారు. ఆస్తులు అంతస్తులు.. పిల్లలు సాధించిన విజయాలు.. గడుపుతున్న విలాసవంతమైన జీవితం.. ఏ నలుగురు కలిసినా ఇదే చర్చ. వ్యక్తిత్వం ఎక్కడో ఒక మూలన మాత్రమే కనిపిస్తుంది. ఆప్యాయత కరువవుతోంది.
బంధాలు పలుచన కాగా.. అసూయ పెరిగిపోతుంది. తనకు కష్టం వచ్చినా, ఇతరులు బాధపడినా కన్నీళ్లే వస్తాయనే విషయం బోధపడితే కానీ తెలియని పరిస్థితి. పెద్దగా ఆస్తులు లేకపోయినా.. ఆదాయ వనరులు అంతంత మాత్రమే ఉన్నా.. అప్పట్లో ఉమ్మడి కుటుంబం కష్టసుఖాల్లో తోడు నిలిచింది. ఒకరికొకరు చేదోడువాదోడుగా ఉండటం.. అరమరికలు లేని జీవనం ఉన్నంతలో సంతృప్తి నిచ్చింది. కానీ ఆధునిక ప్రపంచం గుండెలో గోడలు కట్టుకోవడం బంధాలను పలుచన చేస్తోంది.
– సాక్షి, కర్నూలు డెస్క్
29.05.2023
మెడికల్ షాపు నిర్వహణతో భార్యాభర్తలు ఏ లోటు లేకుండా జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. బాగా చదివించారు.. ఉద్యోగం రావడం.. పెళ్లి చేయడంతో రెక్కలొచ్చి ఎవరి దారిని వాళ్లు ఎగిరిపోయారు. కుటుంబ యజమాని మంచం పట్టడంతో ఆయన బాగోగులు చూసుకోవడంతో ఆమె మానసికంగా కుంగిపోయింది.
చివరకు భర్త మరణం ఆమెను కలచివేసింది. ఇంట్లో ఓదార్చే దిక్కులోదు.. ధైర్యం చెప్పే మనుషుల్లేరు. కొడుకులు వస్తారంటే ఒకరు సప్త సముద్రాల ఆవల.. మరొకరు వందల కిలోమీటర్ల దూరం.. ఎవరికీ చెప్పుకోలేక ఇంట్లోనే దహన సంస్కారాలు పూర్తి చేసింది. .. పత్తికొండలో చోటు చేసుకున్న ఈ ఘటన మాయమవుతున్న బంధాలకు అద్దం పట్టింది.
చిన్నటేకూరుకు చెందిన రంగయ్య విశ్రాంత ఆర్టీసీ మెకానిక్. భార్య, కుమార్తెలు పట్టించుకోకపోవడంతో ఐదేళ్లుగా అనాథాశ్రమంలో కడుపు నింపుకుంటున్నాడు. చివరకు తనకు న్యాయం చేయాలని కోర్టును ఆశ్రయించాడు. ఇప్పుడు కోర్టు మెట్లు ఎక్కేందుకు ఆరోగ్యం కూడా సహకరించక నీరసించాడు.
కర్నూలులోని అశోక్‌నగర్‌కు చెందిన ఓ వ్యక్తి తన తండ్రి ఆస్తిని దాన విక్రయంగా పొంది తల్లి, సోదరిని ఇంటి నుంచి గెంటేశాడు. కనీసం చట్ట ప్రకారం ఆస్తి ఇవ్వాలని కోరినా దిక్కున్న చోట చెప్పుకోమంటున్నాడు. కోర్టును ఆశ్రయించినా న్యాయం జరిగేందుకు సమయం పట్టే అవకాశం ఉండటంతో బతికేందుకు ఆర్థిక వనరులు లేక దిక్కులు
చూస్తున్నారు.
ప్రపంచం వేగంగా అడుగులు వేస్తుండటంతో ఎవరికి వారు జీవితంలో స్థిరపడాలనే ఉరుకులు పరుగుల జీవనానికి అలవాటుపడ్డారు. చదువు.. ఉద్యోగం.. ఈ రెండింటికి ప్రాధాన్యత పెరుగుతోంది. ఆ తర్వాత ఇల్లు, పిల్లలు వీటితోనే జీవితం గడిచిపోతుంది. డబ్బు.. డబ్బు.. ఈ కరెన్సీ నోట్ల మధ్య సమయం నలిగిపోతుంది. మానవత్వం ఎప్పుడో కానీ ఉనికి చాటుకోలేకపోతుంది. సౌకర్యాలు.. విలాసాలు పెరిగిపోవడంతో వీటి ముందు వ్యక్తిత్వం చిన్నబోతుంది.
కుటుంబం అన్న మాటే కానీ.. ఎవరికి వారుగా జీవిస్తున్నారు. చాలా కుటుంబాలు ఇప్పటికే బాగా పలుచబడ్డాయి. విద్య.. ఉద్యోగం.. ఉపాధి.. కారణం ఏదైనా ఇంటికి దూరంగా బతకడం అలవాటైపోయింది. ఇక అక్కడో ఇక్కడో కొంతమంది కలసిమెలసి ఉంటున్నా.. అరమరికలతో తుమ్మితే ఊడిపోయే బంధంగా మారుతోంది. పెద్దల పట్ల గౌరవం తగ్గిపోతుండటంతో ఒకే ఇంట్లో జీవిస్తున్నా ఆత్మీయతలు కనుమరుగవుతున్నాయి. రాక, పోక ఇష్టానుసారం కాగా.. విలువలు గాలికి కొట్టుకుపోయి బంధాలు ఒంటరిగా మిగిలిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది.
ఎవరికి వారే భోజనం
ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాల నేపథ్యంలో అందరూ కలసి భోజనం చేయడం పరిపాటి. ఆ తర్వాత సంఖ్య కాస్త పలుచబడినా రోజులో ఏదో ఒక పూట భోజనం చేయనిదే తృప్తి కలగని పరిస్థితి. ఇప్పుడు ఎవరు ఏ సమయంలో తింటారో తెలియదు, ఏం తింటున్నారో కూడా అడిగేందుకు సమయం ఉండకపోవడం కుటుంబంలో అనారోగ్య వాతావరణానికి కారణమవుతోంది. అందరూ కలసి కూర్చొని భోజనం చేయడం ద్వారా కష్టసుఖాలు పాల్పంచుకునే అవకాశం ఉంటుంది. దీని వెనుక ఉద్దేశం మారిపోయి.. ఆకలి అయినప్పుడు తింటామనో, బయట తిని వచ్చామనే మాటలు వినిపించడం సర్వసాధారణమైంది.
హాస్టళ్లలో చదువు
ఇది పోటీ ప్రపంచం. మా పిల్లాడు అందరికంటే ముందుండాలనే భావన ప్రతి ఒక్క తల్లిదండ్రిలో కనిపిస్తుంది. ఈ కారణంగా పిల్లలను ఇంట్లో ఉంచుకోకుండా కార్పొరేట్ హాస్టళ్లలో ఉంచి చదివించడం ఫ్యాషన్ అయిపోయింది. అగ్గి పెట్టెల్లాంటి రూముల్లో.. మంచీచెడు తెలియకుండా రోజులు గడిచిపోతున్నాయి.
అమ్మానాన్నల ఆప్యాయతకు దూరమవుతూ.. బంధాల విలువ తెలియకుండా ర్యాంకుల వెంట పరుగులు తీయడంతోనే బాల్యం దాటిపోతుంది, యవ్వనం చేజారిపోతుంది. ఆ తర్వాత కూడా ఇంటికి చుట్టపుచూపుగానే వస్తుండటంతో విలువలు వీధిపాలవుతున్నాయి.
పండగలూ పబ్బాలకే..
గతంలో శుభకార్యమైనా, చావుకైనా పది మంది కలిసేవాళ్లు. మంచీచెడు చెప్పి వెళ్లేవాళ్లు. రాత్రి పూట ఆరుబయట మంచాలు వేసుకొని పొద్దుపోయే దాకా కబుర్లు చెప్పుకుంటూ కష్టసుఖాలు పంచుకునేవాళ్లు. ఇప్పుడు ఎవరైనా చనిపోతే కనీసం ఖర్మకాండలు ఎలా చేయాలనే విషయం కూడా తెలియక తికమకపడుతున్నారు.
పెళ్లిళ్లు.. శుభకార్యాలంటే ప్రతి ఒక్కరి అడుగు ‘బ్రాహ్మణుల’ ఇంటి వైపునకే పడుతోంది తప్పితే ఒక్కటంటే ఒక్కటీ సొంతంగా చేసుకోలేకపోవడం ఆధునికత ఏ పరిస్థితికి దారితీస్తుందో అర్థమవుతోంది. ఆహా్వనాలు, హాజరు కూడా మొక్కుబడిగానే ఉండటం చూస్తే మనిషికి, బంధాలకు మధ్య దూరం ఏ స్థాయిలో పెరుగుతుందో తెలుస్తోంది.
సెల్‌ఫోన్లతో సరి..
సర్దుబాటు ధోరణి మచ్చుకైనా కనిపించడం లేదు. పక్కోడి నీడను కూడా సహించలేని పరిస్థితి. వయస్సు పెరిగే కొద్దీ సహనం, ఓర్పు కనిపించాల్సి ఉండగా.. అసూయ ద్వేషాలకు పెద్దపీట వేస్తున్నారు. చిన్న చిన్న మాటలకు పట్టింపులకు పోయి బంధాలనే వదులుకోవడం, అసలు వాళ్లతో ఏమి అవసరం ఉందనే భావన అధికమైంది. ఇందుకు సెల్‌ఫోన్లతో కాలం గడపటం, గంటల కొద్దీ వాటితోనే సావాసం చేయడం ప్రధాన కారణం. ఇంట్లోనే ఉంటున్నా ఎవరూ మాట్లాడుకోకుండా సెల్‌ఫోన్‌పై చేతులు కదుపుతున్నారు. ఫ్రెండ్స్ కలిశామన్న మాటే కానీ చూపంతా సెల్‌ఫోన్ పైనే ఉంటోంది.
ఒక్కరు మరణించినా..
పిల్లలు మంచి హోదాలో ఉండాలని తల్లిదండ్రులు ఎంతగానో తపిస్తున్నారు. ఇందుకోసం తమ జీవితాలను ఫణంగా పెడుతున్నారు. పైసాపైసా కూడబెట్టి మరీ భవితకు బాటలు వేస్తున్నారు. తీరా లక్ష్యం చేరుకోగానే.. పిల్లలు తల్లిదండ్రులకు దూరంగా బతుకుతున్నారు.
పిల్లోడు బాగుపడితే చాలనుకొని కొంత కాలం దంపతులు ఇద్దరూ నెట్టుకొస్తున్నా.. వృద్ధాప్యంలో మనోవేదనతో మంచం పడుతున్నారు. ఈ సమయంలో ఇద్దరిలో ఒకరు మరణించిన మరొకరి జీవనం దుర్భరంగా మారుతోంది. మరీ ముఖ్యంగా భార్య మరణిస్తే.. ఆ వెంటనే భర్త కన్నుమూయడం చూస్తే.. పిల్లలు దూరమైతే ఎలాంటి పరిస్థితి ఉంటుందో అర్థమవుతుంది.
పిల్లలకు సమయం కేటాయించాలి
తల్లిదండ్రులు పిల్లల పట్ల బాధ్యతగా మెలగాలి. మరీ ముఖ్యంగా వారితో గడిపేందుకు సమయం కేటాయించాలి. ప్రతి ఒక్కరూ ఐదు టీలు(టైం, టాక్, ట్రీట్, టచ్, ట్రస్ట్) పాటించాలి. అప్పుడే పిల్లలతో బంధం బలపడుతుంది. తల్లిదండ్రుల స్పర్శ పిల్లలకు సరికొత్త అనుభూతితో పాటు ఆత్మవిశ్వాసం పెంపొందిస్తుంది. నమ్మకం పెంపొందింనప్పుడే కుటుంబ వ్యవస్థ బలపడుతుంది.
– సి.జ్యోతిర్మయి, ఫ్యామిలీ కౌన్సిలర్, బిహేవియర్ థెరపిస్ట్, కర్నూలు
Comments
Please login to add a commentAdd a comment