పచ్చిమిర్చిని మార్కెట్‌కు తరలించేందుకు సిద్ధం చేస్తున్న రైతులు
వ్యవసాయ భూములకు సమీపంలో స్వర్ణముఖి నది.. సాగునీటికి ఇబ్బంది లేదు. రైతులంతా ముందస్తుగా మాట్లాడుకుంటారు. ఏ పంటలు వేయాలో నిర్ణయం తీసుకుంటారు. ఒక్కో గ్రామంలో ఒక్కో రకం సాగు చేస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్నారు. ప్రభుత్వం రాయితీపై విత్తనాలు అందిస్తూ అన్నదాతలకు అండగా నిలిచింది. ప్రస్తుతం పంటను ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్న పరిస్థితి ఉంది.
సాక్షి, పెళ్లకూరు: మండలం నదీ తీర ప్రాంతం కావడంతో ఇక్కడి భూములు సారవంతంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో రైతులు ఆకుకూరలు, కూరగాయలు తోటలు విస్తారంగా వేస్తున్నారు. ప్రధానంగా వంగ, బెండ, బీర, చిక్కుడు, కాకర, టమోటా, ముల్లంగి, ఉల్లిపాయలు, మిర్చి, గోంగూర, తోటకూర, చిర్రాకు, పాలకూర తదితరాలు సాగులో ఉన్నాయి. ప్రతి ఏడాది రైతులంతా కలిసి పంటల ఎంపికపై చర్చించుకుంటారు. వ్యవసాయ అధికారుల సలహాల మేరకు మేలురకం విత్తనాలను ఎంపిక చేసుకుంటారు. టమోటా, కాకర, బీర తదితర పంటలను అల్లిక విధానంలో సాగుచేసి మేలు రకం దిగుబడులు సాధిస్తున్నారు.
లాభాల బాటలో..
ఒకప్పుడు మెట్ట ప్రాంతాలకే పరిమితమైన మిర్చి సాగు ఇప్పుడు మండలంలోని కానూరు, తాళ్వాయిపాడు, రోసనూరు, చావలి, చెంబడిపాళెం, దొడ్లవారిమిట్ట, పెన్నేపల్లి తదితర ప్రాంతాల్లో జరుగుతోంది. ఉద్యానవన శాఖ అధికారుల రైతులకు ఎప్పటికప్పుడు సలహాలు అందిస్తున్నారు. ఉత్తర భారతదేశంలో మంచి గిరాకీ ఉన్న మిర్చి రకాలను ఎంపిక చేసుకుని సాగు చేస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీతోపాటు చెన్నై, బెంగళూరు, విజయవాడ తదితర ప్రాంతాలకు ఎగుమతులు చేస్తున్నారు.
విరివిగా..
ఈ ప్రాంత రైతులు పంటల మార్పిడి విధానంతో మొక్కజొన్న పంటను విరివిగా సాగు చేస్తున్నారు. చెంబడిపాళెం, చావలి గ్రామాల్లోని రైతులు మొక్కజొన్న పంటపై ఆసక్తితో మేలురకం విత్తనాలు ఎంపిక చేసుకుని సాగుకు శ్రీకారం చుట్టారు. పంటను నాయుడుపేట, శ్రీకాళహస్తి, తిరుపతి పట్టణాలకు తరలించి మార్కెటింగ్ చేసుకుంటున్నారు.
భూసారం పెంచడంలో..
ఇక్కడి రైతులు సాగు భూముల్లో భూసారాన్ని పెంచడంలో వారికివారే సాటి. ఏడాదంతా పంటలు సాగు చేసే ఇక్కడి రైతులు పంటకు పంటకు మధ్య వ్యవధిలో పచ్చిరొట్ట పంటలు జీలుగ, జనుము, పిల్లిపెసర తదితర వాటిని వేయడం, వేరుశనగ ఆకులను పరచడంతోపాటు ఎక్కువుగా సేంద్రియ ఎరువులను వినియోగిస్తున్నారు. అలాగే అంతర పంటల సాగుతో భూసారం దెబ్బతినకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
అందుబాటులో నర్సరీ
తాళ్వాయిపాడు గ్రామానికి చెందిన కట్టా బాలసుబ్రహ్మణ్యం అనే వ్యక్తి మొక్కల నర్సరీని నిర్వహించడం రైతులకు అనుకూలమైంది. గతంలో చిత్తూరు, పీలేరు, మదనపల్లి, రాజమండ్రి తదితర ప్రాంతాలకు వెళ్లి వంగ, మిరప తదితర మొక్కలను తెచ్చుకునేవారు. ప్రస్తుతం అందుబాటులో నర్సరీ ఉండడమే కాకుండా కేవలం ఒక్క రూపాయికి ఒక మొక్కను విక్రయించడం విశేషం. ప్రభుత్వం అందించిన ఆర్థిక సాయంతో బాలసుబ్రహ్మణ్యం నర్సరీని ఏర్పాటు చేసి వంగ, బెండ, టమోటా, బంతి, చిక్కుడు, బీర, కాకర పలు రకాల మొక్కలను ట్రే సాగు పద్ధతిలో పెంచి రైతులకు విక్రయిస్తున్నారు. దీంతో ఇక్కడి సామాన్య రైతులు నారు పోసుకోవడానికి ఇబ్బంది లేకుండా తక్కువ ధరపై మొక్కలను తెచ్చుకుని సాగు చేస్తున్నారు.
బంతి సాగు
శిరసనంబేడు, రాజుపాళెం, తాళ్వాయిపాడు గ్రామాల్లోని నిమ్మ తోటల్లో అంతర పంటగా బంతి సాగు చేస్తున్నారు. ఇక్కడి మెట్ట భూముల్లో భూ సారం పెంపొందించేందుకు దుక్కి చేసి దానికి వర్మీ కంపోస్టు ఎరువును మొక్కల కుదుళ్లలో వేసి నీరు పెట్టడంతో మొక్కలు బాగా పెరిగి నాణ్యమైన పువ్వులతో తోట కళకళలాడుతుంది. బంతి పంటకు ఆకుముడత తెగులు రాకుండా తేలికపాటి రసాయన మందులను పిచికారీ చేస్తూ తెగుళ్ల బారి నుంచి రక్షించుకుంటున్నారు. సాగు ప్రారంభం నుంచి ఒక ఎకరానికి సుమారు రూ.60 వేలు పెట్టుబడి పెడుతున్నారు.
విక్రయం ఇలా..
జాతీయ రహదారి మార్గంలో రోడ్డుపక్కనే పలుచోట్ల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసుకుని వాహనచోదకులకు, ప్రయాణికులకు కూరగాయలు, ఆకుకూరలను విక్రయిస్తున్నారు. తాజాగా లభిస్తుండడంతో అధిక సంఖ్యలో ప్రజలు, ప్రయాణికులు ఆసక్తి చూపుతున్నారు. మరికొందరు ఇతర జిల్లాలకు, రాష్ట్రాలకు తరలిస్తున్నారు.
రాయితీపై..
మండల వ్యవసాయ శాఖ గతేడాది 916.50 క్వింటాళ్ల జీలుగలు, 30 క్వింటాళ్ల జనుము, 112 క్వింటాళ్లు పిల్లిపెసర రాయితీపై రైతులకు అందించారు. అలాగే ఈ ఏడాది జీలుగలు 625 క్వింటాళ్లు, జనుములు 20, పిల్లిపెసర 225 క్వింటాళ్లు రాయితీపై పంపిణీ చేశారు. ఇంకా చిల్లకూరు సహకార సంఘం నుంచి రూ.48 లక్షలకు పైగా యూరియా, డీఏపీ, పొటాష్ తదితర ఎరువులను రైతులకు విక్రయించారు.
కంపోస్టు ఎరువులు తయారు చేసుకుంటాం
శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారుల సూచనలతో రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ ఎరువులను వినియోగిస్తాం. వర్మీకంపోస్టు ఎరువులను స్వయంగా తయారు చేసుకుంటాం.
– సీహెచ్ మార్కండేయ, రైతు, చెంబడిపాళెం
ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నాం
మిర్చి, బెండ, వంగ, కాకర తదితర పంటలను ఎక్కువగా సాగు చేయడం జరుగుతోంది. నాయుడుపేట, శ్రీకాళహస్తి, తిరుపతి, చెన్నై, బెంగుళూరు పట్టణాలకు పంటను తరలిస్తున్నాం.
– ఎం ప్రకాష్, రైతు, చావలి
Comments
Please login to add a commentAdd a comment