
సాక్షి, చిత్తూరు : జిల్లలోని పూతలపట్టు మండలంలో గురువారం రాత్రి అమ్మోనియం గ్యాస్ లీక్ కావడంతో 20మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో 100మందికి పైగా కార్మికులు ఉండగా వారిలో 14మంది మహిళా కార్మికులు ఆస్పత్రి పాలయ్యారు. పూతలపట్టు మండలం బండపల్లి హట్సన్ పాల డెయిరీలో ఈ సంఘటన చోటుచేసుకుంది. పాలు కోల్డ్ స్టోరేజ్ కోసం అమ్మోనియం వాయువును ఉపయోగిస్తుంటారు. ఆ వాయువు లీక్ కావడంతో 14మంది అస్వస్థతకు గురైయ్యారు. వెంటనే ఫ్యాక్టరీ నిర్వాహకులు చిత్తూరు, గుడిపాల ఆస్పత్రులకు తరలించారు. ఇద్దరు అపస్మారక స్థితిలో ఉన్నారు.
పాల డెయిరీ ఘటనపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి..జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తాతో మాట్లాడి బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.మరోవైపు జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా హట్సన్ పాల డెయిరీని పరిశీలించారు. అస్వస్థతకు గురైనవారికి మెరుగైన వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. గ్యాస్ లీక్ సంఘటనపై ఎమ్మెల్యే ఎంఎస్ బాబు సీరియర్ అయ్యారు. యాజమాన్యం నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ఆయన వ్యాఖ్యానించారు.