సాక్షి, అమరావతి: టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఫైబర్‌నెట్ కార్పొరేషన్, స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లలో చోటుచేసుకున్న కుంభకోణాలపై దర్యాప్తునకు సీఐడీ సంసిద్ధమవుతోంది. ఫైబర్‌నెట్ టెండర్లలో రూ.2వేల కోట్ల అవినీతి, స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ల నిధులను షెల్ కంపెనీలకు దారి మళ్లింపు వ్యవహారాలపై సీఐడీ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో సీఐడీ కార్యాచరణకు సమాయత్తమవుతోంది. ఇందుకోసం రెండు వేర్వేరు దర్యాప్తు బృందాలను నియమించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలిసింది. ఆ రెండు సంస్థల్లో టెండర్ల, నిధుల మళ్లింపు వ్యవహారాలకు సంబంధించిన ఫైళ్లను సీఐడీ అధికారులు స్వాధీనం చేసుకోనున్నారు. అనంతరం ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేస్తారు. అలాగే, దర్యాప్తులో భాగంగా ప్రశ్నించాల్సిన సంస్థలు, వాటికి సంబంధించిన వ్యక్తులు, అప్పటి ప్రభుత్వ అధికారుల జాబితాలను కూడా రూపొందించనున్నారు.
దర్యాప్తులో పరిశీలించేవి ఇవే..
ఫైబర్‌నెట్ టెండర్ల కోసం కేంద్ర టెలికాం శాఖ రూపొందించిన నిబంధనలు, అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన టెండర్ నోటిఫికేషన్, సాంకేతిక బిడ్లలో అర్హతలు నిర్ణయించిన విధానం, ఫైనాన్స్ బిడ్లలో కోట్ చేసిన రేట్లు, వాటిపై పలు సంస్థల అభ్యంతరాలు మొదలైనవి దర్యాప్తులో ప్రధానంగా పరిశీలించనున్నారు. ఇక స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు సంబంధించి సీమెన్స్ ప్రాజెక్టు పేరుతో షెల్ కంపెనీలకు రూ.241.78 కోట్లు దారి మళ్లించిన తీరుపై సీఐడీ దర్యాప్తు చేయనుంది. ఆ షెల్ కంపెనీల చిరునామాలు, వాటిలోని డైరెక్టర్లు, వారి బ్యాంకు ఖాతాలను పరిశీలించి వారితో అప్పటి ప్రభుత్వ పెద్దలు, అధికారులకు ఉన్న సంబంధాలను ఆరా తీయనుంది. ఈ రెండు కేసుల్లో దర్యాప్తును ముమ్మరం చేసి నిర్ణీత సమయంలో విచారణను ఓ కొలిక్కి తీసుకురావాలని సీఐడీ ఉన్నతాధికారులు భావిస్తున్నారు.
టీడీపీ కుంభకోణాలపై దర్యాప్తు.. సీఐడీ సమాయత్తం
Published Tue, Jul 13 2021 4:23 AM | Last Updated on Tue, Jul 13 2021 4:23 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment