పూలింగ్‌.. భారీ కుట్ర | CID reported to AP High Court On Chandrababu, Narayana Land scam | Sakshi
Sakshi News home page

పూలింగ్‌.. భారీ కుట్ర

Published Sun, May 9 2021 3:19 AM | Last Updated on Sun, May 9 2021 1:01 PM

CID reported to AP High Court On Chandrababu, Narayana Land scam - Sakshi

సాక్షి, అమరావతి: గత ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న నారా చంద్రబాబు నాయుడు, పొంగూరు నారాయణలు ల్యాండ్‌ పూలింగ్‌ స్కీం (జీవో 41)ను ఓ సాధనంగా ఉపయోగించుకుని వారు లబ్ధి పొందడంతో పాటు, వారికి కావాల్సిన వారికి అయాచిత లబ్ధి చేకూర్చారని రాష్ట్ర క్రైం ఇన్వెస్టిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌ (సీఐడీ) హైకోర్టుకు నివేదించింది. ఈ మొత్తం వ్యవహారంలో భారీ కుట్ర దాగి ఉందని, ఇందులో అప్పటి గుంటూరు జాయింట్‌ కలెక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌ కీలక పాత్ర పోషించారని పేర్కొంది. రాజధాని గ్రామాల ఒరిజినల్‌ రెవిన్యూ రికార్డులను శ్రీధరే మాయం చేశారని, వాటి ఆచూకీ కేవలం ఆయనకు మాత్రమే తెలుసని స్పష్టం చేసింది. ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న పలువురు తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు, కార్యకర్తలు ఆ భూములను ల్యాండ్‌ పూలింగ్‌ స్కీం కింద ప్రభుత్వానికి స్వాధీనం చేసి, అత్యంత విలువైన నివాస, వాణిజ్య ప్లాట్లు పొందారని వివరించింది.

తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రైవేటు వ్యక్తులు కొందరు అసైన్డ్‌దారులను బెదిరించి, భయపెట్టి కారు చౌకగా భూములు కొట్టేశారని.. వాటిని స్వాధీనం చేసి ల్యాండ్‌ పూలింగ్‌ స్కీం కింద ప్లాట్లు పొందారని, ఆ తర్వాత వాటిని అమ్మేసి కోట్ల రూపాయలు వెనకేసుకున్నారని తెలిపింది. ఇందుకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేసింది. రాజధాని నిర్మాణానికి సంబంధించి అసైన్డ్‌ భూముల బదలాయింపులో భారీ అక్రమాలు జరిగాయంటూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సీఐడీ.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, అప్పటి మంత్రి పొంగూరు నారాయణలపై కేసు నమోదు చేసింది. సీఐడీ తమపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ చంద్రబాబు నాయుడు, నారాయణలు హైకోర్టులో వేర్వేరుగా క్వాష్‌ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన హైకోర్టు.. సీఐడీ నమోదు చేసిన కేసులో దర్యాప్తుతో పాటు తదుపరి చర్యలపై స్టే విధించింది. ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని సీఐడీని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ ఆదేశాల మేరకు సీఐడీ తరఫున ఈ కేసులో దర్యాప్తు అధికారిగా వ్యవహరిస్తున్న ఎ.లక్ష్మీనారాయణ రావు కౌంటర్లు దాఖలు చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. 

నేరపూరిత కుట్రతోనే జీవో 41 
2021 ఫ్రిబవరి 24న ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సీఐడీ అదనపు డీజీ ప్రాథమిక విచారణ జరిపి, అదే ఏడాది మార్చి 12న చంద్రబాబు, నారాయణ తదితరులపై కేసు నమోదు చేశారు. వంచన, మోసపూరిత లావాదేవీలు, దురుద్దేశపూర్వకంగా వ్యవహరించడం వంటివి ప్రాథమిక విచారణలో నిర్ధారణ అయ్యాయి. ఈ కేసులో నిందితులు ఏపీసీఆర్‌డీఏ, ఏపీ అసైన్డ్‌ భూముల బదలాయింపు నిషేధ చట్టం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. భూమి లేని పేదలకు ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్‌ భూములతో పాటు, ప్రభుత్వ భూములను కూడా చేజిక్కించుకుని ల్యాండ్‌ పూలింగ్‌ స్కీం కింద తమకూ, తమ వారికి లబ్ధి చేకూర్చేందుకు చట్ట విరుద్ధంగా జీవో 41 (ల్యాండ్‌ పూలింగ్‌ స్కీం రూల్స్‌) జారీ చేశారు. తద్వారా ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం చేకూర్చారు. దురుద్దేశంతోనే ఈ జీవో జారీ చేసినట్లు దర్యాప్తులో తేలింది. చట్టం నిర్ధేశించిన విధి విధానాలకు విరుద్ధంగా వ్యవహరించేందుకు, ఖజానాకు నష్టం చేకూర్చేందుకు జీవో 41ని ఓ సాధనంగా వాడుకున్నారు. బిజినెస్‌ రూల్స్‌కు, నిర్ధేశిత విధి విధానాలకు విరుద్ధంగా నేరపూరిత కుట్రతోనే ఈ జీవోను జారీ చేసినట్లు నోట్‌ ఫైళ్ల ద్వారా తెలిసింది. 

సీఆర్‌డీఏ చట్టానికి విరుద్ధం 
జీవో 41 జారీ చేసిన తర్వాత, అంతకు ముందు దానిని మంత్రి మండలి ముందు ఉంచలేదు. ముఖ్యమంత్రి, మంత్రి మండలి ఆమోదం లేకుండానే ఈ జీవోను తీసుకొచ్చినట్లు దర్యాప్తులో తేటతెల్లమైంది. జీవో విడుదలైన తర్వాత ముఖ్యమంత్రి, సంబంధిత ఇన్‌చార్జ్‌ మంత్రి దానికి ఆమోద ముద్ర వేశారు. ఇలా చేయడం నేరం కాకపోయినా, ఈ జీవో జారీ అయిన సమయం, విధానం, దాని వెనుక ఉద్దేశాలే ప్రశ్నించదగ్గవి. రాజధాని నిర్మాణానికి సంబంధించి అత్యంత ముఖ్యమైన ల్యాండ్‌ పూలింగ్‌ విధానానికి సంబంధించిన జీవో జారీ చేయడం వెనుక విధి విధానాల పరమైన అక్రమాలు, సీఆర్‌డీఏ చట్ట నిబంధనల ఉల్లంఘనలు ఉండటం గమనార్హం. సీఆర్‌డీఏ చట్ట నిబంధనల ప్రకారం జీవో 41ని శాసనసభ ఆమోదం కోసం సభ ముందు ఉంచలేదు. 2016 ఫిబ్రవరి 17న జీవో 41 జారీ అయింది.  

అసైన్డ్‌ భూములను తీసుకోవడం నేరం 
► ఏపీ అసైన్డ్‌ భూముల బదలాయింపు నిషేధ చట్టంలోని సెక్షన్‌ 3, 4, 5 ప్రకారం అసైన్డ్‌ భూముల సేకరణ, ఇతర లావాదేవీలు నిషిద్ధం. చట్ట విరుద్ధంగా అసైన్డ్‌ భూములను తీసుకుంటే, అలా తీసుకున్న వ్యక్తిని చట్టం నిర్ధేశించిన విధానం ప్రకారం ఖాళీ చేయించే అధికారం జిల్లా కలెక్టర్‌కు ఉంది. 
► అసైన్డ్‌ భూములను సేకరిస్తే పడే శిక్ష గురించి సెక్షన్‌ 7(1) చెబుతోంది. భూమి లేని వారికి ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్‌ భూములను కాపాడాల్సిన బాధ్యత సంబంధిత అధీకృత అధికారిపై ఉంది. ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా కూడా విధి నిర్వహణలో చట్ట ఉల్లంఘనలకు పాల్పడటం, అసైన్డ్‌ భూములను చట్ట విరుద్ధంగా కలిగి ఉన్న వారిని కాపాడటం, ఆ ఆస్తి జప్తు కాకుండా రక్షించడం భారత శిక్షా స్మృతి (ఐపీసీ) కింద నేరం. 
► చంద్రబాబు, నారాయణలు ఆ సమయంలో కీలక పదవుల్లో ఉన్నారు. వారి ఆమోదం లేకుండా జీవో 41 జారీ అయ్యే అవకాశమే లేదు. అసైన్డ్‌ భూములను కొనకూడదని తెలిసినా, వీరి మద్దతుతో టీడీపీ పెద్దలు పెద్ద సంఖ్యలో అసైన్డ్‌ భూములు కొనడం నేరం. దానిని గత ప్రభుత్వం రెగ్యులర్‌ చేయడం మరో నేరం.
► దర్యాప్తులో భాగంగా అప్పట్లో నిబంధనలను రూపొందించిన ప్రభుత్వాధికారులను సాక్షులుగా విచారించాం. ఆ రూల్, జీవో అసైన్డ్‌ భూముల బదలాయింపు నిషేధ చట్టానికి విరుద్ధమని స్పష్టంగా చెప్పినట్లు ఆ అధికారులు తమ వాంగ్మూలంలో పేర్కొన్నారు. 
► అయినా కూడా చంద్రబాబు, నారాయణలు అధికారుల సిఫారసులను పట్టించుకోకుండా జీవో 41 జారీ చేశారు. దీనిపై తదుపరి దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో వారు ఎలాంటి రక్షణ కోరజాలరు. 

పథక రచన ఇట్టే అర్థమవుతోంది..
► ప్రతిపక్షాలను వేధించేందుకే అధికార పక్షం ఇలాంటి కేసులు పెడుతోందన్న చంద్రబాబు, నారాయణ వాదనలో ఎలాంటి నిజం లేదు. ఇందుకు ఎలాంటి ఆధారాలు కూడా లేవు. సీఐడీ ప్రాథమిక విచారణ నివేదికను పరిశీలిస్తే, ఆ మొత్తం వ్యవహారంలో చంద్రబాబు, నారాయణలు ఇతరులతో కలిసి సాగించిన ‘పథక రచన’ ఏమిటో తెలుస్తుంది. 
► ప్లాట్ల కేటాయింపులో అక్రమాలు, అనర్హులకు చేసిన మేళ్లు, తద్వారా సీఆర్‌డీఏకు జరిగిన నష్టం తదితరాలను ప్రాథమిక విచారణ నివేదిక స్పష్టంగా చూపుతోంది. 
► రెవిన్యూ రికార్డుల ప్రకారం ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న వారికి అసైన్‌మెంట్‌ పట్టాలు ఇవ్వడానికి వీల్లేదు. పట్టాలు లేకుండా అక్రమంగా భూములను స్వాధీనంలో ఉంచుకుని సాగు చేస్తున్నారు. ఒక్కో అంశంపై లోతైన విచారణ జరపాల్సి ఉంది. 

అసైన్డ్‌దారులను భయపెట్టారు..
► ల్యాండ్‌ పూలింగ్‌ స్కీమ్‌ కేటగిరి 4 (శివాయి జమాదార్లు), కేటగిరి 5, 6ల కింద భూములు ఇచ్చేందుకు ముందుకొచ్చిన వారి వివరాలను ప్రాథమిక విచారణలో సీఆర్‌డీఏ నుంచి పొందాం. ఈ వివరాలను క్షేత్ర స్థాయి పరిశీలన ద్వారా పోల్చి చూశాం. 
► కేటగిరి 4 కింద ల్యాండ్‌ పూలింగ్‌ స్కీమ్‌కు భూములు ఇచ్చి, అందుకు ప్రతిగా ప్లాట్లు పొందిన వారిలో తెలుగుదేశం పార్టీకి అత్యంత సన్నిహితులు, ఆ పార్టీ కార్యకర్తలు ఉన్నట్లు గుర్తించాం. మంగళరి సబ్‌ రిజిష్ట్రార్‌ కార్యాలయంలో అసైన్డ్‌ భూములను రిజిష్టర్‌ చేసేందుకు ప్రయత్నించి విఫలమైన వారిలో వీరు ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
► జీవో 41 ల్యాండ్‌ పూలింగ్‌ స్కీం రూల్స్‌ గురించి ముందే తెలిసిన అప్పటి అధికార పార్టీకి చెందిన వ్యక్తులు, అసైన్డ్‌ భూములను ప్రభుత్వం వెనక్కు తీసేసుకుంటుందని, అంతిమంగా ఆ భూములకు ఎలాంటి లబ్ధి ఉండదని అసైన్డ్‌ భూములున్న వారిలో భయాందోళనలు కలిగించారు.
► అంతిమంగా అసైన్డ్‌దారుల నుంచి భూములను అన్‌ రిజిష్టర్డ్‌ సేల్‌ అగ్రిమెంట్ల ద్వారా నామమాత్రపు ధరలకు తీసేసుకున్నారు. ఆ తర్వాత వీరంతా కూడా ఆ భూములను ల్యాండ్‌ పూలింగ్‌ స్కీం కింద సీఆర్‌ఏడీకు ఇచ్చి, జీవో 41ని అడ్డం పెట్టుకుని అందుకు ప్రతిగా నివాస, వాణిజ్య ప్లాట్లు పొందారు. 
► కొందరు ఇలా పొందిన నివాస, వాణిజ్య ప్లాట్లకు అధిక ధరలకు అమ్ముకున్నారు. అంతిమంగా కోట్ల రూపాయల మేర వ్యక్తి గతంగా లబ్ధి పొందారు. ఖజానాకు భారీ నష్టం చేకూర్చారు. 

ఆ రికార్డుల గురించి శ్రీధర్‌కు మాత్రమే తెలుసు 
► అప్పటి అడ్వొకేట్‌ జనరల్‌ ఇచ్చిన సలహాలు ఏవీ కూడా నోట్‌ ఫైళ్లలో లేవు. ఆ సలహాల సర్టిఫైడ్‌ కాపీలను అడ్వొకేట్‌ జనరల్‌ కార్యాలయం నుంచి పొందాం. అసైన్డ్‌ భూములను అమ్మడానికి వీల్లేదని, కొనుగోలుదారులను ఖాళీ చేయించాలని అడ్వొకేట్‌ జనరల్‌ స్పష్టమైన అభిప్రాయం వ్యక్తం చేశారు. 
► అయితే చంద్రబాబు, నారాయణలు అడ్వొకేట్‌ జనరల్‌ అభిప్రాయాన్ని కాలరాసి, చట్ట నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. 2014 సెప్టెంబర్‌ 29 – 2014 నవంబర్‌ 5 మధ్య గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తహసీల్దార్‌గా పని చేసిన మాజేటి తిరుపతి వెంకటేశ్వర్లు వాంగ్మూలాన్ని నమోదు చేశాం. ఆ సమయంలో గుంటూరు జాయింట్‌ కలెక్టర్‌గా చెరుకూరి శ్రీధర్‌ ఉన్నారని వెంకటేశ్వర్లు చెప్పారు.
► శ్రీధర్‌ మౌఖిక ఆదేశాల ప్రకారం తుళ్లూరు మండల పరిధిలోని గ్రామాలకు చెందిన ఆర్‌ఎస్‌ఆర్, ఎఫ్‌ఎంబీ, అడంగల్స్, 1బీ తదితర ఒరిజినల్‌ రికార్డులన్నింటినీ ఆయనకు అప్పగించానని, వీటి అప్పగింత విషయంలో అక్నాలజ్డ్‌మెంట్‌ తీసుకోలేదని వెంకటేశ్వర్లు తన వాంగ్మూలంలో పేర్కొన్నారు.
► 2014 అక్టోబర్‌ 31న వెంకటేశ్వర్లు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో అన్నే సుధీర్‌బాబు తహసీల్దార్‌గా వచ్చారు.  
► 2014– 1బీ అడంగల్‌ను పరిశీలిస్తే అసైన్డ్‌దారులు, ల్యాండ్‌ పూలింగ్‌ స్కీం కింద భూములు ఇచ్చిన వ్యక్తులు వేర్వేరు. ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న ఆక్రమణదారులు ల్యాండ్‌ పూలింగ్‌ స్కీం కింద భూములు ఇచ్చారు. 
► రాజధాని గ్రామాలకు సంబంధించిన ఒరిజినల్‌ రికార్డులు ఎక్కడ ఉన్నాయో చెరుకూరి శ్రీధర్‌కు మాత్రమే తెలుసు. ఆ రికార్డులను ఆయన సంబంధిత తహసీల్దార్‌కు గానీ, తన తర్వాత వచ్చిన జాయింట్‌ కలెక్టర్‌కు గానీ అప్పగించలేదు. ఈ అధికారే ఆ తర్వాత సీఆర్‌డీఏ కమిషనర్‌గా నియమితులయ్యారు. 
► ల్యాండ్‌ పూలింగ్‌ స్కీం జీవో 41ని అడ్డంపెట్టుకుని ఓ క్రమ పద్ధతిలో అక్రమాలకు తెరలేపి కుట్రకు పాల్పడ్డారని స్పష్టంగా తెలుస్తోంది. సీఐడీ ఇప్పటికే అన్నే సుధీర్‌బాబు, బ్రహ్మానందరెడ్డిలపై కేసు నమోదు చేసింది. వారి కార్యాలయాల్లో తనిఖీలు చేయగా, పలు కీలక ఫొటోలు, డాక్యుమెంట్లు, వీడియోలు లభించాయి. వీటిపై కూడా లోతుగా విచారణ జరపాల్సి ఉంది. 

బాబు, నారాయణల భాగస్వామ్యం  
► ఈ వ్యవహారంలో మరింత లోతుగా విచారణ జరిపితే అప్పటి ప్రభుత్వానికి సన్నిహితులైన వ్యక్తుల పేర్లు, జీవో 41 ద్వారా లబ్ధి పొందిన ప్రముఖుల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఓ వర్గ ప్రజలకు ఆయాచిత లబ్ధి చేకూర్చేందుకే జీవో 41ని తీసుకొచ్చారని స్పష్టమైంది. 
► ఈ కేసులో నిందితులుగా ఉన్న వ్యక్తులు, మరికొందరు నిందితులతో కలిసి తప్పుడు రిపోర్టులు తయారు చేశారు. వాటిని పబ్లిక్‌ రిపోర్టుల్లో చేర్చారు. అంతిమంగా సీఆర్‌డీకు, ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూర్చారు. దీని వెనుక లోతైన కుట్ర ఉంది. ఈ దశలో చంద్రబాబు, నారాయణలు ఈ పిటిషన్లు వేసి దర్యాప్తును అడ్డుకోవాలని చూస్తున్నారు.
► ఈ వ్యాజ్యాలు అపరిపక్వమైనవి. ప్రస్తుత అధికార ప్రభుత్వంపై పిటిషనర్లు చేస్తున్న నిందారోపణలకు ఎలాంటి ఆధారాలు లేవు. ఈ నిందారోపణలను సాకుగా చూపి కేసు కొట్టేయాలని కోరుతున్నారు. ప్రాథమిక విచారణలో చంద్రబాబు, నారాయణలకు ఈ నేరంతో భాగస్వామ్యం ఉన్నట్లు తేలింది. 

భారీ కుట్ర ఉందనడంలో సందేహం లేదు
► రాజధాని ప్రాంత పరిధిలోని మూడు మండలాల తహసీల్డార్లకు కలెక్టర్‌ కార్యాలయం 2016 జూలై 8న లేఖలు రాసింది. ఈ మూడు మండలాలకు సంబంధించిన రివెన్యూ రికార్డులు అందుబాటులో లేవని, అందువల్ల క్షేత్ర స్థాయిలో సర్వే చేసి అసైన్డ్‌ భూముల యజమానులు ఎవరో తేల్చాలని వారిని ఆదేశించింది.
► అప్పటి తహసీల్దార్‌ వాంగ్మూలం, కలెక్టర్‌ కార్యాలయం రాసిన లేఖలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. అయితే ఈ రెండింటినీ పరిశీలిస్తే ఈ మొత్తం వ్యవహారంలో భారీ కుట్ర ఉందనే విషయంలో ఎలాంటి సందేహాలకు తావు లేదు. 
► జాయింట్‌ కలెక్టరే 2014లో రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. మళ్లీ కలెక్టర్‌ కార్యాలయమే రికార్డులు అందుబాటులో లేవని 2016లో తహసీల్దారులకు లేఖలు రాస్తుంది. అసైన్‌మెంట్‌ వివరాలను రికార్డుల నుంచి తొలగించిన విషయం ప్రాథమిక విచారణలో తేలింది. అసలు వాస్తవంగా తెర వెనుక ఏం జరిగిందనేది లోతుగా దర్యాప్తు జరిపితే తెలుస్తుంది. ఒరిజినల్‌ రికార్డులు ఎక్కడున్నాయో తేల్చాల్సి ఉంది. 

దర్యాప్తును అడ్డుకోవడానికే ఈ పిటిషన్లు 
► ప్రాథమిక దశలోనే దర్యాప్తును అడ్డుకోవడానికే చంద్రబాబు, నారాయణలు ఈ వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఫిర్యాదులో నేరాన్ని రుజువు చేసే ప్రాథమిక ఆధారాలున్నప్పుడు న్యాయస్థానాలు సాధారణంగా దర్యాప్తు విషయంలో జోక్యం చేసుకోవు. 
► దర్యాప్తును పూర్తి చేసేందుకు అనుమతినిస్తాయి. ప్రస్తుత కేసులో పిటిషనర్లకు వ్యతిరేకంగా నిర్ధిష్టమైన ఆధారాలున్నాయి. కాగ్నిజబుల్‌ నేరానికి పాల్పడ్డారనేందుకు రుజువులున్నాయి. దర్యాప్తు అన్నది పూర్తిగా పోలీసుల పరిధిలోని వ్యవహారం. 
► ఇందులో సీఆర్‌పీసీ సెక్షన్‌ 482 కింద న్యాయ స్థానాలు జోక్యం చేసుకోవడానికి వీల్లేదు. కాగ్నిజబుల్‌ నేరంలో దర్యాప్తు జరిపే చట్టబద్ధమైన హక్కు, బాధ్యత పోలీసులకు ఉందని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. కాగ్నిజబుల్‌ నేరాల్లో న్యాయస్థానాలు దర్యాప్తును అడ్డుకోరాదని కూడా చెప్పింది.
► వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఈ కేసులో మార్చి 19న ఇచ్చిన స్టే ఉత్తర్వులను ఎత్తివేయండి. ఇదే సమయంలో చంద్రబాబు, నారాయణలు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టేయండి. 

ఈ మొత్తం నేరంలో గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పురపాలక శాఖ మంత్రిగా ఉన్న నారాయణలకు భాగస్వామ్యం ఉంది. వారి పాత్రపై ప్రాథమిక ఆధారాలు లభించాయి. వీరిద్దరూ ఇతర నిందితులతో కలిసి ‘పథక రచన’ చేసి కుట్ర పూరితంగా వ్యవహరించారు. లోతుగా విచారణ జరిపితే అనేక కీలక విషయాలు, వ్యక్తుల పేర్లు బయటకు వస్తాయి. ఇలాంటి దశలో దర్యాప్తును నిలుపుదల చేయడానికి వీల్లేదని సుప్రీంకోర్టు కూడా చెప్పింది. అందువల్ల గతంలో ఇచ్చిన స్టే ఉత్తర్వులను ఎత్తివేయడంతో పాటు చంద్రబాబు, నారాయణలు దాఖలు చేసిన వ్యాజ్యాలను కొట్టేయాలి.
– హైకోర్టులో సీఐడీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement