అక్రమ ఇసుక తరలింపులో టీడీపీ నేతల మధ్య ఘర్షణ
ముగ్గురికి గాయాలు
నెల్లూరు జిల్లా పెనుబల్లిలో ఘటన
ఇసుకను అక్రమంగా తరలించి సొమ్ము చేసుకునే విషయంలో టీడీపీలోని రెండువర్గాలు మధ్య ఘర్షణ తలెత్తగా.. ముగ్గురు గాయపడ్డారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం మండలం పెనుబల్లిలో మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. గ్రామ టీడీపీ నాయకులు పెంచలయ్య, వెంకటేశ్వర్లు, సురేష్‌రెడ్డి జొన్నవాడ నుంచి ఇసుక లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌ను పెనుబల్లి వద్ద అడ్డుకున్నారు.
ట్రాక్టర్ డ్రైవర్ జొన్నవాడలోని యజమానికి సమాచారం అందించగా.. అక్కడి టీడీపీ కార్యకర్తలు ప్రణీత్, ప్రసాద్ మరికొంతమంది పెనుబల్లి చేరుకుని ట్రాక్టర్ ఎందుకు ఆపారని పెంచలయ్యను ప్రశ్నించారు. మాటామాటా పెరిగి వివాదం చెలరేగడంతో ఒకరిపై ఒకరు దాడులకు తెగబడ్డారు.
ఈ ఘటనలో పెనుబల్లికి చెందిన టీడీపీ నాయకులు పెంచలయ్య, సురేష్‌రెడ్డి, వెంకటేశ్వర్లుకు గాయాలయ్యాయి. స్థానికులు 108కు సమాచారం అందించడంతో వారిని బుచ్చిరెడ్డిపాళెం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. – బుచ్చిరెడ్డిపాళెం రూరల్
కన్నెత్తి చూడని అధికారులు
జొన్నవాడ వద్ద పెన్నా నది నుంచి నిత్యం ఇసుక, పెనుబల్లి పొలాల నుంచి మట్టిని ట్రాక్టర్లతో తరలిస్తున్నా రెవెన్యూ, విజిలెన్స్, పోలీస్ అధికారులు కన్నెత్తి చూడటం లేదు. రెండు గ్రామాల టీడీపీ నాయకుల ప్రోద్బలంతో నిత్యం అక్రమంగా ఇసుక తరలిస్తూ రూ.లక్షల్లో వెనకేసుకుంటున్నారు.
మండలంలో మినగల్లు ఇసుక రీచ్ నుంచి మాత్రమే గతంలో ఇసుక తరలింపునకు అనుమతి ఉండేది. ప్రస్తుతం ఈ రీచ్‌కు కూడా అనుమతి లేదు. అయినా టీడీపీ నాయకులు ఇష్టారాజ్యంగా మట్టి, ఇసుక తరలించేస్తున్నారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సైతం తమను ఎవరూ ఏమీ చేయలేరని, ఇసుక, మట్టి తరలించే విషయంలో వెనక్కు తగ్గేదే లేదని టీడీపీ నేతలు చెబుతున్నారు.
పలుకుబడి ఉన్నవాళ్లకే ఇసుక
టీడీపీ నాయకులు, పలుకుబడి ఉన్నవారికే ఇసుక అందుబాటులో ఉంది. జొన్నవాడ, మినగల్లు నుంచి ఇసుక అక్రమంగా తరలించే విషయంలో టీడీపీ నాయకులు పోటీ పడుతున్నారు. ప్రజలకు మంచి చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. – విల్సన్, బుచ్చిరెడ్డిపాళెం
Comments
Please login to add a commentAdd a comment