పదో తరగతి పరీక్షలు తెలుగులోను రాయవచ్చు
విద్యా సంవత్సరం ప్రారంభమైన ఆరు నెలల తర్వాత నిర్ణయం
ఇప్పటి వరకు అన్ని ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్‌లోనే సన్నద్ధం
విస్తుపోతున్న విద్యార్థుల తల్లిదండ్రులు
ప్రభుత్వ స్కూళ్లను నిర్వీర్యం చేసేందుకేనని విద్యావేత్తల ఆగ్రహం
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందుకు గత ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యా సంస్కరణలను కూటమి సర్కారు ఒక్కొక్కటీ రద్దు చేస్తూ వస్తోంది. ఇప్పటికే సీబీఎస్‌ఈ సిలబస్‌ను, ఇంగ్లిష్ ప్రావీణ్య శిక్షణ టోఫెల్‌ను రద్దు చేసిన ప్రభుత్వం... తాజాగా ఇంగ్లిష్ మీడియంలో పరీక్షలు రాసే విధానంలో మార్పులు చేసింది.
2024–25 విద్యా సంవత్సరంలో పదో తరగతి పరీక్షలను ఇంగ్లిష్ మీడియంతోపాటు తెలుగు మీడియంలో కూడా రాయవచ్చని ఆదేశాలు జారీ చేసింది. విద్యా సంవత్సరం ప్రారంభమైన ఆరు నెలల తర్వాత తీరిగ్గా ఇప్పుడు మీడియం మార్పు చేయడం వల్ల ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు రాసే దాదాపు 4.20లక్షల మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతుందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
మీడియం ఎంచుకుని.. నామినల్ రోల్స్ పంపిన తర్వాత ఇలా...
ఈ నెల మొదటి వారం నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలకు ఫీజు చెల్లించే ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలకు చెందిన దాదాపు 4 లక్షల మంది వరకు ఫీజు చెల్లించారు. నామినల్ రోల్స్ పంపించినప్పుడు ఎంచుకున్న మీడియంలోనే పరీక్షలు రాయాలి.
ఫీజు చెల్లించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులంతా ఇంగ్లిష్ మీడియంనే ఎంచుకున్నారు. అయితే, ఇప్పుడు ఆన్‌లైన్ అప్లికేషన్‌లో ‘మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్’లో ‘తెలుగు’ మార్చుకునేందుకు ఎడిట్ అవకాశం కల్పించాలని అన్ని పాఠశాలల హెచ్‌ఎంలను బుధవారం విద్యాశాఖ ఆదేశించింది.
గత ప్రభుత్వం ఒకటో తరగతి నుంచి ఇంగ్లిష్ మీడియం అమలు
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 2020–21 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ఇంగ్లిష్ మీడియంను అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం దాదాపు 91.33 శాతం మంది విద్యార్థులు ఇంగ్లిష్ మీడియంలోనే పరీక్షలు రాస్తున్నారు. మిగిలిన వారు ఈ విద్యా సంవత్సరం (2024–25) ఇంగ్లిష్ మీడియంలో పదో తరగతి బోర్డు పరీక్షలు రాయాల్సి ఉంది.
దేశంలో సగటున 37.03 శాతం మంది మాత్రమే ఇంగ్లిష్ మీడియంలో పరీక్షలు రాస్తున్నారు. మన రాష్ట్రంలో 2023–24 విద్యా సంవత్సరం పదో తరగతి విద్యార్థులు 2.23 లక్షల మంది స్వచ్ఛందంగా ఇంగ్లిష్ మీడియంలో పరీక్షలు రాసి 1.96 లక్షల మంది ఉత్తీర్ణులయ్యారు.
ఇప్పుడు తెలుగు మీడియం పరీక్ష విధానం తెరపైకి తేవడంపై తల్లిండ్రులు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. విద్యార్థులు కోరుకున్న ఇంగ్లిష్ మీడియం విద్యను రద్దు చేయడంతోపాటు ప్రభుత్వ పాఠశాలలను క్రమంగా దిగజార్చుతూ నిర్వీర్యం చేసే దిశగా ఈ సర్కారు చర్యలు ఉన్నాయని విద్యావేత్తలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment