రాజకీయాల్లో విలువలు ఉండాలంటూ సీఎం చంద్రబాబు ప్రవచనాలు
వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యులకు భారీగా ప్రలోభాల ఎర
ఒకవైపు నీచ రాజకీయాలు.. మరోవైపు నీతి సూత్రాలు
చేపల్ని మింగడానికి ముందు కొంగ మాదిరిగా దొంగ జపం
కుట్ర, క్షుద్ర రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్ బాబే
ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు పెద్దపీట వేసి పెద్దల సభకు పంపింది వైఎస్ జగనే
సాక్షి, అమరావతి: ‘రాజకీయాల్లో విలువలు ఉండాలి...!’ నిస్సందేహంగా ఉండాల్సిందే కానీ.. ఆ మాటలు సీఎం చంద్రబాబు చెబుతుంటే ఎబ్బెట్టుగా ఉంది! ‘నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు’ అనే రీతిలో రాజకీయాల్లో విలువల గురించి ఆయన చెబుతున్నారు. దయ్యాలు వేదాలు వల్లించినట్లు... గుంటనక్కలు ధర్మ ప్రబోధం చేసినట్టు... తాజాగా రాజకీయ సుభాషితాలు వల్లించారు.
విలువలు, విశ్వసనీయత అనే పదాలే తన నిఘంటువులో లేవని పదే పదే నిరూపించుకున్న చంద్రబాబు బుధవారం మీడియా సమావేశంలో రాజకీయ ప్రవచనాలు వినిపించడం విడ్డూరంగా ఉంది. ఎమ్మెల్యేల బలం, అధికార మదం, అక్రమార్జన, అవినీతి సొమ్ముతో ప్రజా ప్రతినిధులను కొనుగోలు చేస్తున్న సీఎం చంద్రబాబు నిస్సిగ్గుగా నీతిసూత్రాలు వల్లిస్తున్నారు. ఒకపక్క వైఎస్సార్ సీపీ సభ్యుల కొనుగోళ్లకు తెరతీస్తూ మరోపక్క నీతులు చెబుతున్నారు.
వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యులను తీసుకుని వాళ్లకు డబ్బులిచ్చి మరీ రాజీనామా చేయించి మళ్లీ వాళ్లనే తీసుకుంటామంటున్నారు. కొంతమందికి టర్మ్‌ను బట్టి వెల కడుతున్నారు. నాలుగేళ్ల టర్మ్ ఉంటే రూ.50 కోట్లు, రెండేళ్ల పదవీ కాలం ఉంటే రూ.20 కోట్లు చొప్పున కొనుగోళ్లకు తెగించారు. తప్పుడు పనులు చేస్తూనే మళ్లీ విలువల గురించి మాట్లాడుతున్నారు. రాజీనామా చేసి వస్తేనే తీసుకుంటానని చంద్రబాబు చెబుతున్నారు.
మరి రాజ్యసభ సభ్యుడి లాంటి ఉన్నత హోదాలో ఉన్నప్పుడు పదవీ కాలాన్ని వదిలేసుకుని ఏమీ ఆశించకుండా ఎందుకొస్తారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వారిని ప్రలోభాలకు గురి చేస్తున్నట్లు ఇక్కడే వెల్లడవుతోంది. వైఎస్ జగన్ గతంలో ఎన్నడూ లేనిరీతిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు పెద్దపీట వేసి రాజ్యసభకు వెళ్లే అవకాశం కల్పిస్తే.. చంద్రబాబు ఏనాడూ వారిని ఆదరించిన దాఖలాలు లేకపోగా వ్యాపారవేత్తలు, డబ్బు సంచులు అందించేవారికే అవకాశమిచ్చారు.
బేరసారాలకు తెగించే శ్రీరంగ నీతులు
చేపల్ని మింగడానికి ముందు కొంగ దొంగ జపం చేసినట్టుగా రాజకీయాల్లో విలువలను భ్రష్టు పట్టించే ముందు చంద్రబాబు వాటిని జపిస్తారని ఆయన 40 ఏళ్ల రాజకీయ జీవితం చెబుతోంది. తాజాగా అదే కుట్రలో భాగంగానే రాజకీయ విలువల ఆయన గురించి మాట్లాడారు. దాదాపు నెల రోజులుగా చంద్రబాబు తన ట్రేడ్ మార్క్ కుట్ర రాజకీయాలకు పదును పెడుతూ వస్తున్నారు. ప్రధానంగా వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యులతోపాటు కొందరు ఎమ్మెల్సీలకు భారీగా ప్రలోభాల ఎర వేశారు.
టీడీపీ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా రాజ్యసభలో ఆ పార్టీకి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. మరోవైపు రాష్ట్రం నుంచి రాజ్యసభలో ఉన్న 11 స్థానాల్లోనూ వైఎస్సార్‌సీపీ ఎంపీలే ప్రాతినిథ్యం వహిస్తున్నారు. మరో రెండేళ్ల వరకు రాజ్యసభ ద్వైపాక్షిక ఎన్నికలు కూడా లేవు. కేంద్ర ప్రభుత్వ బిల్లుల ఆమోదానికి రాజ్యసభలో సంఖ్యా బలం అత్యంత కీలకం కావడంతో వైఎస్సార్‌సీపీ జాతీయ స్థాయిలో రాజకీయంగా ప్రభావశీల పాత్ర పోషించే స్థితిలో ఉంది.
దాంతో కంగారెత్తిపోతున్న చంద్రబాబు వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యులను ప్రలోభాలకు గురిచేసి టీడీపీలో చేర్చుకునేందుకు కుట్రలకు తెరతీశారు. వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యులు కొందర్ని లక్ష్యంగా చేసుకుని భారీ మొత్తాన్ని ఎర వేశారు. ఇప్పుడు ఎంపీ పదవికి రాజీనామా చేస్తే.. రాజ్యసభ స్థానాలకు జరిగే ఉప ఎన్నికల్లో వారికే అవకాశం ఇస్తామని ఆశ చూపిస్తున్నారు.
శాసనసభలో టీడీపీ కూటమికి పూర్తి మెజార్టీ ఉన్నందున రాజ్యసభ సీటును ఏకగీవ్రంగా గెలిపించుకుంటామని చెబుతున్నారు. ఇటు భారీ మొత్తంలో నగదు మూటలు.. మరోవైపు రాజ్యసభ ఉప ఎన్నికల్లో టికెట్ ఇస్తామనే ఆఫర్ ఇస్తూ రాజకీయ దళారీ అవతారం ఎత్తారు చంద్రబాబు.
ఆ నేతలకు కేరెక్టర్ లేదు... అయినా చేర్చుకుంటాం
చంద్రబాబు తన దిగజారుడు రాజకీయాలను నిస్సిగ్గుగా సమర్ధించుకున్న తీరు ఊసరవెల్లిని మరిపిస్తోంది. వైఎస్సార్‌సీపీ నేతలను టీడీపీలో చేర్చుకునే అంశంపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆయన చెప్పిన పరస్పర విరుద్ధ సమాధానాలే అందుకు నిదర్శనం. ‘వైఎస్సార్‌సీపీ నేతల కేరెక్టర్ గురించి వింటుంటే షేమ్ అనిపిస్తోంది’ అని పేర్కొన్నారు. అంతలోనే ‘వైఎస్సార్‌సీపీ నేతలు ఎవరైనా సరే ఆ పార్టీకి రాజీనామా చేశాకే టీడీపీలో చేర్చుకుంటాం’ అని చెప్పుకొచ్చారు. ‘నేతల వ్యక్తిత్వం ఆధారంగానే పార్టీలో చేర్చుకునేదీ లేనిదీ నిర్ణయిస్తాం’ అని చెప్పారు.
ఓటుకు కోట్లు.. ఫిరాయింపులు..
రాష్ట్రంలోనే కాదు యావత్ దేశంలోనే కుట్ర రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా గుర్తింపు పొందిన ఘనత చంద్రబాబుదే. అడుగడుగునా క్షుద్ర రాజకీయాలే సాగించారని ఆయన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ప్రతీ దశ స్పష్టం చేస్తోంది. రాష్ట్ర విభజన అనంతరం 2014లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే కుట్రలు, బేరసారాలకు తెరతీశారు. 2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు కోట్లు కుట్రకు తెగబడ్డారు.
టీడీపీ అభ్యర్థిని గెలిపించేందుకు టీఆర్‌ఎస్ (ప్రస్తుత బీఆర్‌ఎస్) ఎమ్మెల్యేకు రేవంత్‌రెడ్డి (ప్రస్తుత తెలంగాణ సీఎం) ద్వారా బ్యాగులో కోట్ల రూపాయలు పంపించి సాక్ష్యాలతో అడ్డంగా దొరికిపోయారు. ‘మావాళ్లు బ్రీఫ్డ్ మి..’ అంటూ రేవంత్‌రెడ్డి ఫోన్ ద్వారా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సెబాస్టియన్‌తో చంద్రబాబు మాట్లాడిన మాటలు జాతీయ స్థాయిలో ఆయన బండారాన్ని బట్టబయలు చేశాయి.
ఆ ఉదంతంపై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేయడంతో చంద్రబాబు రాత్రికి రాత్రే హైదరాబాద్‌ను విడిచి పెట్టి కరకట్ట నివాసానికి చేరుకోవడం ద్వారా నాడు ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో ఏపీ ప్రయోజనాలను పణంగా పెట్టారు. టీడీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా 67 మంది ఎమ్మెల్యేలతో బలమైన ప్రతిపక్షంగా అవతరించిన వైఎస్సార్‌సీపీ శాసనసభ లోపల, బయట చేస్తున్న పోరాటాలతో చంద్రబాబు బెంబేలెత్తారు.
దాంతో వైఎస్సార్‌సీపీకి చెందిన ముగ్గురు ఎంపీలతోపాటు 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొన్నట్టు నిస్సిగ్గుగా కొనుగోలు చేశారు. ఆ రోజు ముగ్గురు ఎంపీలు, 23 మంది ఎమ్మెల్యేలు వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేయకుండానే టీడీపీ కండువాలు కప్పి పార్టీలో చేర్చుకున్నారు. వారిపై అనర్హత వేటు వేయకుండా అప్పటి స్పీకర్ కోడెల శివ ప్రసాదరావు కుట్ర రాజకీయాలకు సహకరించారు. అంతేకాదు వారిలో నలుగురు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కూడా ఇచ్చి విలువలకు పాతరేశారు. తద్వారా ఏకంగా గవర్నర్‌తోనే తప్పు చేయించారు.
అసలు చంద్రబాబు తొలిసారిగా ముఖ్యమంత్రి అయ్యిందే రాజకీయ కుట్రతోనే కదా! 1994లో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి కాగానే 9 నెలల్లోనే ఆయనకు వెన్నుపోటు పొడిచి బాబు అడ్డదారిలో అధికారంలోకి వచ్చారు. ఆ కుట్రలో తనకు సహకరించిన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, బావమరిది నందమూరి హరికృష్ణ తదితరులందరికీ పొగబెట్టి పార్టీ నుంచి బయటకు పంపేశారు.
2014–19లో మంత్రి పదవి ఆశ చూపించి టీడీపీలో చేర్చుకున్న ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, కిడారి సోమేశ్వరరావులకు మొండిచెయ్యి చూపించారు. ఆ మనోవేదనతో భూమా నాగిరెడ్డి మృతిచెందగా కిడారి సోమేశ్వరరావు మావోయిస్టుల చేతిలో ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి చరిత్ర ఉన్న చంద్రబాబు ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలను ప్రలోభాలకు గురి చేసే కుట్రను వేగవంతం చేశారు.
ఇంత క్షుద్ర రాజకీయానికి నిస్సిగ్గుగా బరితెగిస్తూ కూడా చంద్రబాబు ఓ మాట పదే పదే చెబుతున్నారు. అదేమిటంటే.. ‘రాజకీయాల్లో విలువలు ఉండాలి’...!!! వాహ్వా...వాహ్వా...!!!
Comments
Please login to add a commentAdd a comment