
విలేకరులతో మాట్లాడుతున్న మంత్రి పెద్దిరెడ్డి
సాక్షి, తిరుపతి: నవరత్నాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 25న చిత్తూరు జిల్లాలో ప్రారంభించనున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. తిరుపతి లేదా శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. తిరుపతిలో సోమవారం పీఎల్‌ఆర్ కన్వెన్షన్‌లో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీలు మిథున్‌రెడ్డి, రెడ్డెప్ప, ఎమ్మెల్యేలు భూమన కరుణాకరరెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, బియ్యపు మధుసూదన్‌రెడ్డి, ద్వారకనాథ్‌రెడ్డి, జంగాలపల్లి శ్రీనివాసులు, వెంకటేశ్‌గౌడ్, నవాజ్ బాషా, ఆదిమూలం ఇతర పార్టీ నాయకులు సమావేశమయ్యారు.
రాష్ట్ర వ్యాప్తంగా 32 లక్షల మందికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేయనున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. పంపిణీ కార్యక్రమం పూర్తిచేసిన వెంటనే పక్కాగృహాల నిర్మాణాన్ని కూడా చేపట్టనున్నట్లు వెల్లడించారు. మొదటి విడతలో 15 లక్షల పక్కాగృహాలను నిరి్మంచనున్నట్లు వివరించారు. రెండో విడతలో మిగిలిన ఇళ్ల నిర్మాణాలను పూర్తిచేస్తామన్నారు. ఇళ్ల పట్టాల పంపిణీ, ఆ వెంటనే పక్కాగృహాల నిర్మాణ కార్యక్రమాలపై పార్టీ నేతలు చర్చించారు. ఇక్కడ ఇళ్ల పట్టాల పంపిణీ ప్రారంభమైన మరుసటి రోజు నుంచి 15 రోజుల పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వారి వారి ప్రాంతాల్లో ఇళ్ల పట్టాల పంపిణీ, పక్కాగృహాల నిర్మాణ కార్యక్రమాలను ప్రారంభించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment