CM Jagan Video Conference With Collectors And SPs Over Jaganannaku Chebudam Program - Sakshi
Sakshi News home page

మే 9 నుంచి ‘జగనన్నకు చెబుదాం’

Published Sat, Apr 29 2023 3:48 AM | Last Updated on Sat, Apr 29 2023 11:52 AM

CM Jagan with Collectors and SPs On Jaganannaku Chebudam - Sakshi

సాక్షి, అమరావతి: వివిధ ప్రభుత్వ సేవలకు సంబంధించి ప్రజల సమస్యలను నిర్దిష్ట సమయంలోగా నాణ్యతతో పరిష్కరించడంతో పాటు నాణ్యమైన సేవలను అందించడమే లక్ష్యంగా ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ‘జగనన్నకు చెబుదాం’ కార్య­క్రమాన్ని మే 9వతేదీ నుంచి ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. నమోదైన సమస్యల పరిష్కారంతోపాటు ప్రభుత్వ సేవలు, పథకాలపై ఆరా తీయడం, ముఖ్యమంత్రి సందేశాలను నేరుగా చేరవేయడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని వివరించారు.

ముఖ్యమంత్రి నేరుగా ప్రజలతో కనెక్ట్‌ అయి ఉంటారని, సేవల్లో  సమస్యలు, సలహాలను నేరుగా తెలియచేయవచ్చని వెల్లడించారు. ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి కార్యాలయం ఆయా సమస్యలు నిర్దేశిత సమయంలోగా పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోనున్నట్లు వివరించారు. స్పందన కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి జగన్‌ శుక్రవారం తన క్యాంపు కార్యాలయం నుంచి కలె­క్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫ­రెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమం ఉద్దేశం, ఆశయాలు, లక్ష్యాలపై అధికార యంత్రాంగానికి దిశా నిర్దేశం చేశారు. 

హెల్ప్‌లైన్‌ నంబర్‌ 1902  
మే 9న ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. అందుకోసం 1902  హెల్ప్‌లైన్‌ నంబర్‌ను ప్రవేశ పెడుతున్నాం. ఇప్పటికే పలు­మార్లు సమీక్షలు చేశాం. జగనన్నకు చెబుదాం పేరులో ముఖ్యమంత్రి అయిన నా పేరు జోడించారంటే ఈ కార్యక్రమానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఎంత ఉందో అర్థం అవుతోంది. ఇది చాలా ప్రతిష్టాత్మక కార్యక్రమం. మనం ఇప్పటికే స్పందన నిర్వహిస్తున్నాం.

స్పందనకు మరింత మెరుగైన రూపమే ‘జగనన్నకు చెబుదాం’.. నాణ్యమైన సేవలను ప్రజలకు అందించడమే ‘జగనన్నకు చెబుదాం..’! సమస్యలను అత్యంత నాణ్యంగా పరిష్కరించడమే ఈ కార్యక్రమం ఉద్దేశం. హెల్ప్‌లైన్‌కు కాల్‌ చేసి సమస్యను నమోదు చేసుకుంటే అత్యంత నాణ్యతతో పరిష్కరించాలి. 

సీఎంవో నుంచి మండలాల వరకూ పర్యవేక్షణ యూనిట్లు
సీఎంవో, ప్రభుత్వ శాఖల అధిపతులు, జిల్లా, డివిజన్‌ స్థాయి, మండల స్థాయిలో మానిటరింగ్‌ యూనిట్లు ఉంటాయి. వీటిని కలెక్టర్లు తప్పనిసరిగా పర్యవేక్షించాలి. సమస్య పరిష్కారంలో క్వాలిటీ పెంచడం అన్నది ప్రధాన లక్ష్యం కావాలి. ప్రాజెక్ట్‌ మానిటరింగ్‌ యూనిట్ల ద్వారా పర్యవేక్షణ చేస్తేనే అది సాధ్యం. ప్రాజెక్ట్‌ మానిటరింగ్‌ యూనిట్ల(పీఎంయూ)ను సీఎంవో కూడా పర్యవేక్షిస్తుంది. హెల్ప్‌లైన్‌ ద్వారా గ్రీవెన్స్‌ నమోదవుతాయి. వాటిని నిర్దేశిత సమయంలోగా నాణ్యతతో పరిష్కరించాలి. ఫిర్యాదు చేసిన వ్యక్తికి సంతృప్తి కలిగించడం అన్నది చాలా ముఖ్యమైన విషయం.

సమస్యల పరిష్కారంపై ప్రజలకు అప్‌డేట్స్‌
తమ సమస్యల పరిష్కారంపై ఐవీఆర్‌ఎస్, ఎస్సెమ్మెస్‌ల ద్వారా ప్రజలకు క్రమం తప్పకుండా అప్‌డేట్స్‌ అందుతాయి. అంతేకాకుండా ఇదే హెల్ప్‌లైన్‌ ద్వారా సమస్యల పరిష్కారంపై అర్జీదారులనుంచి ఫీడ్‌ బ్యాక్‌ కూడా తీసుకుంటారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో వలంటీర్లు ప్రతి ఇంటినీ సందర్శించి 1902 హెల్ప్‌లైన్‌ గురించి అవగాహన కల్పిస్తారు. ఈ హెల్ప్‌లైన్‌ను వినియోగించుకునేలా ప్రోత్సహిస్తారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమం ప్రారంభమయ్యేలోగా వలంటీర్లు ప్రతి గడపకూ 1902 గురించి చెబుతారు. 

ప్రతేక అధికారులుగా సీనియర్‌ ఐఏఎస్‌లు 
సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు జిల్లాలకు ప్రత్యేకాధికారులుగా వ్యవహరిస్తారు. క్రమం తప్పకుండా ప్రతి 15 రోజులకోసారి సంబంధిత జిల్లాలను సందర్శించి పర్యవేక్షిస్తారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమం అమలును కలెక్టర్లతో కలసి పర్యవేక్షిస్తారు. సమస్యల పరిష్కారాల తీరును ర్యాండమ్‌గా తనిఖీ చేస్తారు. ప్రాజెక్ట్‌ మానిటరింగ్‌ యూనిట్ల పనితీరును గమనిస్తారు.

ఎక్కడైనా సమస్య పరిష్కారం పట్ల సంతృప్తి చెందకుంటే తిరిగి ఓపెన్‌ చేస్తారు. ఎస్‌ఎంఎస్, ఐవీఆర్‌ఎస్‌ ఫీడ్‌ బ్యాక్‌ ఆధారంగా దాన్ని తిరిగి తెరుస్తారు. పరిష్కారం తీరుపై పూర్తిస్థాయిలో సమీక్ష చేస్తారు. చీఫ్‌ సెక్రటరీ, సీఎంవో, డీజీపీతో కలిసి రెగ్యులర్‌గా మానిటర్‌ చేస్తారు. ప్రతి 15 రోజులకోసారి పూర్తిస్థాయిలో సమీక్ష ఉంటుంది.

ప్రతి కలెక్టర్‌కు తక్షణం రూ.3 కోట్లు
ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి  పేరు పెట్టారంటే ఇది ఎంత ముఖ్యమైనదో అర్థం చేసుకోవాలి. ముఖ్యమంత్రి అధికారులపై ఆధారపడే విధులను నిర్వహిస్తారు. మీరు అత్యంత సమర్థవంతంగా విధులు నిర్వహిస్తే ప్రభుత్వం సమర్ధంగా పని చేసినట్లే. అప్పుడే ఈ కార్యక్రమం చక్కగా సాగుతున్నట్లు లెక్క.

ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది. ప్రజలకు నాణ్యంగా సేవలను అందించాలన్నదే దీని ఉద్దేశం. ప్రతి కలెక్టర్‌కు రూ.3 కోట్లను తక్షణ నిధులుగా ప్రభుత్వం ఇస్తుంది. అవసరమైన చోట ఈ డబ్బులను ఖర్చు చేయవచ్చు. వీటిని ఖర్చు చేసే అధికారం కలెక్టర్‌కు ఇస్తున్నాం. 

గ్రామ స్థాయిలో అన్ని అంశాలపై దృష్టి
కలెక్టర్లు, స్పెషల్‌ ఆఫీసర్లు, మానిటరింగ్‌ యూనిట్లు గ్రీవెన్స్‌తో పాటు గ్రామస్ధాయిలో అన్ని అంశాలపైనా దృష్టి పెడతారు. దీనివల్ల వేగంగా గ్రీవెన్స్‌ పరిష్కారంలో డెలివరీ మెకానిజం ఉంటుంది. అంతేకాకుండా గ్రామ స్థాయిలోని సచివాలయాలు, ఆర్బీకేలు, అంగన్‌వాడీలు, విలేజ్‌ క్లినిక్స్‌.. అవన్నీ సక్రమంగా పనిచేస్తున్నాయా? లేదా? అన్న అంశంపైన కూడా దృష్టిపెడతారు.

గ్రామాలలో ఇళ్ల నిర్మాణంపైనా దృష్టి సారిస్తారు. ఇవి సక్రమంగా పనిచేస్తే గ్రామస్ధాయిలో చాలావరకు సమస్యలు సమసిపోతాయి. అవి సమర్థంగా పనిచేయడం అన్నది చాలా ముఖ్యమైన విషయం. దీనికోసమే మానిటరింగ్‌ కమిటీలతో పాటు స్పెషల్‌ ఆఫీసర్లను నియమిస్తున్నాం.

సమావేశంలో విద్యాశాఖమంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్‌ డాక్టర్‌ కె.ఎస్‌.జవహర్‌రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి, ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ చీఫ్‌ కమిషనర్‌ జి.సాయిప్రసాద్, గృహనిర్మాణశాఖ స్పెషల్‌ సీఎస్‌ అజయ్‌జైన్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌ గిరిజాశంకర్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌ కుమార్, ఐటీ శాఖ కార్యదర్శి కోన శశిధర్, ఏపీడీడీసీఎఫ్‌ ఎండీ అహ్మద్‌బాబు, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ (మౌలిక వసతులు కల్పన) కాటమనేని భాస్కర్, వ్యవసాయశాఖ స్పెషల్‌ కమిషనర్‌ హరికిరణ్, ఆర్‌ అండ్‌ బీ కార్యదర్శి పీఎస్‌ ప్రద్యుమ్న, పౌరసరఫరాలశాఖ కమిషనర్‌ హెచ్‌.అరుణ్‌ కుమార్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్‌ సూర్యకుమారి, సెర్ఫ్‌ సీఈఓ ఏ ఎండి ఇంతియాజ్, ఆరోగ్య కుటుంబసంక్షేమశాఖ కమిషనర్‌ నివాస్, మత్స్యశాఖ కమిషనర్‌ కన్నబాబు, ఏపీ జెన్‌కో ఎండీ చక్రధర్‌బాబు, హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీ లక్ష్మీషా, డీఐజీ గోపీనాథ్‌ జెట్టి తదితరులు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement