తొమ్మిదేళ్ల మహమ్మద్‌కు కొత్త జీవితాన్ని ప్రసాదించిన సీఎం జగన్
పాఠశాలలో ప్రమాదవశాత్తు కిందపడి పూర్తిగా చితికిపోయిన బాలుడి స్వరపేటిక, శ్వాసనాళం.. అరుదైన శస్త్ర చికిత్సకు రూ.6 లక్షలకు పైగా ఖర్చు
ఇటుక బట్టీలో కూలి పనులు చేసుకునే ఆ కుటుంబానికి స్థోమతకు మించిన భారం
పూర్తి ఖర్చులు భరించిన రాష్ట్ర ప్రభుత్వం
మరో శస్త్ర చికిత్సతో త్వరలో మాటలు వస్తాయన్న వైద్యులు
సాక్షి, అమరావతి: నిరుపేద కుటుంబాన్ని పెద్దకష్టం చుట్టుముట్టింది. ఊహించని ప్రమాదంలో తొమ్మిదేళ్ల కుమారుడు తీవ్రంగా గాయపడి నోట మాటలేక, శ్వాసకూడా తీసుకోలేని పరిస్థితుల్లో తల్లిదండ్రులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. బాలుడి చికిత్సలకు రూ.లక్షల్లో ఖర్చవుతాయని వైద్యులు చెప్పడంతో అంత డబ్బును సమకూర్చలేని నిస్సహాయత వారిది. ఆపద సమయంలో సీఎం జగన్ ఆ కుటుంబాన్ని ఆదుకున్నారు. బాలుడి చికిత్సకు ఎంత ఖర్చయినా ప్రభుత్వమే భరిస్తుందని భరోసా ఇవ్వడమే కాకుండా.. ఖరీదైన చికిత్సను చేయించింది. ఆ నిరుపేద కుటుంబంలో వెలుగులు నింపింది.
స్వరపేటిక, శ్వాసనాళం చితికిపోయి..
పల్నాడు జిల్లా నకరికల్లులోని పాతూరుకు చెందిన షేక్ బాజీ, ఖాజాబీ ఇటుక బట్టీల్లో కూలీ పనులు చేసుకుంటుంటారు. వీరికి ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు తొమ్మిదేళ్ల అనాస్ మహమ్మద్ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు.
ఈ ఏడాది ఫిబ్రవరి 29న పాఠశాల ఆవరణలో ఆడుకుంటూ కిందపడిపోయాడు. ప్రమాదంలో బాలుడి గొంతుకు ఇనుపరాడ్ బలంగా గుచ్చుకుపోయింది. స్వరపేటిక, శ్వాసనాళం పూర్తిగా చితికిపోయాయి. హుటాహుటిన నరసరావుపేట ప్రభుత్వా్రస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం అవసరమని నిర్ధారించిన వైద్యులు అంబులెన్స్‌లో వెంటిలేటర్‌పై హైదరాబాద్ తరలించారు.
మానవతా దృక్పథంతో స్పందించిన సీఎం
వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద 3,257 ప్రొసీజర్‌లతో లక్షలాది మంది బాధితులకు అండగా సీఎం జగన్ నిలిచారు. అక్కడితో ఆగకుండా ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాని అరుదైన జబ్బుల బారినపడి రూ.లక్షలు, కోట్లలో వైద్యానికి ఖర్చయ్యే వారిని ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆదుకుంటున్నారు. ఈ క్రమంలోనే మహమ్మద్ విషయంలోనూ సీఎం జగన్ మానవతా ధృక్పథంతో స్పందించారు.
బాలుడి చికిత్సకు ఎంత ఖర్చయినా వెనుకాడొద్దని అధికారులను ఆదేశించారు. దీంతో సీఎంవో అధికారులు హైదరాబాద్‌లోని ఆస్పత్రి యాజమాన్యానికి ఫోన్‌చేసి బాలుడి శస్త్ర చికిత్సకయ్యే మొత్తం ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని, వెంటనే శస్త్ర చికిత్సలు నిర్వహించాలని సూచించారు. దీంతో వైద్యులు అత్యంత క్లిష్టమైన లెరింగోట్రైకెల్ రీకన్‌స్ట్రక్షన్ శస్త్ర చికిత్సను చేపట్టారు.
చికిత్స అనంతరం వైద్యుల పరిశీలన ముగించుకుని ఈ నెల 14న బాలుడు డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్లాడు. మరో మూడు నెలల అనంతరం ఇంకొక సర్జరీ చేస్తే బాలుడు ముందులా మాట్లాడగలుగుతాడని వైద్యులు చెబుతున్నారు. ఆపద కాలంలో సీఎం జగన్ చేసిన మేలును ఎప్పటికీ మరువలేమని ఖాజాబీ దంపతులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. తమ బిడ్డ తమకు దక్కుతాడో లేదోనని ఎంతో ఆందోళనకు గురయ్యామని భావోద్వేగానికి గురవుతున్నారు.
ఒక్క ట్వీట్‌తో స్పందించిన ప్రభుత్వం
దెబ్బతిన్న స్వరపేటిక, శ్వాసనాళానికి అత్యంత క్లిష్టమైన లెరింగోట్రైకెల్ రీకన్‌స్ట్రక్షన్ శస్త్రచికిత్స చేయాలని వైద్యులు నిర్ధారించారు. ఆ చికిత్స నిర్వహణ, వైద్య పరీక్షలు, మందులకు రూ.6 లక్షలకు పైగా ఖర్చవుతుందని చెప్పారు. రెక్కలు ముక్కలయ్యేలా కష్టం చేసే ఖాజాబీ దంపతులకు అంత పెద్దమొత్తంలో అప్పు పుట్టని పరిస్థితి.
వారి నిస్సహాయ స్థితిని చూసిన గ్రామస్తులంతా తలా కొంత ఇవ్వడానికి ముందుకొచ్చారు. అయినప్పటికీ.. చికిత్సకు సరిపోయేంత డబ్బు సమకూరకపోవడంతో మహమ్మద్‌ను ఆదుకోవాలంటూ ఓ డాక్టర్ ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌పై ఏపీ సీఎంవో అధికారులు స్పందించారు. ఈ విషయాన్నివెంటనే సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు.
దేవుడిలా ఆదుకున్నారు
రోజూ పనికెళ్లి కూలి డబ్బులతో జీవిస్తున్నాం. తెచ్చుకుంటే తినాలి.. లేదంటే పస్తులుండాలి. ఇది మా జీవితం. అలాంటి మాపై ఉపద్రవంలా పెద్ద కష్టం వచ్చిపడింది. వెంటిలేటర్‌పై బాబును చూసి మాకు దక్కుతాడో లేదోనని ఎంతో ఆందోళనకు గురయ్యాను. ఆపరేషన్‌కు రూ.6 లక్షలు ఖర్చవుతుందనగానే నా నోట మాట లేదు. అంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలో కూడా దిక్కుతోచని పరిస్థితి. ఆ సమయంలో దేవుడిలా సీఎం జగన్ ఆదుకున్నారు. వైద్యానికి అయ్యే ఖర్చంతా భరిస్తామని చెప్పారు. ఈ రోజు మా బాబు సీఎం జగన్ దయవల్లే దక్కాడు. – షేక్ ఖాజాబీ, బాలుడి తల్లి
మా పిల్లల చదువులకు అండగా నిలిచారు
ఆ దేవుడు మా బిడ్డకు జన్మ ఇస్తే. సీఎం జగన్ పునర్జన్మ ఇచ్చారు. మా కుటుంబంలో వెలుగులు నింపారు. ఏమిచ్చినా ఆయన రుణం మేం తీర్చుకోలేం. అమ్మ ఒడి రూపంలో మా బిడ్డల చదువులకు చేదోడుగా ప్రభుత్వం నిలిచింది. పేదలందరికీ ఇళ్ల పథకం కింద ప్రభుత్వం మాకు ఇంటిస్థలం కూడా మంజూరు చేసింది. – షేక్ బాజీ, బాలుడి తండ్రి
Comments
Please login to add a commentAdd a comment