సీఎం వైఎస్ జగన్ చొరవతో తొమ్మిదేళ్ల బాలుడికి శస్త్రచికిత్స
సాక్షి, హైదరాబాద్/అమరావతి: ప్రమాదవశాత్తు స్వరపేటిక పూర్తిగా చితికిపోయి క్లిష్టపరిస్థిత్లులో చికిత్స కోసం ఎదురు చూస్తున్న తొమ్మిదేళ్ల బాలుడికి ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భరోసాతో పునర్జన్మ లభించింది. మాట కోల్పోయిన అతడు ఇప్పుడు గలగలా మాట్లాడగలుగుతున్నాడు. వివరాల్లోకి వెళితే.. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గ పరిధిలోని నకరికల్లుకు చెందిన షేక్ ఖాజాబీ, బాజీ దంపతులకు తొమ్మిదేళ్ల కొడుకు మహ్మద్ ఉన్నాడు.
ఫిబ్రవరి 29న స్కూల్‌కి వెళ్లిన బాలుడు తోటి పిల్లలతో ఆడుకుంటూ ఇనుప చువ్వ మీద జారిపడ్డాడు. ఆ చువ్వ గొంతులో బలంగా గుచ్చుకోవడంతో అతడి శ్వాసనాళం, స్వరపేటిక పూర్తిగా చితికిపోయాయి. దీంతో మాట నిలిచిపోయి, శ్వాస పీల్చుకోవడానికి సైతం ఇబ్బందిగా మారింది. బాలుడిని నరసరావుపేట ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా మెరుగైన వైద్యం కోసం వెంటిలేటర్ సహాయంతో అంబులెన్స్‌లో హైదరాబాద్ తరలించారు.
మహ్మద్‌ను పరిశీలించిన నీలోఫర్ ఆస్పత్రి వైద్యులు శ్వాస తీసుకోవడానికి తాత్కాలికంగా ఒక కృత్రిమ పైప్ అమర్చి, మరింత మెరుగైన వైద్యం కోసం కాంటినెంటల్ హాస్పిటల్‌కు వెళ్లాలని సూచించారు.
అరుదైన శస్త్రచికిత్సతో..
కాంటినెంటల్ హాస్పిటల్స్ లేరింగాలజిస్ట్ స్పెషలిస్ట్ దుష్యంత్ బృందం మహ్మద్‌ను పరిశీలించి అతడికి అతికష్టమైన, అరుదైన లెరింగోట్రైకెల్ రీకన్స్ట్రక్షన్ సర్జరీ చేయాలని నిర్ధారించారు. లెరింగాలజీలో ఫెలోషిప్ చేసిన నిష్ణాతులైన వైద్యులు మాత్రమే ఈ సర్జరీ చేయగలరని, ఏ మాత్రం తేడా వచ్చిన తీవ్ర నష్టం జరుగుతుందని స్పష్టం చేశారు. ఇందుకు రూ.6 లక్షలు ఖర్చవుతుందని తెలిపారు. అంత ఖర్చు భరించే స్తోమత లేని ఆ పేద తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు.
సోషల్ మీడియా ద్వారా బాలుడి ఆరోగ్య స్థితిని తెలుసుకున్న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అతడి ఆరోగ్యాన్ని చక్కదిద్దేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో సీఎంవో అధికారులు కాంటినెంటల్ హాస్పిటల్స్‌కు ఫోన్‌చేసి.. బాలుడికి చికిత్సతోపాటు ఆరోగ్యం చక్కబడటానికయ్యే ఖర్చంతా ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు.
వెంటనే వైద్యులు బాలుడికి విజయవంతంగా శస్త్రచికిత్స చేసి శ్వాసనాళాన్ని పునరుద్ధరించి.. క్లిష్టమైన స్వరపేటికను బాగు చేశారు. దీంతో బాలుడికి మాటొచ్చింది. ఈ సందర్భంగా బాలుడి తల్లిదండ్రులు ఖాజాబీ, బాజీ మాట్లాడుతూ.. కష్టకాలంలో తమ కుటుంబాన్ని సీఎం జగన్ ఆదుకున్నారని, ఉచితంగా చికిత్స చేయించారని కృతజ్ఞతలు తెలిపారు. సీఎం జగన్ సాయం చేయకపోతే తమబిడ్డ జీవితాంతం మూగవాడిగా ఉండేవాడని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment