Andhra Pradesh: చెప్పినవే కాదు... చెప్పనివీ చేశాం | CM Jagan implementing 40 more welfare schemes for people | Sakshi
Sakshi News home page

Andhra Pradesh: చెప్పినవే కాదు... చెప్పనివీ చేశాం

Published Mon, Jun 7 2021 3:12 AM | Last Updated on Mon, Jun 7 2021 1:22 PM

CM Jagan implementing 40 more welfare schemes for people - Sakshi

సాక్షి, అమరావతి: ఎన్నికల తీరం దాటగానే తెప్ప తగలేసినట్లుగా ఏకంగా మేనిఫెస్టోలనే  మాయం చేసిన చరిత్ర కొందరిదైతే.. ప్రజాభీష్టాన్నే పరమావధిగా భావిస్తూ ఇవ్వని హామీలను కూడా నెరవేరుస్తున్న ఘనత సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుంది. అధికారం చేపట్టిన రెండేళ్లలోనే దాదాపుగా హామీలన్నీ అమలు చేయడంతోపాటు అదనంగా మరో 40 అంశాలను కూడా అమలు చేస్తూ ప్రోగ్రెస్‌ రిపోర్టుతో సవినయంగా ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్న ఖ్యాతి ఈ ప్రభుత్వానిదే.  

విశ్వసనీయతలో తేడా ఇదీ..
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభ్వుతం రెండేళ్లలోనే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 94.5 శాతం అమలు చేయడమే కాకుండా ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మేనిఫెస్టోలో చెప్పకపోయినప్పటికీ మరో 40 అంశాలను అదనంగా అమలు చేస్తూ మీరే మార్కులు వేయాలంటూ ప్రోగ్రెస్‌ రిపోర్టును ప్రజల ముందుకు ధైర్యంగా పంపించింది.

మేనిఫెస్టోను భగవద్గీతలా, బైబిల్‌లా, ఖురాన్‌లా భావిస్తూ అందులో చెప్పిన వాటితో పాటు చెప్పనివి కూడా రెండేళ్ల కాలంలో అమలు చేసింది. గత సర్కారుకు, ఈ ప్రభుత్వానికి మధ్య విశ్వసనీయతలో తేడా ఇదే. గతంలో టీడీపీ సర్కారు అధికారంలోకి వచ్చిన అనంతరం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలతో కూడిన మేనిఫెస్టోను పార్టీ వెబ్‌సైట్‌ నుంచి కనిపించకుండా మాయం చేసింది. ఇందుకు పూర్తి భిన్నంగా> వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఏం చెప్పాం..? రెండేళ్ల పాలనలో ఏం చేశాం? చెప్పని అంశాలు ఏవి అమలు చేశాం? అనే వివరాలతో కూడిన బుక్‌లెట్‌ను ప్రతి ఇంటికీ వలంటీర్ల ద్వారా పంపిణీ చేస్తోంది.

వైఎస్సార్‌ మినహా...
ఎన్నికల ముందు మేనిఫెస్టో ద్వారా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను గతంలో ఏ ప్రభుత్వాలూ  (వైఎస్సార్‌ మినహా) సక్రమంగా అమలు చేయలేదు. ముఖ్యమంత్రి జగన్‌ ప్రజల కష్టాలు, అవసరాలను దృష్టిలో పెట్టుకుని మేనిఫెస్టోలో లేనప్పటికీ అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుని పలు అంశాలను అమలు చేశారు. మేనిఫెస్టోలో లేదు కదా.. మనకెందుకులే అనే ధోరణితో కాకుండా ప్రజల అవసరాలు తీర్చడానికే ప్రాధాన్యం ఇచ్చారు. రైతులు, అవ్వా తాతలు, విద్యార్థులు, రోగులు, లెప్రసీ బాధితులు... ఇలా పలు వర్గాల అవసరాలను తీర్చడమే లక్ష్యంగా చెప్పకపోయినా సరే అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్‌కే దక్కుతుంది. 

మేనిఫెస్టోలో లేకున్నా అమలు చేస్తున్న వాటిల్లో కొన్ని..
► రైతు భరోసా డబ్బులను ఎనిమిది నెలలు ముందుగానే అది కూడా చెప్పిన దాని కన్నా మిన్నగా ముఖ్యమంత్రి జగన్‌ అందచేశారు. ప్రతి రైతు కుటుంబానికి ఏటా రూ.12,500 బదులుగా రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం అదనంగా అందుతోంది. నాలుగేళ్లలో 50 వేల రూపాయలకు బదులు ఐదేళ్లలో రూ.67,500 చొప్పున లబ్ధి చేకూరుస్తున్నారు.
► ఆంధ్రప్రదేశ్‌ దిశ బిల్లు – 2019 ద్వారా దేశ చరిత్రలోనే సరికొత్త అధ్యాయం మొదలైంది. 
మహిళలు, బాలికలపై లైంగిక దాడులు, వారి మర్యాదకు భంగం కలిగించేలా వ్యవహరిస్తే కేసులను నాన్చకుండా 14 రోజుల్లో విచారణ పూర్తి చేసి శిక్షపడేలా దిశ బిల్లుకు  రూపకల్పన చేశారు. జిల్లాల్లో దిశ పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేసి మహిళల భద్రతకు పెద్ద పీట వేశారు. 
► ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి విద్యార్ధులందరికీ స్కూళ్లు తెరిచేనాటికి జగనన్న విద్యా కానుక కింద కిట్‌ అందుతోంది. ఇందులో మూడు జతల యూనిఫారాల క్లాత్, నోట్‌బుక్స్, షూ, బ్యాగు, డిక్షనరీ, మొదలైనవి ఉంటాయి. ఇందుకు రూ.648 కోట్ల వ్యయం చేస్తూ 47 లక్షల మందికి ప్రయోజనం కలిగిస్తున్నారు. 
► రూ.2,497 కోట్లతో 10,778 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి గ్రామాల్లోనే రైతన్నలకు అన్ని సేవలు అందచేస్తున్నారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు వీటిల్లో విక్రయిస్తున్నారు. రైతు భరోసా కేంద్రాల్లోనే ధాన్యం కొనుగోళ్లు కూడా చేపట్టారు. విత్తనం దగ్గర నుంచి పంట విక్రయం వరకు రైతులకు చేదోడుగా ఆర్బీకేలు నిలుస్తున్నాయి.  
► పొలాల్లోనే పంటల కొనుగోళ్లు. 
► వ్యవసాయ మిషన్‌ ఏర్పాటు.
► నియోజకవర్గ స్థాయిలో రూ.50 కోట్ల వ్యయంతో 35 చోట్ల ఇంటిగ్రేటెడ్‌ ఆక్వా ల్యాబ్‌ల ఏర్పాటు.
► గతంలో గిట్టుబాటు ధర లేని మిరప, పసుపు, ఉల్లి, చిరు ధాన్యాలకు దేశంలో ఎక్కడా లేని విధంగా కనీస గిట్టుబాటు ధరలను ప్రకటించారు. 
► పులివెందులలో అరటి పరిశోధన కేంద్రం ఏర్పాటు.
► శనగ రైతులను ఆదుకునేందుకు రూ.300 కోట్లు విడుదల
► ఆయిల్‌ పామ్‌ రైతులకు మద్దతు ధర కల్పనకు రూ.80 కోట్లు కేటాయింపు. దీని ద్వారా 1.10 లక్షల మందికి లబ్ధి చేకూర్చారు.
► రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా రూ.110 కోట్లతో పొగాకు కొనుగోలు.
► రాష్ట్రంలోని 55,607 అంగన్‌వాడీ కేంద్రాలు వైఎస్సార్‌ ప్రీ ప్రైమరీ ఇంగ్లీషు మీడియం స్కూళ్లుగా మార్పు. చిన్నారుల కోసం ప్రీ ప్రైమరీ–1, ప్రీ ప్రైమరీ–2, ప్రీ ఫస్ట్‌ క్లాస్‌ తరగతులు, వినూత్న విధానంలో విద్యా బోధన. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం బోధన, వచ్చే విద్యా సంవత్సరం నుంచి సీబీఎస్‌ఈ సిలబస్‌ అమలు.
► 36.88 లక్షల మంది విద్యార్ధులకు బలవర్థకమైన, రుచికరమైన భోజనం కోసం జగనన్న గోరు ముద్ద కార్యక్రమానికి రూ.1,600 కోట్లు వ్యయం.
► ఆరోగ్యశ్రీ పరిధిలోకి క్యాన్సర్‌కు సంబంధించిన అన్ని రకాల వ్యాధులు. కరోనా, బ్లాక్‌ ఫంగస్‌కు పథకం పరిధిలో ఉచితంగా చికిత్స.
► కరోనా మహమ్మారి కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాధలైన పిల్లల జీవనోపాధి, చదువుల కోసం రూ.10 లక్షలు చొప్పున డిపాజిట్‌. ప్రతి నెలా దానిపై వచ్చే వడ్డీతో కనీస ఆర్ధిక అవసరాలు తీర్చేలా తక్షణమే చర్యలు.
► లెప్రసీ బాధితులకు రూ.3,000 చొప్పున పింఛన్‌. డయాలసిస్, తలసేమియా, హీమోఫీలియా, సికిల్‌సెల్, ఎనీమియా లాంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి రూ.10,000 చొప్పున పింఛన్‌. పక్షవాతం, తీవ్ర కండరాల క్షీణత వల్ల మంచానికే పరిమితమైన వారికి, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు నెలకు రూ.5,000 పెన్షన్‌.
► వైఎస్సార్‌ కంటి వెలుగు కార్యక్రమానికి రూ.112.85 కోట్లు వ్యయం. అవ్వాతాతలు, చిన్నారులకు ఉచితంగా కంటి పరీక్షలు, కళ్లద్దాలు. 
► ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో ఇప్పుడున్న 11 మెడికల్‌ కాలేజీలకు అదనంగా మరో 16 వైద్య కళాశాలలు కొత్తగా ఏర్పాటు. తద్వారా వైద్య రంగం బలోపేతం.
► 108, 104 అంబులెన్సులు కొత్తగా 1,180 కొనుగోలు. 108 (డైవర్‌) వేతనం రూ.13 వేల నుంచి రూ.28 వేలకు పెంపు. ఎమెర్జెన్సీ మెడికల్‌ టెక్నీషియన్‌ వేతనం రూ.15 వేల నుంచి రూ.30 వేలకు పెంపు. 104 వాహన ఫార్మాసిస్ట్, ల్యాబ్‌ టెక్నీషియన్ల వేతనం రూ.17,500 నుంచి రూ.28 వేలకు పెంపు. డ్రైవర్‌ వేతనం రూ.15 వేల నుంచి రూ.26 వేలకు పెంపు.
► ఎంఎస్‌ఎంఈలకు ప్రోత్సాహకంగా రూ.905 కోట్లు. ఫిక్స్‌డ్‌ ఎలక్ట్రిసిటీ చార్జీలు రూ.188 కోట్లు మాఫీ.
► స్పందన – ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రభుత్వంలో ఏ శాఖకు సంబంధించిన సమస్య గురించైనా ఆర్జీ పంపవచ్చు.
► అమ్మ ఒడి ఇంటర్‌ వరకూ వర్తింపు. 9 – 12 తరగతుల విద్యార్ధులకు సొమ్ము లేదా ల్యాప్‌టాప్‌ తీసుకునే వెసులుబాటు.
► రేషన్, ఆరోగ్యశ్రీ, విద్యాదీవెన.. ఇలా ప్రతి పథకానికి ఆదాయ పరిమితి భారీగా పెంపు. తద్వారా లక్షల మందికి ప్రయోజనం.
► బోధన ఆస్పత్రులు, ఏరియా ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగకేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లలో పారిశుద్ధ్య సిబ్బంది వేతనం రూ.16 వేలకు పెంపు
► డాక్టర్‌ వైఎస్సార్‌ టెలీ మెడిసిన్‌ ప్రారంభం. 14410 టోల్‌ ఫ్రీ నెంబర్‌కు మిస్డ్‌ కాల్‌ ఇస్తే ఫోన్‌లోనే వైద్య సేవలు, ఇంటి వద్దకే మందులు.
► మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య కార్మికుల వేతనం రూ.12,000 నుంచి రూ.18,000కి పెంపు.
► అవుట్‌ సోర్సింగ్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు
► 9,260 వాహనాలతో ఇంటికే రేషన్‌ బియ్యం సరఫరా
► రిజిస్ట్రేషన్‌ వ్యవస్థలో అవినీతి నిర్మూలనలో భాగంగా విప్లవాత్మక మార్పులు. డాక్యుమెంట్‌ రైటర్ల అవసరం లేకుండా క్రయవిక్రయదారులే అన్‌లైన్‌లో డాక్యుమెంట్లు రూపకల్పన చేసుకునేలా వెసులుబాటు.
► ప్రతి ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలతో 500 రకాల మందులు అందుబాటులోకి.
► రివర్స్‌ టెండరింగ్‌ విధానం ద్వారా సుమారు రూ.5,070.43 కోట్లు ఆదా. రూ.100 కోట్లు దాటిన ప్రతి పని జ్యుడీషియల్‌ ప్రివ్యూకు.
► నామినేటెడ్‌ పదవులు, పనుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు.
► వైద్య సేవల బలోపేతంలో భాగంగా వైఎస్సార్‌ విలేజ్, అర్బన్‌ హెల్త్‌ క్లినిక్స్‌.
► జీఎస్‌పీసీ (ఓఎన్‌జీసీ) తవ్వకాల కారణంగా జీవనోపాధి కోల్పోయిన 16,559 మంది మత్స్యకారులకు కేంద్రం నుంచి నిధులు రానప్పటికీ రూ.788.24 కోట్ల నష్ట పరిహారం చెల్లింపు.
► ప్రజా సమస్యలపై ఫిర్యాదుకు టోల్‌ ఫ్రీ నంబర్‌ 1902
► వ్యవసాయ అవసరాలపై టోల్‌ ఫ్రీ నంబర్‌  1907
► అనినీతి నిరోధించేందుకు టోల్‌ ఫ్రీ నంబర్‌  14400

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement