వరి రైతుకు వరం! | CM Jagan Meeting Over Paddy Collection In Amaravati | Sakshi
Sakshi News home page

వరి రైతుకు వరం!

Published Mon, Nov 1 2021 5:20 PM | Last Updated on Tue, Nov 2 2021 2:55 AM

CM Jagan Meeting Over Paddy Collection In Amaravati - Sakshi

సాక్షి, అమరావతి: రైతులు పండించిన పంటకు మంచి ధర లభించేలా ధాన్యం సేకరణ విధానాలను పటిష్టంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే) స్థాయిలో ఫామ్‌ గేట్‌ వద్దే ధాన్యం కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు. మోసాలు, అవినీతికి తావు లేకుండా పారదర్శక విధానంలో కొనుగోళ్లు జరగాలని ఆదేశించారు. రైతులకు మంచి ధర దక్కేలా ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల పాత్రను తొలగిస్తున్నామని చెప్పారు. రైతులకు మేలు చేసే కొత్త విధానాన్ని సవాల్‌గా తీసుకుని అన్ని రకాలుగా సిద్ధం కావాలని అధికారులకు సూచించారు. ధాన్యం సేకరణ, కొనుగోళ్లపై సీఎం జగన్‌ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో మంత్రుల బృందంతో కలిసి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. 

అవగాహన పెంచాలి
ఆర్బీకేల స్థాయిలోనే ధాన్యం సేకరణ కేంద్రాలుండాలని సీఎం జగన్‌ ఆదేశించారు. తప్పిదాలు, మోసాలు జరగకుండా, వేగంగా చెల్లింపులు జరిపేందుకు వీలుగా ఇ–క్రాప్‌ బుకింగ్, ఈ – కేవైసీ నమోదు చేయాలని సూచించారు. వ్యవసాయ సలహా మండళ్లు, వీఏఏలు, వలంటీర్ల ద్వారా రైతుల్లో అవగాహన పెంపొందించే కార్యక్రమాలు చేపట్టాలని, ఆధార్‌ నంబర్‌ ఆధారంగా రైతులకు చెల్లింపులు చేయాలని ఆదేశించారు. 

కరపత్రాలు, ఆర్బీకేల్లో బోర్డులు
ధాన్యం సేకరణపై అవగాహన కల్పించేందుకు ఆర్బీకేలు, వలంటీర్ల ద్వారా ప్రతి రైతు ఇంటికీ వెళ్లి కరపత్రాలను అందజేయాలని ముఖ్యమంత్రి జగన్‌ సూచించారు. ధాన్యం సేకరణ వివరాలతో కూడిన బోర్డులను ఆర్బీకేల్లో ప్రదర్శించాలని ఆదేశించారు. రైతులు మంచి ధర పొందడానికి వీలుగా తగిన సలహాలు, సూచనలతో కరపత్రాలను రూపొందించాలన్నారు. ఎలాంటి మినహాయింపులు లేకుండా రైతులకు పూర్తి స్థాయిలో కనీస మద్దతు ధర అందాలని స్పష్టం చేశారు.

మిల్లర్ల పాత్ర తొలగింపు
ధాన్యం కొనుగోళ్లలో మోసాలను నివారించే చర్యల్లో భాగంగా మిల్లర్ల పాత్రను పూర్తిగా తొలగించామని ముఖ్యమంత్రి జగన్‌ స్పష్టం చేశారు. రైతుల ముంగిటే ఆర్బీకేల స్థాయిలోనే ధాన్యం సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ధాన్యం సేకరణలో అవకతవకలకు ఏమాత్రం ఆస్కారం ఉండకూడదని, నాణ్యతను నిర్ధారించే ప్రక్రియ అత్యంత పారదర్శకంగా ఉండేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.   

సేకరణ అంచనా 50 లక్షల మెట్రిక్‌ టన్నులు 
ఖరీఫ్‌లో వరి సాగు, దిగుబడుల అంచనా వివరాలను అధికారులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌కు అందజేశారు. 15.66 లక్షల హెక్టార్లలో వరి సాగు చేపట్టగా దాదాపు 87 లక్షల మెట్రిక్‌ టన్నులకుపైగా దిగుబడి రావచ్చని అంచనా వేసినట్లు తెలిపారు. ఇందులో దాదాపు 50 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించాల్సి ఉంటుందని అంచనా వేసినట్లు చెప్పారు. 6,884 ఆర్బీకేల పరిధిలో వరి సాగు చేపట్టినట్లు వెల్లడించారు. 

సమీక్షలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, గృహ నిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌శర్మ, వ్యవసాయశాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, అగ్రి మార్కెటింగ్‌ ముఖ్య కార్యదర్శి వై.మధుసూదన్‌రెడ్డి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్, పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ గిరిజాశంకర్,  మార్కెటింగ్‌ స్పెషల్‌ కమిషనర్‌ పీఎస్‌ ప్రద్యుమ్న, ఏపీఎస్‌సీఎస్‌సీఎల్‌ వీసీ అండ్‌ ఎండీ జి.వీరపాండ్యన్, వ్యవసాయశాఖ స్పెషల్‌ కమిషనర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement