ఫైల్ ఫోటో
సాక్షి, అమరావతి: చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రంలో ముమ్మరంగా రోడ్ల మరమ్మతులు, నిర్వహణ, పునరుద్ధరణ, విస్తరణ, కొత్త హైవే ప్రాజెక్టులను చేపడుతున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడించారు. 8 వేల కిలోమీటర్ల నిడివి ఉన్న రోడ్ల మెయింటెనెన్స్ పనులు రూ.2,500 కోట్లతో ముమ్మరంగా జరుగుతుండగా ఇప్పటికే రూ.800 కోట్ల బిల్లులు చెల్లించామన్నారు. ‘నిడా’ (నాబార్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ అసిస్టెన్స్) ద్వారా రూ.1,158 కోట్లు వెచ్చించి 720 కి.మీ. రహదారులను వెడల్పు చేస్తున్నామన్నారు. ఇప్పటికే రూ.700 కోట్లు బిల్లులు చెల్లించామని, జూన్ నాటికి ఈ పనులు పూర్తవుతాయని తెలిపారు. స్పందనలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ మంగళవారం దీనిపై సమీక్ష నిర్వహించారు. ఆ వివరాలివీ..
మే నెలలో పనులు ప్రారంభం
సుమారు రూ.6,400 కోట్లతో న్యూ డెవలప్‌మెంట్ బ్యాంకు సహాయంతో మండల కేంద్రాల నుంచి ఉమ్మడి జిల్లా కేంద్రాలకు రోడ్లు వెడల్పు చేస్తున్నాం. మే నెలలో ఈ పనులు ప్రారంభం అవుతాయి. రెండో విడత పనులు డిసెంబరులో మొదలవుతాయి. రూ.1,017 కోట్లతో సుమారు 5 వేల కిలోమీటర్ల పంచాయితీరాజ్ రోడ్ల పనులను వచ్చే నెలలో ప్రారంభిస్తాం. జాతీయ రహదారుల కింద 99 ప్రాజెక్టులకు సంబంధించి సుమారు 3,079 కిలోమీటర్ల మేర పనులు చేçపడుతున్నాం. దీనికోసం దాదాపు రూ.29,249 కోట్లు ఖర్చు చేస్తున్నాం. మరో 45 ప్రాజెక్టుల కింద సుమారు మరో 3 వేల కిలోమీటర్ల పనులు డీపీఆర్ దశ దాటాయి. ఇందుకు దాదాపు రూ.29 వేల కోట్లు వ్యయం కానుంది. ఇవికాకుండా ఇంటర్ స్టేట్ కనెక్టివిటీ కింద ఆరు ప్రాజెక్టులకుగానూ నాలుగు ప్రాజెక్టుల టెండర్లు పూర్తయ్యాయి. పనులు కూడా ప్రారంభం అవుతున్నాయి. బెంగళూరు నుంచి హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టు పనులు డిసెంబరులో ప్రారంభం అవుతాయి. జాతీయ రహదారులు, ఇంటర్ స్టేట్ కనెక్టివిటీ కోసం మొత్తం రూ.90 వేల కోట్ల విలువైన పనులను రాష్ట్రంలో చేపడుతున్నాం.
ఉపాధి అవకాశాలు విస్తృతం..
ఈ ప్రాజెక్టులు వేగంగా ముందుకు సాగాలంటే భూ సేకరణ సకాలంలో పూర్తి కావాలి. దీనిపై కలెక్టర్లు దృష్టి పెట్టాలి. వీటివల్ల ఉపాధి మెరుగుపడుతుంది. పన్నుల రూపంలో ఆదాయం వస్తుంది. భూ సేకరణలో ఎలాంటి జాప్యం ఉండకూడదు. దీనికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి.
ఇంత డబ్బు ఇదే తొలిసారి..
పనులు పూర్తి చేసిన రోడ్లను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి కలెక్టర్లు పరిశీలించాలి. దీనివల్ల నాణ్యతపై పర్యవేక్షణ ఉంటుంది. చరిత్రలో ఇంత డబ్బు ఎప్పుడూ రోడ్ల కోసం ఖర్చు చేయలేదు. మరమ్మతులు, విస్తరణ, కనెక్టివిటీ... ఇలా పలు రూపాల్లో జరుగుతున్న పనులను ప్రజలకు తెలియచేయాలి.
విద్య, ఆరోగ్యంపై రూ.32 వేల కోట్ల వ్యయం
నాడు – నేడు పనుల కోసం భారీగా ఖర్చు చేస్తున్నాం. ఆరోగ్య రంగంపై దాదాపు రూ.16 వేల కోట్లు, విద్యారంగంలో మరో రూ.16 వేల కోట్లు వెచ్చిస్తున్నాం. నాడు –నేడు పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి. మొత్తం 1,125 పీహెచ్‌సీల్లో 977 చోట్ల నాడు– నేడు కింద పనులు చేపట్టగా 628 ఆస్పత్రుల్లో పూర్తయ్యాయి. మిగిలిన చోట్ల వేగవంతం చేయాలి. మరో 148 చోట్ల కొత్తవాటి నిర్మాణం చేపడుతున్నాం. 168 సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రుల్లో కూడా పనులను వేగవంతం చేయాలి. మే 15 కల్లా అన్ని కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణాలు ప్రారంభం కావాలి. వచ్చే సమీక్ష నాటికి అన్ని బోధనాసుపత్రుల పనులు ప్రారంభం కావాలి. లేదంటే కలెక్టర్లు బాధ్యత వహించాల్సి ఉంటుంది.
26,451 స్కూళ్లలో నాడు–నేడు రెండో దశ
నాడు–నేడు రెండో దశ పనులను 26,451 స్కూళ్లలో చేపడుతున్నాం. దాదాపు రూ.8 వేల కోట్లకుపైగా నిధులను వెచ్చిస్తున్నాం. మే 2 నుంచి ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల్లో పర్యటించి నాడు– నేడు పనులు పూర్తైన దాదాపు 15 వేల స్కూళ్లను ప్రారంభిస్తారు. దీంతోపాటు రెండో దశ పనులను ప్రారంభిస్తారు. ఇందులో కలెక్టర్లు పాలుపంచుకోవాలి. పనులను చేపట్టే స్కూలు కమిటీలకు తోడుగా నిలవాలి. కొత్తగా 28 వేల తరగతి గదులను కూడా నిర్మిస్తాం. ఆస్పత్రులైనా, స్కూళ్‌లైనా నిర్వహణ బాగుండాలి. దీనిపై ప్రోటోకాల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
ఈ సమీక్షలో ఉపముఖ్యమంత్రి (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ) బూడి ముత్యాలనాయుడు, సీఎస్ సమీర్ శర్మ, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి, సీఎం ముఖ్యసలహాదారు అజేయ కల్లం, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ జి.సాయిప్రసాద్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ సీఎస్ వై.శ్రీలక్ష్మి, గృహ నిర్మాణశాఖ స్పెషల్ సీఎస్ అజయ్‌జైన్, విద్యాశాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment