గొడుగు వద్దంటూ తన భద్రత సిబ్బందిని వారిస్తున్న సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి/సాక్షి, అమరావతి బ్యూరో: 74వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో శనివారం ఘనంగా నిర్వహించింది. వర్షం కురుస్తున్నా ముందుగా నిర్ణయించిన సమయానికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సభాస్థలికి చేరుకున్నారు. ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ జెండాను ఎగురవేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాయుధ దళాల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించే సమయంలో వర్షం కురుస్తున్నా కూడా గొడుగు వినియోగించలేదు. టాప్ లేని వాహనంలోనే సీఎం గ్రౌండ్ మొత్తం తిరిగారు.
వివిధ బెటాలియన్‌లకు చెందిన బృందం వర్షంలో తడుస్తుంటే.. తాను టాప్ ఉన్న వాహనంలో వెళ్లడానికి సీఎం సున్నితంగా తిరస్కరించారు. దీంతో వివిధ బెటాలియన్‌లకు చెందిన పోలీసుల బృందంతోపాటే ఆయన కూడా వర్షంలో తడిచిపోయారు. అలాగే, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కార్యక్రమాలపై వివిధ ప్రభుత్వ విభాగాలు రూపొందించిన శకటాల ప్రదర్శనను సీఎం తిలకించారు. వేడుకలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాతృమూర్తి వైఎస్ విజయమ్మ, సతీమణి వైఎస్ భారతీరెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ షరీఫ్ అహ్మద్, శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment