మార్పు దిశగా అడుగులు | CM YS Jagan Comments On Welfare Schemes Implementation By Govt | Sakshi
Sakshi News home page

మార్పు దిశగా అడుగులు

Published Sun, Aug 16 2020 3:25 AM | Last Updated on Sun, Aug 16 2020 11:17 AM

CM YS Jagan Comments On Welfare Schemes Implementation By Govt - Sakshi

సాక్షి, అమరావతి:  దేశానికి స్వాతంత్య్రం వచ్చి 74వ ఏడాదిలోకి అడుగుపెడుతున్నా రాజ్యాంగంలోని ముందుమాటలో చెప్పుకున్న స్ఫూర్తి ఇప్పటికీ అమలు కావడం లేదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ, సామాజిక, ఆర్థిక న్యాయం అందరికీ సమానంగా అందాలని రాజ్యాంగంలోని ప్రియాంబుల్‌లో రాసుకున్న తొలిపలుకులనే అమలుచేయలేని దుస్థితి కనిపిస్తోందన్నారు. ఈ పరిస్థితిని మార్చడానికే, మార్పు దిశగా అడుగులు వేస్తున్నామని, గత 14 నెలల్లో తీసుకున్న ప్రతి నిర్ణయం, చేపట్టిన ప్రతి పథకం ఇందుకు నిదర్శనమని సీఎం తెలిపారు. అంటరానితనం ఇపుడు రూపు మార్చుకుందని, పేదలకు ఇంగ్లిష్‌ మీడియం అవసరం లేదన్న వాదనలు అందులో భాగమేనని ఆయన వ్యాఖ్యానించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. 

స్వాతంత్య్ర సమరయోధులకు పాదాభివందనం. స్వాతంత్య్రం ప్రాణవాయువు లాంటిదని గాంధీజీ చెప్పారు. రాజ్యాంగం, చట్టం, ప్రజాస్వామ్యం ప్రకారం వ్యవస్థలను నడిపిస్తేనే ఏ మనిషికైనా రక్షణ ఉంటుంది. ఏ సమాజానికైనా అభివృద్ధి అందుతుంది. దేశ ప్రజలందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాలను సమానంగా అందిస్తామని, అవకాశాల్లో, హోదాల్లో ప్రజలందరి మధ్య సమానత్వం పెంపొందిస్తామని రాజ్యాంగంలోని తొలి పలుకులుగా నిర్దేశించుకున్నాం. దీన్ని దృష్టిలో పెట్టుకునే సమాజంలో 62 శాతం ఉన్న రైతాంగానికి, 50 శాతం ఉన్న అక్క చెల్లెమ్మలకు  అండగా నిలిస్తే, వారి జీవితాల్లో మంచి మార్పులు వస్తాయని నమ్మాం. అందుకే రైతు భరోసా, చేయూత, అమ్మ ఒడి, ఆసరా వంటి పథకాలు అమలు చేస్తున్నాం. ఇబ్బందికర ఆర్థిక పరిస్థితులను తట్టుకుంటూ పార్టీలు, కులాలు, మతాలు చూడ కుండా శాచ్యురేషన్‌ ప్రాతిపదికన అందిస్తున్నాం. 

ఇదీ గ్రామ స్వరాజ్యమంటే..
ఆదేశిక సూత్రాల్లో పేర్కొన్న గ్రామ స్వరాజ్యాన్ని దేశంలోనే తొలిసారిగా అమలు చేసి చూపించాం. గ్రామ సచివాలయాల వ్యవస్థ ద్వారా.. పరిపాలన వికేంద్రీకరణలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిం చాం. ఏకంగా లక్షా నలభై వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. ఆ ఉద్యోగాల్లో 82.5 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఇచ్చాం. ప్రభుత్వం తరపున సంక్షేమం అందించడానికి ప్రతి 50 కుటుంబాలకు ఒకరు చొప్పున వలంటీర్లను ఏర్పాటు చేశాం. 2 లక్షల 70 వేల వలంటీర్లతో దేశంలోనే అత్యున్నతమైన డెలివరీ మెకానిజమ్‌ ఏర్పాటు చేశాం. ప్రభుత్వ పథకాల కోసం లంచాలు ఇచ్చుకుని, చెప్పులు అరిగేలా తిరిగే పరిస్థితిని మార్చి, పథకాలే ఇంటికి వచ్చి తలుపుతట్టి అందించే పరిస్థితిలోకి తెచ్చాం.  ఒకటో తేదీన సూర్యోదయానికి ముందే ఇంటి వద్దే పింఛన్లు అందుకుంటున్న ఆ అవ్వాతాతల మొహాల్లో ఆనందమే మన ప్రభుత్వానికి కొండంత ఆస్తి. అదే తృప్తి. ఈ వ్యవస్థకు మెరుగులు దిద్దుతూ రాష్ట్ర వ్యాప్తంగా నాణ్యమైన, తినగలిగే బియ్యాన్ని డిసెంబరు నుంచి డోర్‌ డెలివరీ చేయనున్నాం.

సామాజిక న్యాయానికి ఎంతగా కట్టుబడ్డామంటే..
సామాజిక న్యాయానికి అర్ధం చెబుతూ మన క్యాబినెట్‌లోనే దాదాపుగా 60 శాతం ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలకు కేటాయించాం. ఐదుగురు డిప్యూటీ సీఎంలలో నలుగురు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు. రాజ్యసభ, ఎమ్మెల్సీ సీట్లు,,  ఏది తీసుకున్నా ఇదే కనిపిస్తుంది. నామినేటెడ్‌ పదవులు, నామినేషన్‌ పద్ధతిలో ఇచ్చే పనుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఇస్తున్నాం. అందులోనూ 50 శాతం మహిళలకు ఇస్తున్నాం. బీసీల కోసం శాశ్వత కమిషన్‌ ఏర్పాటు చేస్తూ చట్టం చేశాం. ఎస్సీ, ఎస్టీలకు విడివిడిగా కమిషన్లు.. మాల, మాదిగ, రెల్లి కులాలకు విడివిడిగా కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం. బీసీలకు ఇచ్చిన మాట ప్రకారం విడి విడిగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి త్వరలో నియామకాలు పూర్తి చేయబోతున్నాం. ప్రభుత్వంలో ఔట్‌ సోర్సింగ్‌ సేవలను పూర్తిగా ప్రక్షాళన చేశాం. ఏజెన్సీల అక్రమాలకు చెక్‌ పెడుతూ ఔట్‌ సోర్సింగ్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేశాం.  

రూపం మార్చుకున్న అంటరానితనం 
ఆర్టికల్‌ 17 ప్రకారం అంటరానితనం నేరం. అయినా విద్యాపరంగా అంటరానితనం పాటించాల్సిందే అన్నట్లుగా కొందరి వాదనలు ఉంటున్నాయి. మా పిల్లలు, మా మనవళ్లు మాత్రమే ఇంగ్లిష్‌ మీడియంలో చదవాలి. పేద పిల్లలు మాత్రం ఇంగ్లిష్‌ మీడియంలో చదవడానికి వీల్లేదు అన్న వాదనలు చూస్తే రూపం మార్చుకున్న అంటరానితనం బాహాటంగా కనిపిస్తోంది. ఇది ధర్మమేనా అని మనమంతా ప్రశ్నించుకోవాలి. దేశంలో నిరక్షరాస్యత 27 శాతంగా ఉంటే, మన రాష్ట్రంలో అది ఏకంగా 33 శాతంగా ఉంది. ఎస్సీలలో ఇది 36 శాతం, ఎస్టీలలో 51.2 శాతం నిరక్షరాస్యత ఉంది. ఇప్పటికీ దాదాపు 33 శాతం పేదలకు చదువుకునే అవకాశం లేదంటే.. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉండే ఇంగ్లిష్‌ మీడియం చదువులు వీరెవరికీ అందడం లేదంటే రాజ్యాంగంలోని ప్రియాంబుల్‌లో, ప్రాథమిక హక్కుల్లో, ఆదేశిక సూత్రాల్లో చెప్పినవన్నీ ఎవరి కోసం అనే సందేహం కలుగుతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement