AP CM Jagan To Release Jagananna Videsi Vidya Deevena Funds To The Beneficiaries - Sakshi
Sakshi News home page

నేడు జగనన్న విదేశీ విద్యా దీవెన అమలు

Published Thu, Jul 27 2023 4:31 AM | Last Updated on Thu, Jul 27 2023 10:28 AM

CM Jagan To Release Jagananna Videsi Vidya Deevena Funds - Sakshi

సాక్షి, అమరావతి: పేద విద్యార్థులు సైతం ప్రపంచంలోని అగ్రశ్రేణి యూనివర్సిటీల్లో ఉన్నత విద్య అభ్య­సించేలా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం నిధులు లబ్ధిదారుల ఖాతాల్లో జమ కానున్నాయి. సీఎం జగన్‌ గురువారం తన క్యాంపు కార్యాలయం నుంచి బటన్‌ నొక్కి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు రూ.1.25 కోట్ల వరకు, ఇత­రులకు రూ. కోటి వరకు 100% ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అం­దుతుంది. ఈ విడతలో అర్హులైన 357 మంది విద్యార్థులు రూ.45.53 కోట్లు అందుకోనున్నారు.

గత చంద్రబాబు ప్రభుత్వంలో..
గత చంద్రబాబు ప్రభుత్వంలో విదేశాలకు వెళ్లి చదువుకొనే విద్యార్థులకు చేసిన ఆర్థిక సాయం అరకొరే. ఎస్సీ, ఎస్టీలకు కేవలం రూ.15 లక్షలు, ఇతరులకు రూ. 10 లక్షలు మాత్రమే ఇచ్చారు. కుటుంబ వార్షిక ఆదాయ పరిమితి రూ. 6 లక్షలుగా నిర్ణయించడంతో కొద్ది మందికే ప్రయోజనం కలి­గింది. లబ్ధిదారుల ఎంపికలోనూ అవినీతి, సిఫా­ర్సు­లకే పెద్దపీట వేశారు.

ఈ కాస్త ఫీజునూ చెల్లించ­కుండా చంద్రబాబు ప్రభుత్వం విద్యార్థులకు ఎగనా­మం పెట్టింది. 2016 – 17 సంవత్సరం నుండి 3,326 విద్యార్థులకు రూ.318 కోట్ల ఫీజులు ఎగ్గొట్టి, ఆ తర్వాత పథకాన్నే ఎత్తివేసింది. ప్రమా­ణాలు లేని, పేలవమైన ర్యాంకులున్న సంస్థలను ఎంపిక చేయడంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందని దుస్థితి నెలకొంది. 

వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో..
సీఎం వైఎస్‌ జగన్‌ సంతృప్త స్థాయిలో అర్హులైన విద్యార్థులందరికీ పూర్తి ఫీజులు అందేలా ‘జగనన్న విదేశీ విద్యా దీవెన’ పథకాన్ని తీర్చిదిద్దారు. ప్రతి ఏడాది 2 సీజన్లలో విదేశీ విశ్వవిద్యాలయాల్లో అడ్మిషన్లు పొందిన వారికి లబ్ధి చేకూరుస్తున్నారు. సంబంధిత శాఖల ప్రిన్సిపల్‌ సెక్రటరీల నేతృత్వంలోని రాష్ట్ర స్థాయి ఎంపిక కమిటీ ద్వారా పూర్తి పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు. ఎక్కడా అవినీతికి తావు లేకుండా నగదును నేరుగా లబ్ధిదారులైన విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు.

నాణ్యమైన విద్యకు పట్టం కడుతూ క్యూఎస్‌ వరల్డ్‌ యూనివర్సిటీ ర్యాంకింగ్, టైమ్స్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ర్యాంకింగ్స్‌ ప్రకారం ఎంపిక చేసిన 21 కోర్సుల్లో టాప్‌  50 యూనివర్శిటీలకు ఎంపికైన విద్యార్థులకు ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నారు. విద్యార్థులు కోర్సు పూర్తి చేసుకునేలా వారి చదువులు ఒక్కో మెట్టూ ఎక్కేకొద్దీ 4 వాయిదాల్లో స్కాలర్‌షిప్స్‌ మంజూరు చేస్తున్నారు.

ఇమ్మిగ్రేషన్‌ కార్డు (ఐ–94) పొందాక తొలి వాయిదా, మొదటి సెమిస్టర్‌ ఫలితాల తర్వాత 2వ వాయిదా, 2వ సెమిస్టర్‌ ఫలితాల తర్వాత 3వ వాయిదా,  4వ సెమిస్టర్‌ విజయవంతంగా పూర్తి చేసి మార్క్‌ షీట్‌ ఆన్‌లైన్‌ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేశాక చివరి వాయిదా చెల్లిస్తున్నారు. కుటుంబ వార్షిక ఆదాయ పరిమితిని రూ. 8 లక్షలకు పెంచడం ద్వారా ఎక్కువ మందికి ప్రయోజనం చేకూరుస్తున్నారు. ఈ పథకం పూర్తి వివరాలను https://jnanabhumi.ap.gov.in  వెబ్‌సైట్‌లో ఉంచారు. పథకానికి సంబంధించి సహాయం, ఫిర్యాదుల కోసం ‘జగనన్నకు చెబుదాం (1902 టోల్‌ ఫ్రీ నంబర్‌)’లోనూ సంప్రదించవచ్చు. 

ఇదీ పథకం
క్యూఎస్‌ వరల్డ్‌ యూనివర్సిటీ ర్యాంకింగ్స్, టైమ్స్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ర్యాంకింగ్స్‌ ప్రకారం ఇంజనీరింగ్, మెడిసిన్, లా, జర్నలిజం తదితర 21 ఫ్యాకల్టీల్లో టాప్‌ 50 ర్యాంకుల్లోని విదేశీ కళాశాలల్లో ప్రవేశం పొందిన విద్యార్థులు ఈ పథకానికి అర్హులు. దీని ద్వారా ప్రపంచంలోని 320కి పైగా ఉత్తమ కళాశాలల్లో ఉచితంగా చదువుకొనేందుకు మన రాష్ట్ర విద్యార్థులకు అవకాశం కలుగుతుంది. గడచిన 6 నెలల్లో ‘జగనన్న విదేశీ విద్యా దీవెన‘ కింద అందించిన ఆర్థిక సాయం రూ.65.48 కోట్లు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement