30,06,673 ఇళ్ల స్థలాల పట్టాలకు గాను ఇప్పటి వరకు 26,21,049 పట్టాల పంపిణీ పూర్తి చేశారు. అంటే 87.17 శాతం పట్టాల పంపిణీ పూర్తి అయింది. ప్రత్యేకంగా వైఎస్సార్ జగనన్న కాలనీల్లో ఏకంగా 90.28 శాతం పట్టాల పంపిణీ పూర్తయింది. మిగిలిన వాటిని రెండు మూడు రోజుల్లో పంపిణీ చేయాలి.
సాక్షి, అమరావతి: ఇళ్ల స్థలాల పట్టాల కేటాయింపు, పంపిణీ అన్నది నిరంతర కార్యక్రమం అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. దీనిని నిరంతరం పర్యవేక్షించాలని చెప్పారు. ఇంటి స్థలం పట్టా కోసం దరఖాస్తు అందుకున్న రెండు మూడు వారాల్లో భౌతిక తనిఖీ, అర్హతల పరిశీలన, సోషల్ ఆడిట్ ప్రక్రియనంతా పూర్తి చేయాల్సిన బాధ్యత వలంటీర్, గ్రామ సచివాలయ సిబ్బందిదేనని స్పష్టం చేశారు. దరఖాస్తు చేసిన వారు అర్హులని తేలితే కచ్చితంగా 90 రోజుల్లో ఇంటి స్థలం పట్టా ఇవ్వాల్సిందేనని ఆదేశించారు. పేదలందరికీ ఇళ్ల స్థలాల పంపిణీ పురోగతితో పాటు వైఎస్సార్ జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు తీసుకుంటున్న చర్యలపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సామాజిక తనిఖీల ద్వారా లబ్ధిదారులను గుర్తించాలన్నారు. నిర్మాణాల్లో ఏక రూపత, నాణ్యత కోసం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వైఎస్సార్ జగనన్న కాలనీల్లో కల్పిస్తున్న సదుపాయాలు, వాటి నిర్మాణ రీతులు తదితర అంశాలపై పూర్తి వివరాలను ఆయా కాలనీల వారీగా వేర్వేరుగా నివేదించాలని చెప్పారు. వైఎస్సార్ జగనన్న కాలనీల్లో ఇంటర్నెట్ సదుపాయం కూడా కల్పించాలని, ఇందుకోసం తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. డంపింగ్ యార్డుల్లో బయో మైనింగ్ చేయాలని, వీలైనంత త్వరగా ఈ ప్రక్రియను మొదలు పెట్టాలని ఆయన సూచించారు.
ఇళ్ల పట్టాల పంపిణీపై జరిగిన సమీక్షలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్
మౌలిక సదుపాయాలపై డీపీఆర్
► వైఎస్సార్ జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు తీసుకుంటున్న చర్యలను అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. మార్చి 31 నాటికి ఈ కాలనీల్లో కల్పించే మౌలిక సదుపాయాలకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సిద్ధం చేస్తామని తెలిపారు.
► వివిధ ప్రభుత్వ శాఖలు ఇందులో భాగస్వాములవుతాయని చెప్పారు. కాలనీల్లో జనాభాను అనుసరించి అంగన్‌వాడీ కేంద్రాలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, స్కూళ్లు, బస్టాపులు తదితర నిర్మాణాలపై అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని అధికారులు వెల్లడించారు.
► ఈ సమీక్షలో గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ నీరబ్‌కుమార్ ప్రసాద్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి వై. శ్రీలక్ష్మి, గృహ నిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ఉషారాణి, ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు నీలం సాహ్ని, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment