జి. పెదపూడిలంకలో వరద బాధితుల గోడు వింటున్న సీఎం వైఎస్ జగన్
కోనసీమ నుంచి సాక్షి ప్రతినిధి: కోనసీమ లంక గ్రామాల్లో పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్వయంగా బాధితులను కలుసుకుని భరోసా కల్పించారు. వారి ఇబ్బందులను సావధానంగా ఆలకించారు. కొన్ని సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారాన్ని చూపారు. షెడ్యూల్ ప్రకారం సీఎం మంగళవారం ఉ.10.30 గంటలకు పి.గన్నవరం మండలం జి.పెదపూడి చేరుకున్నారు. అక్కడ నుంచి వశిష్ట నదిపై పంటు దాటి జి.పెదపూడి లంక వెళ్లారు. ప్రతి బాధితుడికి తన గోడు చెప్పుకునే అవకాశాన్నిచ్చారు. మీకు సాయం అందిందా? లేదా? అని స్వయంగా అడిగి తెలుసుకున్నారు.
రైతులను చూడగానే ట్రాక్టర్ దిగి..
సీఎం పర్యటన సందర్భంగా జి.పెదపూడిలంకకు ట్రాక్టర్‌పై వెళుతుండగా దారిలో ఉద్యానవన రైతులు పొలాల్లో కుళ్లిపోయిన అరటి, వంగ, మిరప, దొండ, మునగ పంటలతో కనిపించారు. రైతులను చూడగానే ట్రాక్టర్ ఆపాలని ఆదేశించి సీఎం జగన్ కిందకు దిగారు. భద్రతా సిబ్బంది వారిస్తున్నా రైతుల మధ్యకు వెళ్లి వారు చెప్పింది విన్నారు.
అధైర్యపడొద్దు..
‘గోదావరికి ఆగస్టు 15 తరువాత వరదలు వస్తాయి. ఈసారి నెల రోజులు ముందే రావడంతో చేతికి వచ్చిన పంట కోల్పోయాం’ అని జి.పెదపూడి లంకకు చెందిన రైతులు వారా వెంకట్రావు, చీకురమల్లి సంతోషరావు, పల్లి సత్యనారాయణ, అడ్డాల నరసన్న, దొడ్డా శ్రీనివాస్, కటికిరెడ్డి నాగరాజు సీఎం ఎదుట తమ ఆవేదన వ్యక్తం చేశారు. ‘మూడు ఎకరాల్లో మిర్చి సాగుకు రూ.రెండు లక్షలు పెట్టుబడి పెట్టా. కేవలం రూ.36 వేలు మాత్రమే వచ్చింది.
మిగిలిందంతా వరదలో కొట్టుకుపోయింది’ అని కంటతడి పెట్టిన రైతు పల్లి సత్యనారాయణను సీఎం జగన్ ఓదార్చారు. అక్కడే ఉన్న ఉద్యానశాఖ, వ్యవసాయ అధికారులను పంట నష్టంపై ఆరా తీశారు. ‘రైతులు పంట నష్టపోతే ఆదుకోవడంలో మన ప్రభుత్వ స్పందన వేరు. ఏ సీజన్‌లో నష్టపోతున్నారో అదే సీజన్ ముగిసేలోగా పెట్టుబడి రాయితీఅందజేస్తున్నాం. అధైర్యపడొద్దు. అధికారులు నష్టం అంచనాలు రూపొందిస్తారు. నివేదిక అందాక పెట్టుబడి రాయితీ మీ ఖాతాలకు జమ అవుతుంది’ అని రైతులకు ధైర్యం చెప్పారు.
పంటుపై ప్రయాణిస్తూ గోదావరి ఉధృతిని పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి
వీధుల్లో కాలి నడకన..
జి.పెదపూడిలంకలో ట్రాక్టర్ దిగి రెండు వీధులు నడుచుకుంటూ బాధితుల ఇళ్ల వద్దకు వెళ్లి సీఎం జగన్ పరామర్శించారు. ప్రతి ఒక్కరితోనూ కలసిపోయారు. వరదల్లో వారు పడిన ఇబ్బందులను తెలుసుకున్నారు. ‘వరద వచ్చినప్పుడు మీ కలెక్టర్ వచ్చారా? అధికారులు వచ్చారా? సాయం అందించారా? పాలు ఇచ్చారా? బియ్యం పంపిణీ చేశారా? పప్పులు, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, ఆయిల్ ప్యాకెట్లు అందించారా? లేదా’ అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఇచ్చిన రూ.రెండు వేల సాయం అందిందా? లేదా? అని ఇంటింటికీ వెళ్లి అడిగారు.
ట్రాక్టర్‌పై ప్రయాణిస్తూ వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
అప్పటికప్పుడే ఆదేశాలు...
సీఎం జగన్ కాలి నడకన పర్యటిస్తున్న సమయంలో అనారోగ్యంతో ఉన్న తన భర్త మాతా సత్యనారాయణను ఆదుకోవాలని ఓ మహిళ కోరడంతో నేరుగా ఆ ఇంటికి వెళ్లి పలకరించారు. వైద్యానికి సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. జీవనోపాధి కోల్పోయిన తమ కుటుంబాన్ని ఆదుకోవాలని మాతా జ్యోతి వేడుకోవడంతో ఆమెను వలంటీర్‌గా నియమించాలని సూచించారు. సీఎం పర్యటన పూర్తయ్యే లోపు ఆమెకు నియామక ఉత్తర్వులు అందడంతో కృతజ్ఞతలు తెలిపింది. పూరిల్లు వరద నీట మునిగిన బాధితుడు కాకర కృష్ణకు పక్కా ఇల్లు మంజూరు చేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు. సరెళ్ల సూర్యారావు అనే వృద్ధుడిని వరద సాయంపై సీఎం ఆరా తీయగా.. అన్నీ అందాయి, అందరూ బాగా పని చేశారని చెప్పారు.
ప్రతి ఒక్కరినీ పలుకరిస్తూ..
‘వరద కష్టాల్లో కూడా ఏ పూటా పస్తులు ఉండలేదు. ఏ లోటు రానివ్వకుండా మీ ప్రభుత్వం జాగ్రత్తగా చూసుకుంది. మనస్ఫూర్తిగా తిన్నాం. మాకు అన్నీ అందాయి. అధికారులు మావద్దకు వచ్చారు’ అని బాధితులు సీఎం జగన్‌కు తెలిపారు. ప్రతి ఇంటి వద్ద ఆగుతూ ప్రతి ఒక్కరి పేరు కనుక్కుని పలుకరిస్తూ సీఎం కదిలారు.
Comments
Please login to add a commentAdd a comment