సీఎం వైఎస్ జగన్‌ను కలిసి వినతిపత్రం అందజేస్తున్న దివ్యతేజస్విని కుటుంబసభ్యులు. చిత్రంలో హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత
సాక్షి, అమరావతి: విజయవాడలో ప్రేమోన్మాది చేతిలో హత్యకుగురైన బీటెక్ విద్యార్థిని దివ్య తేజస్విని కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. దివ్యతేజస్విని కుటుంబసభ్యులు మంగళవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ముఖ్య మంత్రి వారిని ఓదార్చారు.
చలించిపోయిన సీఎం
దివ్యతేజస్విని తల్లిదండ్రులను చూసి ముఖ్య మంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చలించి పోయారని, ఈ కేసు విషయంలో చట్ట ప్రకారం న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత చెప్పారు. వెంటనే వారి కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించాలని చెప్పారన్నారు. త్వరలోనే నిందితుడిని అరెస్ట్ చేస్తామని తెలిపారు. దివ్యతేజస్విని తల్లిదండ్రులు జోసెఫ్, కుసుమ, సోదరుడు దినేష్‌ను హోంమంత్రి మేకతోటి సుచరిత, వైఎస్సార్ సీపీ విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జ్ దేవినేని అవినాశ్ ముఖ్య మంత్రి వద్దకు తీసుకెళ్లారు. అనంతరం దివ్యతేజస్విని తల్లిదండ్రులతో కలిసి హోంమంత్రి సుచరిత సీఎం క్యాంపు కార్యాలయం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ఇకపై ఇటువంటి ఘటనలు జరగకుండా కఠినచర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారని చెప్పారు.
ప్రేమోన్మాది నాగేంద్రబాబు కోలు కోగానే అదుపులోకి తీసుకుని, విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. నాగేంద్రబాబు పూర్వ పరిచయాన్ని అడు ్డపెట్టుకుని దివ్యతేజస్వినిని వేధించాడన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న వేధింపులపై మహిళలు, యువతులు భయపడకుండా పోలీసులకు ఫిర్యాదు చేయాలని మంత్రి సూచించారు.
వైఎస్సార్ సీపీ విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జ్ దేవినేని అవినాష్ మాట్లాడుతూ దివ్యతేజస్విని కుటుంబసభ్యులు కోలుకునే వరకు పార్టీపరంగా కూడా అండగా ఉండాలని సీఎం జగన్ తమకు సూచించారని చెప్పారు. దివ్యతేజస్వినిని తల్లిదండ్రులు జోసెఫ్, కుసుమ, సోదరుడు దినేష్ మాట్లాడుతూ నాగేంద్రబాబుకు ఉరిశిక్ష పడేలా చూడాలని ముఖ్యమంత్రిని కోరినట్లు తెలిపారు. నిందితుడి పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment