నవరత్నాల పాలన మాది.. | CM YS Jagan Comments About Welfare Schemes Implementation In AP | Sakshi
Sakshi News home page

నవరత్నాల పాలన మాది..

Published Sun, Aug 16 2020 3:04 AM | Last Updated on Sun, Aug 16 2020 1:43 PM

CM YS Jagan Comments About Welfare Schemes Implementation In AP - Sakshi

సాక్షి, అమరావతి: ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్థానాల్లో 90 శాతం 14నెలల్లోనే అమలు చేయడమే కాక మేనిఫెస్టోలో లేని మరో 39 పథకాలను కూడా అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తెలిపారు. ఈ 14 నెలల కాలంలో రూ. రూ.59,000 కోట్లు నేరుగా ప్రజల ఖాతాల్లో జమ చేశామన్నారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా 14 నెలల పాలన గురించి సీఎం మాట్లాడుతూ ఏమన్నారంటే...    

మేనిఫెస్టోను.. ఒక భగవద్గీత, ఒక బైబిల్, ఒక ఖురాన్‌ మాదిరిగా భావించి అమలు చేస్తున్నాం. ఎన్నికల సమయంలో మేము ఇచ్చిన హామీలు 129. ఇందులో ఇప్పటికే 83 అమలు చేయగా మరో 30 పథకాలకు ప్రారంభోత్సవ తేదీలు ప్రకటించాం.  మిగిలిన 16 కూడా రాబోయే రోజుల్లో అమలు చేస్తాం. మేనిఫెస్టోలో లేకపోయినా ఈ ఏడాదిలో ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరో 39  పథకాలు అమలు చేస్తున్నాం. కులం, మతం, ప్రాంతం, వర్గం, పార్టీ భేదాలకు అతీతంగా మన ప్రభుత్వం  నవరత్నాల పాలన అందిస్తోంది.
వేడుకల్లో పాల్గొన్న సీఎం తల్లి వైఎస్‌ విజయమ్మ, సతీమణి భారతీరెడ్డి 

విద్యావిధానంలో భారీ మార్పులు..
పోటీ ప్రపంచంలో మన పిల్లలు నిలబడేలా విద్యా విధానంలో కరిక్యులమ్‌తో పాటు, పూర్తిగా మార్పులు చేర్పులు తీసుకువస్తున్నాం. నాడు–నేడు కార్యక్రమంలో పాఠశాల నుంచి కాలేజీల వరకు అన్నింటి రూపురేఖలు మారుస్తున్నాం. ఉన్నత విద్యలో 100 శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌తోపాటు, విద్యార్థుల లాడ్జింగ్, బోర్డింగ్‌ ఖర్చుల కోసం వసతి దీవెన అమలు చేస్తున్నాం. అన్నింటికి మించి ప్రాథమిక విద్యలో అమ్మ ఒడి ద్వారా ప్రతి ఇంటా చదువుల దీపాలు వెలిగించేందుకు దేశ చరిత్రలో ఏ ప్రభుత్వమూ చేయని భారీ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. పిల్లలకు పుస్తకాలు మొదలు షూస్‌ వరకు అన్నీ నాణ్యమైనవి ఉచితంగా ఇస్తున్నాం. ప్రతి రోజూ ప్రత్యేక మెనూతో గోరుముద్ద పథకాన్ని అమలు చేస్తున్నాం. కంటి వెలుగు కార్యక్రమం ద్వారా 100 శాతం విద్యార్థులకు పరీక్షలు జరిపి అవసరం ఉన్న ప్రతి ఒక్కరికి కళ్లజోళ్లు అందించే కార్యక్రమం దాదాపుగా పూర్తి చేశాం.

రైతు సంక్షేమం
రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్ముతున్నాం. రైతు భరోసా ద్వారా రూ.11,200 కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామ సచివాలయానికి అనుసంధానంగా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశాం. పండించిన పంటకు కనీస గిట్టుబాటు ధర లభించేలా చూడడంతో పాటు, నాణ్యత ధ్రువీకరించిన ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు.. ఇలా రైతులకు అవసరమైన అన్ని సేవలు ఒక్క చోటే లభించేలా చర్యలు తీసుకున్నాం. కౌలు రైతులకూ రైతు భరోసా వర్తింప చేశాం. కోవిడ్‌ లాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా దాదాపు రూ.3,200 కోట్లకు పైగా మొత్తంతో పంటలు కొనుగోలు చేసి రైతులకు అండగా నిల్చాం. గోదాములు, నాణ్యమైన ఉత్పత్తుల గ్రేడింగ్, వాటి మార్కెటింగ్‌ వంటి సదుపాయాలను గ్రామస్థాయి నుంచి మొదలు పెడుతున్నాం. మండల స్థాయిలో కోల్డ్‌ స్టోరేజీలు, అవసరమైన చోట్ల ఫుడ్‌ ప్రాసెసింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నాం.

ఆరోగ్యశ్రీని విస్తరించాం
వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టాం. ఆరోగ్యశ్రీ రక్షణను మరో 1,000కి పైగా జబ్బులకు పెంచి 2,200 జబ్బులను దాని పరిధిలోకి తీసుకువచ్చాం. రూ.5 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న ప్రతి కుటుంబానికి ఆరోగ్యశ్రీ వర్తింప చేశాం. రూ.1,000 కి మించిన ఖర్చును ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువచ్చాం.  దాదాపు 1,100 వాహనాలు కొని ఒకేసారి 108, 104 సేవల కోసం పంపించాం. దేశ చరిత్రలో కనీవిని ఎరగని విధంగా ఆపరేషన్‌ అయిన రోగులకు కోలుకునే సమయం వరకు నెలకు రూ.5 వేల వరకు ఆసరాగా, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు రూ.10 వేల వరకు పింఛనుగా అందిస్తున్నాం. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి 2019 వరకు మన రాష్ట్రంలో 11 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు ఉంటే.. ఈ 14 నెలలలోనే మరో 16 కాలేజీలు, నర్సింగ్‌ కాలేజీల నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నాం. నాడు–నేడు కార్యక్రమం ద్వారా ప్రాథమిక వైద్య కేంద్రం నుంచి జిల్లా ఆస్పత్రుల వరకు అన్నింటి రూపురేఖలు మారుస్తున్నాం. క్యాన్సర్‌ వంటి రోగాలకు పూర్తిగా ఉచిత వైద్యం అందిస్తున్నాం. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై నగరాల్లో కూడా ఆరోగ్యశ్రీ ద్వారా సూపర్‌ స్పెషాలిటీ సేవలు అందిస్తున్నాం. కోవిడ్‌ వంటి మహమ్మారిని కూడా.. దేవుడి దయతో, మీ అందరి దీవెనలతో సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాం.

అక్క చెల్లెమ్మలకు తోడుగా..
మహిళల ఆర్థిక స్వావలంబనకు తోడ్పడేలా 23 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు తోడుగా చేయూత కార్యక్రమాన్ని మూడు రోజుల క్రితం ప్రారంభించాం. అమ్మ ఒడి ద్వారా అక్షరాలా 43 లక్షల మంది తల్లులకు, 82 లక్షల మంది పిల్లలకు లబ్ధి చేకూర్చాం. విద్యాదీవెన మొత్తాన్ని అమ్మ పేరుతో బ్యాంకులో వేస్తున్నాం. వసతి దీవెన ద్వారా పిల్లల లాడ్జింగ్, బోర్డింగ్‌ ఖర్చులన్నింటినీ కూడా నేరుగా తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నాం. 91 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు మేలు చేసేలా సున్నా వడ్డీ డబ్బులు జమ చేశాం. అదే 91 లక్షలమంది అక్క చెల్లెమ్మలకు 2019 ఎన్నికల తేదీ వరకు ఉన్న పొదుపు సంఘాల రుణాలకు సమానమైన మొత్తాన్ని నాలుగు విడతల్లో వారి చేతికి ఇచ్చే ఆసరా కార్యక్రమాన్ని వచ్చే నెలలో అమలు చేస్తున్నాం.

మద్య నియంత్రణ
మద్యం మహమ్మారి అనేక కుటుంబాల్లో చిచ్చు పెడుతోందని గమనించి.. మద్య నియంత్రణ దిశగా అడుగులు వేశాం. అధికారంలోకి రాగానే 43 వేల బెల్టుషాపులు, 4,380 పర్మిట్‌ రూములు తొలగించి, అధికారిక దుకాణాల సంఖ్యను 33 శాతం తగ్గించాం. బెల్టు షాపులు అనేవి లేకుండా చేసేందుకు ప్రభుత్వ ఆధ్వర్యంలో మాత్రమే మద్యం విక్రయాలు జరుపుతూ మద్యం అమ్మే వేళలను కూడా కుదించాం. మద్యం ధరలను దాదాపు 100 శాతం పెంచి అమ్మకాలను భారీగా తగ్గించాం. 

అవినీతి లేని వ్యవస్థ 
అవినీతి లేని వ్యవస్థ కోసం రివర్స్‌ టెండరింగ్, జ్యూడిషియల్‌ ప్రివ్యూ, డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌ విధానాన్ని అమలు చేస్తున్నాం. వివిధ పథకాల ద్వారా దాదాపు రూ.59 వేల కోట్లు నేరుగా ప్రజలకు అందించాం. రివర్స్‌ టెండరింగ్, జ్యూడిషియల్‌ ప్రివ్యూ, గత ప్రభుత్వ నిర్ణయాలపై సమీక్ష ద్వారా దాదాపు రూ.4 వేల కోట్లకు పైగా ప్రభుత్వ సొమ్మును ఆదా చేశాం.

ఇది మహిళా పక్షపాత ప్రభుత్వం 
ఇది మహిళా పక్షపాత ప్రభుత్వం. దిశ బిల్లును ఆమోదించాం. దిశ పోలీసు స్టేషన్లు, దిశ యాప్‌ ద్వారా మహిళల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. నామినేటెడ్‌ పదవులు, నామినేషన్‌ విధానంలో ఇచ్చే పనుల్లో 50 శాతం అక్క చెల్లెమ్మలకు ఇస్తూ చట్టం తీసుకువచ్చాం. దేశ చరిత్రలో కనీవినీ ఎరగని విధంగా 30 లక్షల మంది అక్క చెల్లెమ్మల పేరిట ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్‌కు రంగం సిద్ధంగా ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement