మనసుతో చూడండి | CM YS Jagan Mohan Reddy Comments about those who do not have welfare schemes due to technical reasons | Sakshi
Sakshi News home page

మనసుతో చూడండి

Published Wed, Feb 12 2020 2:38 AM | Last Updated on Wed, Feb 12 2020 4:31 AM

CM YS Jagan Mohan Reddy Comments about those who do not have welfare schemes due to technical reasons - Sakshi

నేను గ్రామాల పర్యటనకు వెళ్లే సరికి ఇంటి పట్టా మాకు రాలేదన్న మాట ఏ ఒక్క అర్హుని నుంచి వినిపించకూడదు. ఈ విషయంలో కలెక్టర్లు మరింత చురుగ్గా పని చేయాలి. లక్షల మంది మనపై ఆశలు పెట్టుకున్నారు. వారి ఆశలను సాకారం చేయడం కోసం వచ్చే రెండు వారాలు అధికారులు ఇళ్ల స్థల పట్టాలకు సంబంధించిన అంశంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి.    

తల్లిదండ్రుల కమిటీల్లోని ముగ్గురు సభ్యులు ప్రతిరోజూ స్కూల్లో పరిస్థితులను పరిశీలించాలి. పిల్లలతో కలిసి మధ్యాహ్న భోజనం చేయాలి. ఆకస్మిక తనిఖీలు చేయించాలి. దీనిపై కలెక్టర్లు ఫోకస్‌ పెట్టాలి. మధ్యాహ్న భోజనానికి సంబంధించిన కొత్త మెనూ బాగా అమలవుతోంది. అందుకు అందరికీ అభినందనలు.

సచివాలయాల్లో మనం అందిస్తామన్న 541 సేవలు అనుకున్న సమయానికి అందుతున్నాయా? లేదా? చూసుకోవాలి. పక్కాగా పరిశీలిస్తుంటే లోపాలు తెలిసి పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. అందుకే కలెక్టర్లు గ్రామ, వార్డు సచివాలయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ప్రస్తుతం ఉన్న లోపాలను వచ్చే స్పందన నాటికి సరిదిద్దాలి. 
– సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: అర్హత ఉన్నప్పటికీ సాంకేతిక కారణాల వల్ల సంక్షేమ పథకాలు అందని వారి పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్బోధించారు. రైతు భరోసా, పింఛన్లు తదితర పథకాల కింద లబ్ధిదారుల జాబితాలో పేర్లుండి, పంపిణీ పెండింగ్‌లో ఉన్న వారికి తక్షణమే డబ్బు అందించాలని సూచించారు. స్పందన కార్యక్రమంపై మంగళవారం ఆయన సచివాలయం నుంచి ఉన్నతాధికారులు, కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. వివిధ పథకాల పురోగతిని సమీక్షించారు. ‘సంక్షేమ పథకాలు అందలేదంటూ కొన్ని వినతులు వచ్చాయి. సమయం ముగిసి పోవడం వల్లో, సాంకేతిక కారణాల వల్లో వారికి అంది ఉండకపోవచ్చు. ఇలాంటి వారి పట్ల మానవతా దృక్పథంతో  వ్యవహరించాలి.

రైతు భరోసా కింద ఇంకా పెండింగ్‌లో ఉన్న 21,750 మంది రైతులకు వెంటనే డబ్బు చెల్లించాలి. అమ్మఒడి కింద 42,33,098 మందికి డబ్బు చెల్లించగా, ఇంకా 11,445 మందికి పెండింగ్‌లో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. మానవతా దృక్పథంతో ఈ కేసులను క్లియర్‌ చేయండి. కలెక్టర్లు సానుకూల దృక్పథంతో ఉండాలి. మిగిలిన పథకాల్లో కూడా పెండింగ్‌లో ఉన్న వాటిని త్వరగా పరిష్కరించండి. అర్హత ఉన్నప్పటికీ నాకు పథకం అందలేదనే మాట ఎక్కడా వినిపించకూడదు’ అని సీఎం సూచించారు. క్యూఆర్‌ కోడ్‌తో కూడిన ఆరోగ్యశ్రీ కార్డులు ఇస్తున్నామని, అందువల్ల పంపిణీకి కొంత సమయం పడుతుందని చెప్పారు. మార్చి ఆఖరులోగా పంపిణీ పూర్తవుతుందన్నారు. ఈ సమీక్షలో సీఎం ఇంకా ఏమన్నారంటే..

6.14 లక్షల మందికి కొత్తగా పింఛన్లు  
‘కొత్తగా మనం 6,14,244 మందికి పింఛన్లు ఇచ్చాం. అర్హత ఉన్నా పెన్షన్‌ రాలేదన్న మాట ఎక్కడా వినిపించకూడదు. వెరిఫికేషన్‌ చేసి, అర్హత ఉందని తేలిన వారికి జనవరి నెల పింఛన్‌ కూడా ఫిబ్రవరి నెల మొత్తంతో పాటు ఇస్తాం. అర్హులు ఎవరు దరఖాస్తు చేసుకున్నా పరిశీలించి ఐదు రోజుల్లో పింఛన్‌ కార్డు ఇస్తాం. గ్రామ సచివాలయాల్లో ఇందుకు సంబంధించిన వివరాలు నోటీసు బోర్డుల్లో పెట్టాం. ఈ నెల 17వ తేదీ నాటికి కలెక్టర్లు రీ వెరిఫికేషన్‌ ప్రక్రియ పూర్తి చేయించి 18వ తేదీకల్లా అప్‌లోడ్‌ చేయించాలి. 19, 20 తేదీల్లో సోషల్‌ ఆడిట్‌ నిర్వహించి, 20న తుది జాబితా ప్రకటించాలి. మార్చి ఒకటో తేదీన కార్డుతోపాటు పెన్షన్‌ ఇవ్వాలి. బియ్యం కార్డుల విషయంలోనూ రీ వెరిఫికేషన్‌ పూర్తి చేయాలి. అర్హులెవరికీ బియ్యం కార్డు రాలేదనే మాట వినిపించకూడదు. ఈ నెల 18 నాటికి రీ వెరిఫికేషన్‌ పూర్తి కావాలి. ఒకవేళ ఎవరికైనా బియ్యం కార్డు రాకపోతే ఆందోళన చెందాల్సిన పనిలేదని చెప్పండి. దరఖాస్తు చేసుకున్న 5 రోజుల్లోగా పరిశీలించి అర్హులైతే కార్డు ఇస్తాం. 
స్పందన కార్యక్రమంపై జరిగిన సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

ఇళ్ల స్థలాలపై ప్రత్యేక దృష్టి
నివాస స్థల పట్టాలకు సంబంధించి కొన్ని అంశాలు నా దృష్టికి వచ్చాయి. స్పందన ద్వారా 2 లక్షల వినతులు వస్తే 1.30 లక్షల మందికి పట్టాలు మంజూరు చేశారు. కరెంటు బిల్లులు ఎక్కువగా రావడం వల్ల దాదాపు 40 వేల వినతులు పెండింగ్‌లో ఉన్నట్టు చూస్తున్నాం. పూరి గుడిసెలో ఉన్నవాళ్లకూ కరెంటు బిల్లు ఎక్కువగా వచ్చిందని ఆపేయడం సమంజసం కాదు. గ్రామ వలంటీర్‌ ద్వారా తనిఖీ చేయించి ఇళ్ల పట్టాలు పొందడానికి అర్హులని తేలితే, జాబితాలో చేర్పించి పట్టా ఇవ్వాలి. 25 లక్షల మంది పట్టాలు ఇవ్వాలన్న మంచి కార్యక్రమం దిశగా మనం అడుగులు వేస్తుంటే దీన్ని అడ్డుకోవాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు.

కేసులు పెట్టించి అడ్డుకోవాలని టెలికాన్ఫరెన్స్‌ల్లో వారి పార్టీ నాయకులను ఉసిగొల్పుతున్నారు. భూముల కొనుగోలు విషయంలో చురుగ్గా ముందుకు సాగాలి. అనుకున్నచోట భూములు దొరకని పక్షంలో ప్లాన్‌–బి కూడా కలెక్టర్లు సిద్ధం చేసుకోవాలి. నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంటి స్థలం లేని నిరుపేద రాష్ట్రంలో ఉండకూడదు. మన ముద్ర ఉండేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి. పట్టాల పంపిణీ సందర్భంగా ఉగాది పర్వదినం రోజు 25 లక్షల కుటుంబాల్లో పండుగ వాతావరణం ఉండాలి. వచ్చే ఏడాది నుంచి ఏడాదికి 6 లక్షల ఇళ్లు చొప్పున నిర్మించుకుంటూపోతాం. 

కంటి వెలుగును విజయంతం చేయాలి
కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని కంటి వెలుగును విజయంతం చేయాలి. నేత్ర పరీక్షల కోసం నియోజకవర్గాల వారీగా బృందాలను ఏర్పాటు చేయాలి. కంటి వెలుగు మూడోవిడత ‘అవ్వాతాత’ కార్యక్రమాన్ని ఈ నెల 18న కర్నూలులో ప్రారంభిస్తాం. ఇందులో నేను కూడా పాల్గొంటా. ఆస్పత్రుల్లో  నాడు – నేడు పనులకూ అదే రోజు శంకుస్థాపన చేస్తాం. 4,906 సబ్‌ సెంటర్లను నిర్మిస్తున్నాం. 4,472 సబ్‌ సెంటర్లకు స్థలాలు గుర్తించారు. మిగిలిన వాటికి వెంటనే స్థలాలు గుర్తించాలి. ఈ నెలాఖరుకల్లా పనుల ప్రారంభానికి వీలుగా ఏర్పాట్లు చేయాలి. 

24న జగనన్న వసతి దీవెన ప్రారంభం
జగనన్న వసతి దీవెన కార్యక్రమాన్ని ఈనెల 24న విజయనగరంలో ప్రారంభిస్తాం. ఉన్నత చదువులు చదువుతున్న వారికి ఇది అండగా నిలుస్తుంది. ఈ పథకం కింద సంవత్సరానికి రూ.20 వేలు రెండు విడతలుగా ఇస్తాం. దీని కింద 11,87,904 మందికి లబ్ధి చేకూరుతుంది. 53,720 ఐటీఐ చదువుతున్న వారికి రూ.5,000 చొప్పున రెండు విడతలుగా ఏడాదిలో రూ.10 వేలు ఇస్తాం. 86,896 మంది పాలిటెక్నిక్‌ చదువుతున్న వారికి రూ. 7,500 చొప్పున రెండు విడతల్లో రూ.15,000 ఇస్తాం. డిగ్రీ ఆపై చదువులు చదువుతున్న 10,47,288 మందికి రూ.10 వేల చొప్పున రెండు విడతల్లో ఏడాదికి రూ.20 వేలు ఇస్తాం.

ఈ పథకం కింద మొత్తం రూ.1,139 కోట్లు పిల్లల తల్లుల ఖాతాల్లో జమ చేస్తాం’ అని సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు. కాగా, నేత్ర శస్త్ర చికిత్స చేయించుకుంటే 25 రోజుల విశ్రాంతి అవసరం ఉన్న దృష్ట్యా తల్లిదండ్రుల కోరిక మేరకు విద్యార్థుల నేత్ర శస్త్రచికిత్సలను వేసవి సెలవుల నాటికి వాయిదా వేశామని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. మధ్యాహ్న భోజనంలో నాణ్యత పర్యవేక్షణకు యాప్‌ను తీసుకొస్తున్నామని వివరించారు. 

– గ్రామ, వార్డు సచివాలయాల్లో లబ్ధిదారుల చిరునామాల మ్యాపింగ్‌ ముఖ్యమైన కార్యక్రమం. గ్రామ వలంటీర్ల చేతిలో మొబైల్‌ ఫోన్లు ఉన్నాయి. అడ్రస్‌ మ్యాపింగ్‌ సరిగ్గా చేయని కారణంగా పెన్షన్లు ఇవ్వడానికి కొన్ని చోట్ల సమయం పడుతోంది. మ్యాపింగ్‌ పక్కాగా ఉంటే చకచకగా పింఛన్లు పంపిణీ చేయొచ్చు. వచ్చే నెల పెన్షన్ల పంపిణీ మొదటి రెండు రోజుల్లోనే పూర్తి కావాలి. 
– వార్డు, గ్రామ సచివాలయాల్లోని ఉద్యోగులు సమయానికి వస్తున్నారా? లేదా? చూసుకోవాలి.
– చిన్న చిన్న షాపులు నడుపుకుంటున్న రజకులు, నాయీబ్రాహ్మణులు, టైలర్లకు మార్చిలో ఏడాదికి రూ.10 వేలు అందించే పథకం ప్రారంభిస్తాం. 
– కాపు నేస్తంలో భాగంగా మహిళలను ఆదుకునే కార్యక్రమం కూడా మార్చిలోనే ప్రారంభిస్తాం. మార్గదర్శకాలు తయారు చేసి వలంటీర్ల సహాయంతో లబ్ధిదారులను ఎంపిక చేయాలి.
– ఈ ఏడాది ఖరీఫ్‌ కల్లా రైతు భరోసా కేంద్రాలు ప్రారంభించాలి. ప్రతి 2 వేల జనాభాకు సంబంధించిన వ్యవసాయ అవసరాలను ఈ రైతు భరోసా కేంద్రాలు తీరుస్తాయి. ఇ– క్రాపింగ్‌ తప్పనిసరిగా అమలు చేయాలి. ఈ కేంద్రాలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా మారుస్తాయి. ఈ కేంద్రాల నిర్మాణాలకు స్థలాలను గుర్తించాలి. 
– ఎక్కడైనా రైతులు ఆత్మహత్య చేసుకుంటే కలెక్టరు తప్పకుండా అక్కడకు వెళ్లాలి. పరిహారం అందని మృతుల కుటుంబాలకు వెంటనే ఆర్థిక సాయం అందించాలి. ఈ విషయంలో ఎలాంటి జాప్యం ఉండరాదు.
– 2014 నుంచి 2019 మధ్య ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాల్లో పరిహారం అందని 422 మంది కుటుంబాలకు ఈ నెల 24న పరిహారం అందించాలి.
– స్కూళ్లలో మనం చేపడుతున్న నాడు – నేడు కార్యక్రమం పనులు సక్రమంగా జరుగుతున్నాయా? లేదా? చూడండి. 
– మధ్యాహ్న భోజనంలో నాణ్యత, స్కూళ్లలో బాత్‌రూంల నిర్వహణ పర్యవేక్షణకు ప్రత్యేకంగా ఒక ఐఏఎస్‌ అధికారిని పెట్టాం. 
– అధికారులు కూడా గ్రామాలను సందర్శించాలి.
– ఏ సంక్షేమ పథకం విషయంలోనూ రాజకీయాలు, పార్టీలు చూడకూడదు. ఎలాంటి వివక్షా చూపకూడదు. అర్హులకు ఇవ్వలేదన్న మాట రాకూడదు.

ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ ఇలా..
– రూ.5 లక్షల లోపు వార్షికాదాయం ఉన్న వారందరూ అర్హులు
– ఈ నెల 15 నుంచి ప్రారంభించి మార్చి 31 నాటికి అన్ని జిల్లాల్లో పూర్తి
– 15 నుంచి కర్నూలు, వైఎస్సార్, విశాఖపట్నం, శ్రీకాకుళం 
– మార్చి 7 నుంచి అనంతపురం, ఉభయగోదావరి, నెల్లూరు, చిత్తూరు 
– మార్చి 25 నుంచి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, విజయనగరం 
– మొత్తం 1.41 కోట్ల మందికి క్యూఆర్‌ కోడ్‌తో ఉన్న ఆరోగ్యశ్రీ కార్డులు 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement