YS Jagan: యజ్ఞంలా వ్యాక్సినేషన్ | AP CM YS Jagan Response on COVID-19 Vaccination Plan - Sakshi
Sakshi News home page

యజ్ఞంలా వ్యాక్సినేషన్: సీఎం జగన్‌ ‌

Published Thu, Mar 25 2021 3:07 AM | Last Updated on Thu, Mar 25 2021 7:23 PM

CM YS Jagan comments in a high-level review on the Covid-19 vaccination plan - Sakshi

రాష్ట్రంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియ మరో 6 రోజులు మాత్రమే మిగిలి ఉంది. అయితే ఈ ప్రక్రియ ఎప్పుడు పూర్తవుతుందో తెలియని పరిస్థితి. ఈ ఎన్నికలు వెంటనే పూర్తయి ఉంటే వ్యాక్సినేషన్‌పైనే పూర్తిగా దృష్టి పెట్టి ఉండేవాళ్లం. వారానికి 20 –25 లక్షల మందికి చొప్పున నాలుగైదు వారాల్లోనే కోటి మందికి పైగా టీకా వేసి ఉండేవాళ్లం. కానీ అలా జరగలేదు. ప్రజారోగ్యానికి భంగం కలిగించడం బాధాకరం. ఈ పరిస్థితికి బాధ్యులెవరు? 
– సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ను ఉధృతం చేయడం ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే యజ్ఞాన్ని ముమ్మరంగా కొనసాగించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు వెంటనే పూర్తయి ఉంటే వ్యాక్సినేషన్‌పై పూర్తిగా దృష్టి పెట్టేవాళ్లమని.. మొత్తంగా నాలుగైదు వారాల్లో కోటి మందికి పైగా వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు వీలుండేదని అభిప్రాయపడ్డారు. ఎన్నికల ప్రక్రియ 6 రోజులు మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితిలో మళ్లీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో తెలియని సందిగ్ధత నెలకొందన్నారు. దీంతో వ్యాక్సినేషన్‌కు ఇబ్బంది ఏర్పడటంతో పాటు అధికార యంత్రాంగంలో కూడా సందిగ్ధత నెలకొందన్నారు.

ప్రజారోగ్యానికి భంగం కలిగించే ఇలాంటి పరిస్థితులకు బాధ్యులు ఎవరన్న ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కోవిడ్‌–19 వ్యాక్సినేషన్‌ ప్రణాళికపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏది ఏమైనా మనం చేయాల్సిన పని చేయడానికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగాలని చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో ఎన్నికలు పూర్తయినందున సోమవారం నుంచి వ్యాక్సినేషన్‌ ముమ్మరంగా పెద్ద ఎత్తున చేపట్టాలన్నారు. మొత్తంగా కోటి మందికి పైగా వ్యాక్సిన్‌ను శరవేగంగా ఇవ్వడానికి అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ఈ సమీక్షలో సీఎం వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే..
వ్యాక్సినేషన్‌ ప్రణాళికపై నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతున్న సీఎం జగన్‌ 

మండలంలో రోజుకు రెండు గ్రామాల్లో..
► గ్రామీణ ప్రాంతాల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియ పూర్తికానప్పటికీ వ్యాక్సినేషన్‌పై దృష్టి సారించాలి. ఇందులో భాగంగా వ్యాక్సినేషన్‌కు సన్నాహకంగా ప్రయోగాత్మకంగా ప్రతి మండలంలో రోజుకు 2 గ్రామాల చొప్పున, వారంలో 8 గ్రామాల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రక్రియ కొనసాగేలా చూడాలి.

► గ్రామ, వార్డు సచివాలయాలు కేంద్రంగా పీహెచ్‌సీ డాక్టర్‌ పర్యవేక్షణలో వాక్సినేషన్‌ కార్యక్రమాన్ని చేపట్టాలి. ఈ కార్యక్రమం కొనసాగే చోట 104, 108 అంబులెన్స్‌లను, ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలను అందుబాటులో ఉంచాలి. 

► ఆయా వార్డుల్లో 45 ఏళ్లు దాటిన వారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడుతున్న వారు ఎంత మంది ఉన్నారు.. వారంతా వ్యాక్సిన్‌ వేయించుకున్నారా.. లేదా.. అన్న వివరాలను వలంటీర్లు ఇల్లిల్లూ తిరిగి సేకరించాలి. తద్వారా ఎవరెవరు వ్యాక్సిన్‌ వేయించుకోలేదో గుర్తించి, వారికి అక్కడికక్కడే అవగాహన కల్పించి వ్యాక్సిన్‌ వేసేందుకు చర్యలు తీసుకోవాలి.

► ఈ ప్రక్రియ కొనసాగింపులో వస్తున్న లోపాలను దృష్టిలో ఉంచుకుని మరింత సమర్థవంతమైన విధానాలను అమలు చేయాలి. మొత్తంగా కోటి మందికి పైగా వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు అన్ని విధాలా సిద్ధం కావాలి.  

వీలైనంత త్వరగా విలేజ్‌ డాక్టర్‌ కాన్సెప్ట్‌ 
► రాష్ట్రంలో విలేజ్‌ డాక్టర్‌ కాన్సెప్ట్‌ను వీలైనంత త్వరగా అమల్లోకి తీసుకురావాలి. గ్రామాల్లో వ్యాక్సినేషన్‌ను పూర్తి స్థాయి యాక్టివిటీగా చేపట్టాలి. 
► గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్లు, ఆశావర్కర్లు, హెల్త్‌ వర్కర్లు అందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలి. వాక్సినేషన్‌పై ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు మరింతగా ప్రచారం నిర్వహించాలి.  

ఆర్టీపీసీఆర్‌ పద్ధతిలో కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు 
► కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలన్నీ ఆర్టీపీసీఆర్‌ పద్దతిలోనే చేయాలి. కోవిడ్‌ సోకిన వారికి వైద్య సేవలను అందించడానికి గతంలో ఉన్న సదుపాయాలన్నీ కొనసాగాలి. 104 నంబర్‌కు కాల్‌ చేస్తే వైద్య సేవలు సమర్థవంతంగా అందేలా చూడాలి.
 
ఐదు వేల బెడ్లు సిద్ధం
► ప్రస్తుతం 5 వేల బెడ్లు సిద్ధంగా ఉన్నాయని, అవసరాలకు అనుగుణంగా అదనపు బెడ్లు అందుబాటులోకి తీసుకొస్తామని ఈ సందర్భంగా అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఏయే ప్రాంతాల్లో కేసులు పెరుగుతున్నాయన్న దానిపై దృష్టి పెట్టామన్నారు. 

► మిగతా వాటితో పోలిస్తే పాఠశాలల్లో కేసుల సంఖ్య చాలా స్వల్పమని అధికారులు వివరించారు. ఏదైనా స్కూళ్లో కేసులు వస్తే.. 3 రోజులపాటు నిలిపేసి, అందరికీ పరీక్షలు చేసిన తర్వాత మాత్రమే తిరిగి నడిపేందుకు అనుమతిస్తున్నామన్నారు.

3.97 లక్షల మంది ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లకు వ్యాక్సిన్‌ పెండింగ్‌
► రాష్ట్రంలో హెల్త్‌ వర్కర్లు, ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లు ఇంకా 3.97 లక్షల మందికి వ్యాక్సిన్‌ పెండింగ్‌లో ఉందని అధికారులు వెల్లడించారు. 60 ఏళ్లకు పైబడి, 45 నుంచి 59 ఏళ్ల మధ్య దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న  59.08 లక్షల మందికి వ్యాక్సిన్‌ ఇవ్వాల్సి ఉందన్నారు. 

► ఏప్రిల్‌ 1 నుంచి 45 ఏళ్లు పైబడ్డ వారందరికీ వ్యాక్సిన్‌ అందించాలని కేంద్రం ప్రకటించిందని అధికారులు తెలిపారు.

► ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి (వైద్య, ఆరోగ్య శాఖ) ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌ (నాని), సీఎం ముఖ్య సలహాదారు నీలం సాహ్ని, వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్, వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి (కోవిడ్‌ మేనేజ్‌మెంట్, వ్యాక్సినేషన్‌) ముద్దాడ రవి చంద్ర, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement