దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రధాని మోదీ తీసుకున్న చర్యల్లో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అత్యంత ప్రశంసనీయమైనది. సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక, శాస్త్ర సాంకేతిక రంగాల్లో గత 75 సంవత్సరాల్లో దేశం సాధించిన ప్రగతిని గుర్తు చేసుకోవడానికి, ప్రగతిపథంలో దేశాన్ని ముందుకు తీసు కెళ్లడానికి మరోసారి మన అంకిత భావాన్ని పునరుద్ఘాటించడానికి వేదికగా నిలిచింది.
– సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: గత 75 ఏళ్లలో దేశంలో సాధించిన అభివృద్ధిని ప్రామాణికంగా తీసుకొని, రానున్న 25 ఏళ్లలో సుస్థిర ప్రగతి సాధించడానికి అడుగులు ముందుకు వేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేర్కొన్నారు. సమగ్ర ఆర్థికాభివృద్ధికి అడ్డంకిగా ఉన్న సమస్యల పరిష్కారానికి మనందరం కృషి చేద్దామని చెప్పారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర ఉత్సవాల సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఏర్పాటైన జాతీయ కమిటీ రెండవ సమావేశంలో బుధవారం ఢిల్లీ నుంచి ప్రధాని మోదీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో తన క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి జగన్ ప్రసంగించారు. నాలుగు దశాబ్దాలుగా అర్థిక అసమానతలను రూపుమాపడంలో చాలా మంచి నిర్ణయాలు అమలయ్యాయని చెప్పారు. ఉచిత విద్య, ఆహార భద్రతలను చట్టబద్ధం చేశారని, ప్రధాని నాయకత్వంలో గ్రామాల్లో పెద్ద ఎత్తున విద్యుదీకరణ జరిగిందన్నారు. పారిశుధ్యం, పరిశుభ్రతలపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. వివిధ రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, పార్టీల నాయకులు, ఆధ్యాత్మిక వేత్తలు, కళాకారులు, వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే..
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఏర్పాటైన జాతీయ కమిటీ రెండవ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు
అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్
► గత 75 సంవత్సరాల్లో ముఖ్యంగా ఈ ఏడున్నర సంవత్సరాల్లో దేశం చాలా ప్రగతిని సాధించింది. వాస్తవ జీడీపీ 1950–51లో రూ.2.94 లక్షల కోట్లు ఉంటే, 2019–20 నాటికి రూ.145.69 లక్షల కోట్లకు చేరుకుంది. తద్వారా ప్రపంచంలోనే ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలిచింది.
► ఈ పరిస్థితుల్లో మనం నడుస్తున్న మార్గంలో అనేక అవకాశాలతో పాటు అనేక సవాళ్లు కూడా ఉన్నాయి. మన దేశ సమర్థతను చాటడానికి సుస్థిర ప్రగతి, ఆర్థిక అసమానతలను రూపుమాపడంపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
► దేశ ఆర్థిక పురోగతి ద్వారా ఇప్పుడున్న వారు ప్రస్తుతం తమ అవసరాలను తీర్చుకుంటున్నారు. అయితే భవిష్యత్తు తరాలు కూడా తమ అసరాలను తీర్చుకోవడంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకూడదు.
► ఆర్థిక అసమానతల వల్ల గ్రామీణ ప్రాంతాల్లో రుణ భారం పెరగడం వల్ల కొనుగోలు శక్తి తగ్గుతోంది. అందువల్ల ఆర్థిక అసమానతలను తొలగించడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి.
ఆర్థిక ప్రగతిలో ఇంధన రంగం కీలక పాత్ర
► దేశ సామాజిక, ఆర్థిక ప్రగతిలో ఇంధన రంగం కీలక పాత్ర పోషిస్తోంది. గత 15 ఏళ్లుగా దేశంలో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 1,27,423 మెగావాట్ల నుంచి 3,84,116 మెగావాట్లకు పెరిగింది. ముఖ్యంగా థర్మల్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 84,982 మెగావాట్ల నుంచి 2,34,058 మెగావాట్లకు పెరిగింది.
► దీనివల్ల కాలుష్య కారక వాయువులు వెలువడుతున్నాయి. ఇది భవిష్యత్తు తరాలకు అత్యంత ప్రమాదకరం. బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తిని క్రమంగా తొలగించి ఆ స్థానంలో సహజ వనరుల నుంచి విద్యుత్ ఉత్పత్తిని పెంచాల్సిన బాధ్యత ఉంది. సహజ వనరుల నుంచి ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌ను స్టోరేజ్ చేసుకునే విషయంలో పరిష్కారాలను సత్వరం సాధించాలి.
► కార్బన్ న్యూట్రాలిటీని సాధించడంతో పాటు అవసరాలకు అనుగుణంగా విద్యుత్‌ను ఉత్పత్తి చేయడంలో ఇది అత్యంత అవసరం. సుస్థిర ఆర్థిక ప్రగతి దిశగా స్వచ్ఛ విద్యుత్‌ను ఉత్పత్తి చేసే విషయంలో ఒకే సూర్యుడు (ఒన్ సన్), ఒకే ప్రపంచం (ఒన్ వరల్డ్), ఒకే గ్రిడ్ (ఒన్ గ్రిడ్) దిశగా ప్రధాన మంత్రి తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయం.
► భౌగోళికంగా రెండు కాలమానాలున్న ప్రాంతాల మధ్య విద్యుత్ పంపిణీ ఉండాలి. ఇవాళ్టికి ఇది ఒక కల కావొచ్చు. కాని మరొక వాస్తవం ఏంటంటే.. ఖండాల మధ్య డేటాను పంపడానికి ఇప్పటికే ఆప్టికల్ ఫైబర్ నెట్ వ్యవస్థ ఉంది. ఇదే తరహాలో ఖండాలను కలుపుతూ పవర్ గ్రిడ్ అన్నది తీరని కల కాకూడదు.
వారి నిస్వార్థత గర్వకారణం
► స్వాతంత్య్ర పోరాట యోధుల నిస్వార్థత చూసి మనందరం గర్వించాలి. అమృత్ మహోత్సవ్ సందర్భంగా వారిని గౌరవించుకోవాలి. వారికి సెల్యూట్ చేయాలి. ఏపీలో స్వాతంత్య్ర సమరయోధులను ఈ సందర్భంగా గౌరవించుకునే అవకాశం నాకు కలిగింది.
► ఆజాదీ క అమృత్ మహోత్సవ్ సందర్భంగా ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు పింగళి వెంకయ్యగారి కుమార్తె సీతా మహాలక్ష్మిని వారి స్వగ్రామంలో కలుసుకున్నాను. పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ పతాకాన్ని 1921లో ఆయన మహాత్మగాంధీకి విజయవాడలో సమర్పించారు. ప్రస్తుతం ఇది బాపు మ్యూజియంలో ఉంది. మా ప్రభుత్వం ఇటీవలి కాలంలో ఈ మ్యూజియంను బాగుచేసి ప్రజల సందర్శనార్థం అందుబాటులోకి తీసుకువచ్చింది.
► ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, అయ్యదేవర కాళేశ్వరరావు, వావిలాల గోపాలకృష్ణయ్య.. మరెంతో మంది ప్రముఖుల సేవలను గుర్తు చేసుకుంటూ ప్రతివారం వర్చువల్‌గా, భౌతికంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.
► ఇప్పటి వరకు 908 కార్యక్రమాలు నిర్వహించాం. నిస్వార్థపరులైన స్వాతంత్య్ర సమర యోధులను గుర్తు చేసుకోవడమే కాకుండా వారి జీవితాల నుంచి ఈ తరం యువకులు స్ఫూర్తి పొందుతున్నారు. ఈ కార్యక్రమాల్లో అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములను చేయడం ద్వారా వారిలో దేశభక్తిని నింపుతున్నాం.
నిరంతరం ఒక సమస్య మనల్ని వెంటాడుతోంది. దేశంలో పేదల ఆర్థిక వృద్ధి తగినంతగా లేదు. ఈ పరిస్థితిలో పేదరికాన్ని రూపు మాపడానికి ప్రస్తుతం ఉన్న ఆర్థిక ప్రగతి సరిపోవడం లేదు. ప్రంచంలో అసమానతలపై తాజాగా వచ్చిన నివేదిక ప్రకారం జాతీయ ఆదాయంలో 57 శాతం 10 శాతం మంది చేతిలో.. 22 శాతం 1 శాతం మంది చేతిలో ఉంది. తద్వారా గ్రామాణ ప్రాంతాల ప్రజల్లో కొనుగోలు శక్తి పుంజుకోదు. అత్యంత తీవ్రమైన ఈ సమస్య పట్ల విధాన రూపకర్తలమైన మనందరం దృష్టి సారించి, సమ్మిళిత ఆర్థిక వృద్ధిని సాధ్యం చేసేందుకు అడుగులు ముందుకు వేయాలి.
Comments
Please login to add a commentAdd a comment