ఏపీ: ఎవరూ వేలెత్తి చూపకుండా సంపూర్ణ భూసర్వే | CM YS Jagan On Comprehensive survey of lands Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఏపీ: ఎవరూ వేలెత్తి చూపకుండా సంపూర్ణ భూసర్వే

Published Wed, Oct 19 2022 3:13 AM | Last Updated on Wed, Oct 19 2022 8:02 AM

CM YS Jagan On Comprehensive survey of lands Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో భూముల రీ సర్వే మహాయజ్ఞం ఫలాలు ప్రజలకు పూర్తి స్థాయిలో సంతృప్తికరంగా అందాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికార యంత్రాంగానికి నిర్దేశించారు. సర్వేలో నాణ్యత చాలా ముఖ్యమని స్పష్టం చేశారు. ఒక గ్రామంలో రీ సర్వే చేసిన తర్వాత తమదైన ముద్రతో అన్ని రకాలుగా ఈ ప్రక్రియను ముగించాలన్నారు. భూ వివాదాలు, తగాదాలు లేని గ్రామాలు సాక్షాత్కారం కావడమే రీసర్వే లక్ష్యమన్నారు. సర్వే ఎక్కడా అసంపూర్తిగా మిగిలిపోయిందన్న మాటే రాకూడదన్నారు.

ప్రజలను పూర్తి స్థాయిలో సంతృప్తి పరిచేలా, భూ సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపేలా రీసర్వే ఉండాలని స్పష్టం చేశారు. అప్పుడే ఈ బృహత్తర కార్యక్రమానికి సార్థకత లభిస్తుందన్నారు. సర్వేతో రెవెన్యూ వ్యవస్థ పూర్తిస్థాయిలో ప్రక్షాళన కావడంతోపాటు రికార్డులు, డేటా స్వచ్ఛీకరణ జరుగుతుందని తెలిపారు.  ‘వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష’ పథకంపై మంగళవారం క్యాంపు కార్యాలయంలో సమీక్షించిన సీఎం జగన్‌ సర్వే ప్రక్రియకు సంబంధించి కీలక సూచనలు చేశారు. ఆ వివరాలివీ..
వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకంపై సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌ 

ప్రణాళికాబద్ధంగా.. 
రీససర్వేలో నాణ్యత చాలా ముఖ్యం. ఈ మహాయజ్ఞం ఫలాలు ప్రజలకు సంపూర్ణంగా అందాలి. ఎక్కడా కూడా సర్వే అసంపూర్తిగా మిగిలిపోయిందన్న మాట రాకూడదు. మొబైల్‌ ట్రిబ్యునళ్లు, సరిహద్దులు, సబ్‌డివిజన్లు.. ఇవన్నీ చాలా క్రమ పద్ధతిలో ముందుకు సాగాలి. సర్వే చేస్తున్నప్పుడు ఉత్పన్నమైన సమస్యలను అత్యంత ప్రణాళికా బద్ధంగా పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్లాలి. ఈ సర్వే ద్వారా రెవెన్యూ వ్యవస్థ పూర్తిస్థాయిలో ప్రక్షాళన అవుతుంది. రికార్డులు, డేటా స్వచ్ఛీకరణ జరుగుతుంది. ఈ అంశాలను అధికారులు దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగాలి. 

వేలెత్తి చూపలేని విధంగా..
రీ సర్వే ద్వారా ప్రభుత్వానికి మంచి పేరు వస్తోందని కొంతమంది పనిగట్టుకుని ఈ కార్యక్రమంపై దుష్ఫ్రచారం చేస్తున్నారు. అపోహలు సృష్టించేలా వ్యవరిస్తున్నారు. తద్వారా ఈ గొప్ప ప్రయత్నాన్ని నీరుగార్చి విశ్వసనీయతను దెబ్బతీసే యత్నాలు చేస్తున్నారు. 100 ఏళ్ల తర్వాత భూముల రీ సర్వే చేస్తున్నాం. దీనికోసం కొన్ని వేల మందిని నియమించి రూ.కోట్లు వెచ్చించి అత్యాధునిక పరికరాలను కొనుగోలు చేశాం. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఎవరూ వేలెత్తి చూపలేని విధంగా సర్వే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలి. దోషాలు, తప్పులతో ఒక్క హక్కు పత్రం కూడా రైతులకు వెళ్లకూడదు.

సర్వే పూర్తైన ప్రతి గ్రామంలో 5 శాతం రికార్డులను ఆర్డీవోలు, ఒక శాతాన్ని జేసీలు వెరిఫికేషన్‌ చేయాలి. అది పూర్తైన తరువాతే హక్కు పత్రాలను జారీ చేయాలి. గ్రామ సచివాలయంలో సర్వే పూర్తి కాగానే అక్కడ రిజిస్ట్రేషన్‌ కార్యాలయం ఏర్పాటు కావాలి. పై అధికారులు గ్రామాలను సందర్శించడం వల్ల అందరూ బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తిస్తారు. సిబ్బందిలో జవాబుదారీతనం పెరుగుతుంది.

అర్బన్‌లో జనవరి నుంచి..
పట్టణ ప్రాంతాల్లో సర్వే ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి జగన్‌ సూచించారు. 123 కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో 15,02,392 ఎకరాల్లో చేపట్టే సర్వేలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. సర్వే పూర్తైన తర్వాత ఇక్కడ కూడా పత్రాల వెరిఫికేషన్‌ చేయాలని ఆదేశించారు. వచ్చే జనవరిలో సర్వే ప్రక్రియ ప్రారంభించి మే నెల నుంచి హక్కు పత్రాల పంపిణీ ప్రారంభమయ్యేలా ముందుకు సాగుతామని అధికారులు తెలిపారు. 2023 ఆగస్టు నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించినట్లు చెప్పారు.

కచ్చితమైన విధానాలతో..
భూ యజమానులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, పూర్తిస్థాయిలో సంతృప్తి చెందేలా సర్వే జరుగుతోందని సమీక్షలో ఉన్నతాధికారులు ముఖ్యమంత్రికి నివేదించారు. పక్కా మార్గదర్శకాలతో తప్పులు, పొరపాట్లు లేని విధంగా హక్కు పత్రాలు జారీ చేస్తామన్నారు. సర్వే ప్రక్రియలో ఏ దశలో అభ్యంతరాలు వ్యక్తమైనా పరిష్కరించే వ్యవస్థలను బలోపేతం చేస్తామని చెప్పారు. సమగ్ర సర్వే ద్వారా భూ యజమానుల హక్కులను తరతరాలు కాపాడటంతోపాటు ఆక్రమణలు, కబ్జాలు, రికార్డుల్లో అవకతవకలు లాంటి వాటికి పూర్తిస్థాయిలో అడ్డుకట్ట పడుతుందన్నారు.

కేవలం 5 సెంటీమీటర్ల వ్యత్యాసంతో కచ్చితమైన పద్ధతుల్లో సర్వే జరుగుతుందన్నారు. ఇప్పటివరకూ 6,037 గ్రామాల్లో డ్రోన్లు ఎగరవేశామని, ఇందులో 1,545 గ్రామాల్లో రెవిన్యూ రికార్డులు కూడా ఖరారయ్యాయని తెలిపారు. ప్రతి నెలా 13,335 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని లక్ష్యంగా చేసుకుని సర్వే చేస్తున్నామని వివరించారు. డ్రోన్లు ఎగరవేయడానికి అనువుగాలేని ప్రాంతాల్లో విమానాలు, హెలికాప్టర్ల ద్వారా సర్వే చేయడానికి అన్ని రకాలుగా సిద్ధమయ్యామన్నారు. నవంబర్‌ మొదటి వారంలో తొలివిడత గ్రామాల్లో హక్కు పత్రాలను అందిస్తామన్నారు.

ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. సమీక్షలో విద్యుత్, అటవీ, పర్యావరణ, భూగర్భ గనుల శాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లాం, ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ చీఫ్‌ కమిషనర్‌ జి.సాయి ప్రసాద్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్‌ సీఎస్‌ వై.శ్రీలక్ష్మి, రెవెన్యూ శాఖ స్పెషల్‌ సీఎస్‌ రజత్‌ భార్గవ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, రెవెన్యూ శాఖ (సర్వే సెటిల్మెంట్స్‌ అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌) కమిషనర్‌ సిద్దార్ధ జైన్, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ డైరెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్, సీసీఎల్‌ఏ కార్యదర్శి ఇంతియాజ్, రిజిస్ట్రేషన్స్‌ అండ్‌ స్టాంప్స్‌ ఐజీ వి.రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement