AP CM YS Jagan At Distribution Of Kits Jagananna Vidya Kanuka, Details Inside - Sakshi
Sakshi News home page

పేదింటి పిల్లలు ప్రపంచాన్ని ఏలాలి

Published Tue, Jun 13 2023 1:47 AM | Last Updated on Tue, Jun 13 2023 9:33 AM

CM YS Jagan At Distribution of kits Jagananna Vidya Kanuka - Sakshi

పల్నాడు జిల్లా క్రోసూరులోని మోడల్‌ స్కూల్లో పుస్తకాలను పరిశీలిస్తూ విద్యార్థులతో ముచ్చటిస్తున్న సీఎం జగన్‌

మన విద్యార్థులు ఇంకా బాగా ఎదిగి ముందు వరుసలో నిలిచేందుకు అంతర్జాతీయంగా విద్యారంగంలో వస్తున్న మార్పులన్నింటినీ అధ్యయనం చేసి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, మెషిన్‌ లెర్నింగ్, లాంగ్వేజ్‌ లెర్నింగ్‌ మాడ్యూల్స్, డేటా ఎనలిటిక్స్‌ మొదలు చాట్‌ జీపీటీ దాకా మన సిలబస్‌తో అనుసంధానించేలా వేగంగా అడుగులు వేస్తున్నాం. 
– పల్నాడు జిల్లా క్రోసూరు సభలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సాక్షి ప్రతినిధి, గుంటూరు: పేద విద్యార్థులకు అంతర్జాతీయ చదువులే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. విద్యారంగంలో సమూల మార్పులను తెచ్చి నాలుగేళ్లలో రూ.60,329 కోట్లు వ్యయం చేశామన్నారు. పాఠశాలలు పునఃప్రారంభం కాగానే పుస్తకాలు, యూనిఫామ్‌ కోసం ఎవరూ ఇబ్బంది పడకూడదన్న లక్ష్యంతో వరుసగా నాలుగో ఏడాది జగనన్న విద్యాకానుక కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు.

ప్రభుత్వ, ఎయిడెడ్‌ స్కూళ్లలో ఒకటి నుంచి పదో తరగతి చదివే ప్రతి విద్యార్థికీ కుట్టుకూలీతో సహా మూడు జతల యూనిఫామ్, బ్యాగు, బైలింగ్యువల్‌ టెక్స్ట్‌ బుక్స్, నోట్‌బుక్స్, వర్క్‌­బుక్స్, బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టుతో­పాటు మంచి డిక్షనరీని కూడా విద్యాకానుక కిట్‌ ద్వారా ఉచితంగా అందిస్తున్నామన్నారు. సోమవా­రం పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరులో రూ.1,042.53 కోట్లతో జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీని సీఎం లాంఛనంగా ప్రారంభించారు. దీనిద్వారా 43,10,165 మంది  విద్యార్థు­లకు ప్రయోజనం చేకూరనుంది.

ఈ సందర్భంగా సీఎం జగన్‌ మోడల్‌ స్కూల్‌ను సందర్శించి కొద్ది­సేపు విద్యార్థులతో ముచ్చటించారు. కిట్లు, పాఠ్య పుస్తకాలను స్వయంగా పరిశీలించారు. స్కూల్‌ బ్యాగ్‌ ధరించి విద్యార్థులను ఉత్సాహపరిచారు. బోర్డుపై ‘ఆల్‌ ద బెస్ట్‌..’ అని రాసి శుభాకాంక్షలు తెలి­పారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో సీఎం జగన్‌ ప్రసంగించారు.

పిల్లలకు ఓటు హక్కు లేదని గతంలో పట్టించుకోలేదు 
విద్యార్థులకు ఈ దఫా యూనిఫామ్‌ క్లాత్‌ గతేడాది కంటే ఎక్కువ ఇస్తున్నాం. పిల్లలందరూ చక్కగా కనిపించేందుకు యూనిఫామ్‌ డిజైన్‌లో కూడా మార్పులు తెచ్చాం. గతేడాది ఫీడ్‌బ్యాక్‌ ఆధారంగా పుస్తకాల బ్యాగ్‌ సైజ్‌ కూడా పెంచాం. మెరుగైన క్వాలిటీ బూట్లు ఇస్తున్నాం. బైలింగ్యువల్‌ పాఠ్య పుస్తకాల నాణ్యతను కూడా పెంచి పిల్లలకు ఇస్తు­న్నాం.

రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ్టి నుంచి విద్యాకానుక కిట్ల పంపిణీ పండుగ వాతావరణంలో జరుగుతుంది. చిన్నపిల్లలు ఓటర్లు కానందున వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్న పరిస్థితి గతంలో ఉండేది. ఇవాళ మీ జగన్‌ మామయ్య ప్రభుత్వంలో విద్యా­కానుక కార్యక్రమాన్ని ప్రజా ప్రతినిధుల సమక్షం­లో పండుగలా నిర్వహిస్తున్న పరిస్థితి తెచ్చినం­దుకు సంతోషిస్తున్నా. ఒక్కో విద్యార్థికి విద్యాకానుక కిట్‌ కోసం రూ.2,400 ఖర్చు చేస్తు­న్నాం. ఒక్క విద్యాకానుక కింద నాలుగేళ్లలో రూ.3,366 కోట్లను ప్రభుత్వం వెచ్చించింది. 

టోఫెల్‌కు శిక్షణ.. సర్టిఫికెట్‌
అధికారంలోకి రాగానే పాఠశాల స్థాయి నుంచే ఇంగ్లీషులో పిల్లల నైపుణ్యాలను పెంపొందించేలా చర్యలు తీసుకున్నాం. మన పిల్లలు ఎక్కడకు వెళ్లినా ప్రపంచాన్ని ఏలే పరిస్థితుల్లో ఉండాలే కానీ వారిని తక్కువగా చూసే పరిస్థితుల్లో ఉండకూడదని ఈ దిశగా అడుగులు వేశాం. మన పిల్లలు ఎక్కడైనా రాణించేందుకు వీలుగా టోఫెల్‌ పరీక్షలకు సిద్ధం చేసే కార్యక్రమం ఈ ఏడాది నుంచే మొదలవుతుంది. ఇందుకోసం ప్రపంచంలో ఎంతో పేరున్న అమెరి­కన్‌న్‌సంస్థ ఎడ్యుకేషనల్‌ టెస్టింగ్‌ సర్వీసెస్‌ (ఈటీ­ఎస్‌), ప్రిన్స్‌టన్‌తో ఒప్పందం కుదుర్చుకు­న్నాం.

మూడు నుంచి ఐదో తరగతి వరకు టోఫెల్‌ ప్రైమరీ, ఆరో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు టోఫెల్‌ జూనియర్‌ పేరుతో పరీక్షలు నిర్వ­హించి టోఫెల్‌ ఇంటర్నేషనల్‌ సర్టిఫికెట్‌ అందచేస్తారు. తద్వారా ఇంగ్లీషు వినడమే కాకుండా ధారాళంగా మాట్లాడడం కూడా వస్తుంది. అది కూడా అమెరికా యాసలో మాట్లాడగలుగుతారు. అంతేకాకుండా అత్యుత్తమ ప్రతిభ చూపించిన ప్రభుత్వ స్కూళ్లలో ప్రతి జిల్లాలో ఒక ప్రభుత్వ హైస్కూల్, ప్రైమరీ స్కూల్‌ వెరసి 26 జిల్లాల్లో 52 స్కూళ్లకు సంబంధించిన ఇంగ్లీషు టీచర్లను మెరుగైన ఓరియంటేషన్‌ కోసం అమెరికాలోని ప్రిన్స్‌టన్‌కు పంపిస్తాం. 

నాడు–నేడు, సీబీఎస్‌ఈ, ఇంగ్లీషు మీడియం..
విద్యారంగంలో నాలుగేళ్లలో విప్లవాత్మక మార్పులు తెచ్చాం. ఇప్పటికే మనబడి నాడు–నేడుతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారాయి. సీబీఎస్‌ఈ సిలబస్, ఇంగ్లీష్‌ మీడియం తీసుకొచ్చాం. గతంలో క్లాస్‌ టీచర్లే లేని పరిస్థితి నుంచి మూడో తరగతి నుంచి ఏకంగా సబ్జెక్టు టీచర్లను నియమిస్తూ మన ప్రభుత్వంలో అడుగులు పడ్డాయి. 

డిసెంబర్‌ 21న మళ్లీ ట్యాబ్‌లు..
నాలుగో తరగతి నుంచి మన కరిక్యులమ్‌తో అను­సంధానిస్తూ పేద పిల్లలందరికీ బైజూస్‌ కంటెంట్‌ ఉచితంగా ఇస్తున్నాం. రోజుకో మెనూతో గోరు­ముద్ద, అంగన్‌వాడీల్లో సంపూర్ణ పోషణ కార్యక్ర­మాలను  అమలు చేస్తున్నాం. అమ్మ ఒడి ద్వారా పిల్లల్ని బడులకు పంపేలా తల్లులను ప్రోత్సహిస్తూ ఏటా రూ.15 వేలు ఇస్తున్నాం.

అమ్మ ఒడి కోసం ఇప్పటివరకూ రూ.19,674 కోట్లు ఖర్చు చేశాం. 8వ తరగతి పిల్లలకు ఆఫ్‌లైన్‌లో కూడా పనిచేసేలా ప్రీలోడెడ్‌ బైజూస్‌ కంటెంట్‌తో పిల్లలకు, టీచర్లకు ట్యాబ్‌లు అందించాం. 5,18,740 ట్యాబ్‌ల కోసం రూ.685 కోట్లు ఖర్చు చేసి గత ఏడాది ఇచ్చాం. మళ్లీ ఈ సంవత్సరం మీ జగన్‌ మామయ్య పుట్టిన రోజైన డిసెంబర్‌ 21న మళ్లీ 8వ తరగతి పిల్లలకు ట్యాబ్‌లు ఇస్తాం.
 
‘ఉన్నత’ మార్పులు..
జగనన్న విద్యాదీవెన ద్వారా కాలేజీ ఫీజు ఎంతైనా సరే మూడు నెలలకు ఒకసారి నేరుగా పిల్లల తల్లుల ఖాతాల్లోకి జమ చేస్తున్నాం. ఒక్క జగనన్న విద్యా దీవెన పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం కోసం ఇప్పటి వరకు మన ప్రభుత్వం రూ.10,636 కోట్లు ఖర్చు చేసింది. ఒక్కో పిల్లాడి కోసం ఏడాదికి రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు ఖర్చు చేస్తూ జగనన్న వసతి దీవెన తీసుకొచ్చి ఇప్పటివరకు రూ.4,275 కోట్లు వెచ్చించాం.

మన పిల్లలు దేశంలోనే కాదు ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబడాలనే తపనతో జగనన్న విదేశీ విద్యా దీవెన కోసం ఇప్పటిదాకా రూ.20 కోట్లు ఖర్చు చేశాం. టాప్‌ 50 యూనివర్సి­టీల్లో మన పిల్లలు 213 మంది చదువుతున్నారు. కల్యాణమస్తు, షాదీ తోఫా పథకాలని తీసుకొచ్చి వధూవరులకు టెన్త్‌ సర్టిఫికెట్‌ ఉండాలనే నిబంధన విధించాం. విద్యారంగంపై నాలుగేళ్లలో మనం చేసిన ఖర్చు రూ60,329 కోట్లు.

డిజిటల్‌ క్లాస్‌ రూములు..
స్కూళ్లతోపాటు ప్రతి క్లాస్‌ రూమ్‌ రూపురేఖలు మారుతున్నాయి. నాడు–నేడు తొలిదశ పూర్తైన స్కూళ్లలో 6వ తరగతి నుంచి ప్రతి క్లాస్‌రూమ్‌లో ఇంటరాక్టివ్‌ ప్లాట్‌ ప్యానెల్స్‌ తెస్తున్నాం.  డిజిటల్‌ బోధనతో పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా చర్యలు తీసుకున్నాం. నాడు–నేడు తొలిదశ పూర్తైన 15,750 స్కూళ్లలో 6వ తరగతి, ఆపైన ఉన్న 30,232 క్లాస్‌ రూముల్లో డిజిటల్‌ బోధనను జూలై 12న ప్రారంభిస్తున్నాం. కాసేపటి క్రితం క్రోసూరు హైస్కూల్‌లో డిజిటల్‌ బోర్డులు చూశా. అవి ఇక 6వ తరగతి నుంచి ప్రతి క్లాస్‌రూమ్‌­లోనూ ఉంటాయి.

డిసెంబర్‌ 21 నాటికి నాడు–­నేడు రెండు దశలు పూర్తైన దాదాపు 33 వేల స్కూళ్ల­లో 6 నుంచి క్లాస్‌ రూమ్స్‌లో డిజిటల్‌ బోధన దిశగా అడుగులు పడతాయి.  టాయిలెట్ల నిర్మాణం, నిర్వహణపై  దృష్టి పెట్టి మెయింటెనెన్స్‌ ఫండ్‌ తీసుకొచ్చాం. బడికి వెళ్లే ఏ చిట్టి తల్లి కూడా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో వారి కోసం ‘స్వేచ్ఛ’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. 

మెరుగ్గా విద్యా కానుక కిట్లు సీఎం వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ 
సాక్షి, అమరావతి: వరుసగా నాలుగో ఏడాది జగనన్న విద్యాకానుక కిట్ల పంపిణీని సోమ­వారం ప్రారంభించామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ‘విద్యార్థులు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్‌ వంటి విద్యా సామాగ్రి కోసం ఇబ్బంది పడకుండా పాఠశా­లలు ప్రారంభమైన తొలిరోజు నుంచే ఈ కిట్ల పంపిణీని మన ప్రభుత్వంలో చేపడుతున్నాం. ఈ ఏడాది యూనిఫామ్‌ డిజైన్‌లో మార్పులు చేసి మెరుగ్గా తీర్చిదిద్దాం. షూస్‌ నాణ్యత పెంచడంతో పాటు పుస్తకాల బ్యాగ్‌ సైజ్‌ను కూడా పెంచాం. విద్యార్థులకు 10 వస్తువులతో కూడిన కిట్లను రూ.1,042 కోట్ల ఖర్చుతో అందిస్తున్నాం’ అని ఆయన ట్వీట్‌ చేశారు.  

రాష్ట్రంలో చదువుల విప్లవం
మన విద్యార్థులు గ్లోబల్‌ సిటిజెన్‌గా రాణించాలనే ఆలోచనతో విద్యా విధానంలో సీఎం జగన్‌ సమూల మార్పులు తెస్తున్నారు. పేద, ధనిక వ్యత్యాసం లేకుండా అందరూ సమానంగా ఉండాలనే ఉద్దేశంతో విద్యాకానుక ఇస్తున్నాం. గోరుముద్దలో రోజుకో మెనూతో చక్కటి భోజనం పెడుతున్నాం. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లిస్తూ బైజూస్‌ కంటెంట్‌ కూడా అందజేస్తున్నాం. రాష్ట్రంలో చదువుల విప్లవం కొనసాగుతోంది. 
    – బొత్స సత్యనారాయణ, విద్యాశాఖ మంత్రి  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement