
తనను నమ్ముకున్న జనాలకు కష్టం వస్తే.. నేనున్నాంటూ ధైర్యం చెప్పాలి. సమస్య వస్తే.. ప్రజాక్షేత్రంలోకి దిగి.. వాటిని పరిష్కరించాలి. బాధల్లో ఉన్న వారిని ఓదార్చి అక్కున చేర్చుకోవాలి. ఆదుకుంటానని హామీ ఇవ్వాలి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అదే చేస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ముంపు బారిన పడ్డ లంక గ్రామాల్లో సీఎం జగన్ పర్యటన చేపట్టారు. ఒకవైపు వర్షం కురుస్తోన్నప్పటికీ సీఎం జగన్ వరద బాధితులకు వద్ద వెళ్లి పరామర్శిస్తున్నారు. వారికి తానున్నాంటూ భరోసా ఇస్తున్నారు.
జి. పెదపూడి(కోనసీమ జిల్లా): ఈరోజు(మంగళవారం) ఉదయం కోనసీమ జిల్లా పర్యటనకు బయల్దేరి వెళ్లారు సీఎం జగన్. దీనిలో భాగంగా జి.పెదపూడికి సీఎం జగన్ చేరుకునే సరికి భారీ వర్షం కురుస్తోంది. కానీ సీఎం జగన్ భారీ వర్షంలోనూ ముందుకు సాగారు. వరద బాధితులకు వద్దకు వెళ్లి వారి కష్టాలను అడిగి తెలుసుకుంటున్నారు.
కచ్చితంగా వరద బాధితులతో మాట్లాడాలనే తాపత్రయమే సీఎం జగన్‌లో కన్పిస్తోంది. తాను వారిని కలుస్తానని ముందుగా మాటిచ్చిన మేరకే వారి కష్టాలను స్వయంగా తెలుసుకుని భరోసా ఇస్తున్నారు. సాధారణంగా వాతావరణం అనుకూలంగా లేనప్పుడు సీఎం స్థాయి వ్యక్తి చివరి నిమిషంలో పర్యటనను వాయిదా వేసుకోవడమే జరుగుతూ ఉంటుంది. కానీ సీఎం జగన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వరద బాధితుల్ని పరామర్శించాలని సంకల్పించారు. అందుకు అనుగుణంగానే వర్షం కురుస్తున్నప్పటికీ లెక్కచేయకుండా లంక గ్రామాల్లో పర్యటిస్తూ బాధితుల సమస్యలను వింటున్నారు.