
కోనసీమ నుంచి సాక్షి ప్రతినిధి
వరదలు లాంటి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి వనరులను కలెక్టర్ల చేతిలో పెట్టి వారికి దిశా నిర్దేశం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ‘ముంపు బారిన పడ్డ వారిని రక్షించడం, పునరావాసం కల్పించడం, సాయం అందించడంపై దృష్టి పెట్టాలే కానీ డ్రామాలు అనేవి ఉండకూడదు. ఏదైనా ఘటన జరిగిన వెంటనే వచ్చేసి ఫొటోలకు ఫోజులిచ్చి చంద్రబాబులా టీవీల్లో, పత్రికల్లో పబ్లిసిటీ కోసం పాకులాడకూడదు’ అని వ్యాఖ్యానించారు. మంగళవారం కోనసీమ లంక గ్రామాల్లో పర్యటన సందర్భంగా సీఎం జగన్ నేరుగా బాధితులను కలుసుకుని మాట్లాడారు.
సాయం అందలేదని ఒక్కరైనా చెప్పారా బాబూ?
‘చంద్రబాబు ప్రజలకు మేలు జరగకపోయినా ఫర్వాలేదనుకుంటారు. టీవీ, పత్రికలు చేతిలో ఉన్నాయని ప్రచారం చేసుకునే వారు. మన బాబు బంగారం.. బాగా పని చేస్తున్నారంటూ ఈనాడు, ఈటీవీ, టీవీ 5, ఆంధ్రజ్యోతిలో ప్రచారం చేసుకునేవారు. ఇదే పెద్ద మనిషి రెండు రోజుల క్రితం ఇక్కడే (కోనసీమ) తిరిగారు. లంక ప్రాంతాల్లో తమకు సాయం అందలేదన్న వారిని కనీసం ఒక్కరినైనా చూపించలేకపోయారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు వాళ్లు పని చేయడం లేదు... వీళ్లు పనిచేయడం లేదంటూ సస్పెన్షన్లు, డిస్మిస్‌లు చేసేవారు. ఆర్భాటం చేసి సొంత మీడియాలో పబ్లిసిటీ చేసుకునేవారు’ అని సీఎం జగన్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment