ఏపీలో టెన్త్‌, ఇంటర్‌, డిగ్రీ, ఇంజినీరింగ్ పరీక్షలు యథాతథం | CM YS Jagan Mohan Reddy Review Meeting On Corona Virus | Sakshi
Sakshi News home page

కరోనాపై సమీక్ష నిర్వహించిన సీఎం వైఎస్‌ జగన్‌

Published Fri, Apr 23 2021 8:34 PM | Last Updated on Fri, Apr 23 2021 9:48 PM

CM YS Jagan Mohan Reddy Review Meeting On Corona Virus - Sakshi

సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం క్యాంపు కార్యాలయంలో కోవిడ్‌–19 నియంత్రణ, నివారణ, వాక్సినేషన్‌పై సమీక్ష నిర్వహించారు. సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి ఏమన్నారంటే..

ఔషదాలు బ్లాక్‌ మార్కెట్‌ కావొద్దు:
‘ఆక్సీజన్‌ ఉత్పత్తితో పాటు, సరఫరాను హేతుబద్ధీకరించండి. అలాగే కోవిడ్‌ చికిత్సలో ముఖ్యమైన రెమిడిస్‌విర్‌ ఇంజక్షన్లు కేటాయింపు, సరఫరా ఎలా ఉందన్నది సమీక్షించాలి. ఎక్కడా ఈ ఔషథం బ్లాక్‌ మార్కెట్‌ కాకుండా చూడాలి. ఏదైనా రాకెట్‌ ఉంటే దాన్ని పూర్తిగా అరికట్టాలి. దాని కోసం ఎస్‌ఓపీ రూపొందించండి. రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న కోవిడ్‌ వాక్సిన్, రెమిడిస్‌వర్‌ ఇంజక్షన్లు ముందుగా ఇక్కడి అవసరాలు తీర్చాలి. లేకపోతే ఇక్కడ కేసులు పెరిగితే, ఆ సంస్థలను మూసివేసే పరిస్థితి వస్తుంది. ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి కూడా వివరించాలి’.

పరీక్షలు ఉధృతం చేయండి:
‘పరీక్షల సంఖ్య కూడా అవసరం మేరకు పెంచండి. కోవిడ్‌ బారిన పడిన ప్రెమరీ కాంటాక్ట్‌లతో పాటు, ఆ పరీక్ష కోరుకున్న వారందరికీ వెంటనే పరీక్ష చేయాలి. వీలైనంత వరకు ఎవరి ప్రాణం కూడా పోకుండా కాపాడాలి. అది మనకు చాలా ముఖ్యం’. ‘కోవిడ్‌ చికిత్స కోసం ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్న ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోండి. అవసరమైతే రైడ్స్‌ చేయండి. అందుకు అవసరమైతే ఒక సీనియర్‌ అధికారిని నియమించండి’.

మరింత సమర్థంగా 104:
 104 కాల్‌ సెంటర్‌ మరింత సమర్థంగా పని చేయాలి. కాబట్టి దాన్ని ప్రతి ఒక్క అధికారి ఓన్‌ చేసుకోవాలి. ప్రతి కాల్‌కు స్పందించాలి. మనం నిర్దేశించుకున్నట్లు ఫోన్‌ చేసిన 3 గంటల్లోనే బెడ్‌ కేటాయించాలి. ఆ నెంబర్‌కు ఫోన్‌ చేస్తే తమకు సాయం చేశారన్న నమ్మకాన్ని ప్రజల్లో కలిగించాలి. 104 కాల్‌ సెంటర్‌ను జిల్లాలో ఒక జేసీకి కేటాయించండి. ఆ అధికారి అవసరం మేరకు ఆ కాల్‌ సెంటర్‌లో కూర్చుని మానిటర్‌ చేయాలి’.
  ‘అవసరమైనన్ని కోవిడ్‌ కేర్‌ సెంటర్లు ఏర్పాటు చేయండి. వాటిలో తగిన సదుపాయాలు ఉండేలా చూడండి’.

ఫ్రీ వాక్సిన్‌:
 ‘రాష్ట్రంలో 18–45 ఏళ్ల వయస్సు మధ్య వారందరికీ ఉచితంగా కోవిడ్‌ వాక్సిన్లు ఇవ్వాలి. ఆ మేరకు అవసరమైనన్ని డోస్‌లకు ఆర్డర్‌ పెట్టండి. 18–45 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారిలో 2,04,70,364 మందికి వాక్సిన్‌ వేయాల్సి ఉన్నందున ఆ మేరకు డోస్‌లు సేకరించాలి’.

నైట్‌ కర్ఫ్యూ:
 కోవిడ్‌ నియంత్రణలో భాగంగా రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్‌ కర్ఫ్యూను అమలు చేయాలి. ఆ మేరకు రెస్టారెంట్లతో సహా అన్నింటినీ మూసేయాలి. అలాగే రైతు బజార్లు, మార్కెట్లను వికేంద్రీకరించండి. గతంలో మాదిరిగా వార్డులలో ప్రత్యేక మొబైల్‌ రైతు బజార్లు ఏర్పాటు చేయండి’.

యథావిథిగా పరీక్షలు:
‘విద్యార్థులకు నష్టం కలిగించకుండా పదవ తరగతి, ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్‌ పరీక్షలు నిర్వహించాలి. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ, ఆ పరీక్షలు నిర్వహించాలి. ఈ విషయంలో ఎక్కడా నిర్లక్ష్యం చూపొద్దు’. కాగా, రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితిని ప్రస్తావించిన అధికారులు, పలు అంశాలను వివరించారు.

ఆక్సీజన్‌ రవాణా వాహనాలు:
 సరైన రవాణా సదుపాయం లేక ఆక్సీజన్‌ సరఫరా ఆలస్యం అవుతోందని సమావేశంలో అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో ఆక్సీజన్‌ రవాణా కోసం కేవలం 64 వాహనాలు మాత్రమే కేటాయించారని, కానీ ప్రస్తుత డిమాండ్‌ను తట్టుకోవడం కోసం కనీసం 100 నుంచి 120 వాహనాలు కావాలని తెలిపారు. అన్ని ఆస్పత్రులలోని ఆక్సీజన్‌ బెడ్లు ఆక్యుపై అయితే 515 మెట్రిక్‌ టన్నుల ఆక్సీజన్‌ అవసరం ఉంటుందన్న అధికారులు, ఇప్పుడు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులలో రోజుకు సగటున 284 మెట్రిక్‌ టన్నుల ఆక్సీజన్‌ వినియోగిస్తున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో విశాఖ ఆర్‌ఐఎన్‌ఎల్‌లో రోజుకు 100 మెట్రిక్‌ టన్నులు ఉత్పత్తి చేసి, దాన్ని రాష్ట్రానికే ఇవ్వడంతో పాటు, తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా ఆక్సీజన్‌ సరఫరా పెంచాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పుడు 208 కోవిడ్‌ ఆస్పత్రులలో మొత్తం 21,581 బెడ్లు ఉండగా, వాటిలో 11,789 బెడ్లు ఆక్యుపైడ్‌ కాగా, గడచిన 24 గంటల్లో 2,506 మంది ఆస్పత్రుల్లో చేరారని అధికారులు వివరించారు.

డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, మంత్రులు బొత్స సత్యనారాయణ, కె.కన్నబాబు, మేకతోటి సుచరిత, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, కోవిడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ స్పెషల్‌ ఆఫీసర్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కెఎస్‌ జవహర్‌రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్, ఉన్నత విద్యా శాఖ స్పెషల్‌ సీఎస్‌ సతీష్‌చంద్ర, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, కుటుంబ సంక్షేమ కమిషనర్‌ కాటమనేని భాస్కర్‌తో పాటు, పలువురు ఉన్నతాధికారులు ఈ సమీక్షకు హాజరయ్యారు.

ఫార్మా కంపెనీలతో మాట్లాడిన సీఎం:
 కాగా, ఈ సమీక్షా సమావేశానికి ముందు సీఎం శ్రీ వైయస్‌ జగన్, భారత్‌ బయోటెక్‌ ఎండీ కృష్ణా ఎల్లాతో పాటు, హెటెరో డ్రగ్స్‌ ఎండీ  బి.పార్థసారథిరెడ్డితో ఫోన్‌లో మాట్లాడారు. రాష్ట్ర అవసరాలు తీర్చే విధంగా మరిన్ని కోవిడ్‌ వాక్సిన్‌ డోస్‌లతో పాటు, రెమిడిసివిర్‌ ఇంజక్షన్లు సరఫరా చేయాలని వారిని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement