
ఆపద వేళ పేద కుటుంబాలకు అండగా ఉండాలనేది మనందరి ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్రంలో బీమాకు అర్హత కలిగిన కుటుంబాలు 1.31 కోట్లు ఉన్నాయి. తన వాటా ఇచ్చేది లేదని కేంద్రం సహాయ నిరాకరణ చేస్తోంది. అందరికీ బ్యాంకు ఖాతాలు తెరిపించాలని బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు చెబుతున్నాయి. అందరితో త్వరితగతిన ఖాతాలు తెరిపించలేని పరిస్థితుల్లో మన వ్యవస్థ ఉంది. అన్ని గ్రామాల్లో బ్యాంకులు లేవు. ఇంకా 60 లక్షలకు పైగా అకౌంట్లు తెరవాల్సి ఉంది. పైగా 45 రోజులు కూల్ ఆఫ్ పీరియడ్ (ఈ సమయంలో బీమా వర్తించదు) అని కొత్త నిబంధన విధించాయి. ఈ పరిస్థితులన్నింటినీ ఎలా అధిగమించాలనే విషయమై కలెక్టర్లు, అధికారులు కూర్చుని మాట్లాడి ఒక ప్రాక్టికల్ సొల్యూషన్‌కు రావాలి.
బీమా పథకం నుంచి కేంద్ర ప్రభుత్వం వైదొలిగినా, రాష్ట్ర ప్రభుత్వం తరఫున వైఎస్సార్ బీమా కింద గత సంవత్సరం రూ.510 కోట్లు చెల్లించాం. ఇందులో వెనక్కి పోయేది లేదు. ఈ ఏడాది కూడా రూ.510 కోట్లు ప్రీమియం మీ చేతికిస్తాం. ఏ రకంగా మీరు దాన్ని గరిష్టంగా ఉపయోగిస్తారో కలెక్టర్లు, అధికారులు ఆలోచించాలి.
సాక్షి, అమరావతి: పేద కుటుంబంలో సంపాదించే వ్యక్తి మృతి చెందితే ఆ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వమే ఆదుకుంటుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. ఇందుకోసం వైఎస్సార్ బీమా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. అర్హులైన వారందరితో బ్యాంకు ఖాతాలు తెరిపించి, బీమా పథకం పరిధిలోకి తీసుకు రావాలని అధికారులను ఆదేశించారు. బీమాలో ఎదురవుతున్న చిక్కులు, మెలికలపై అధికారులు, కలెక్టర్లు మేధోమథనం చేసి.. ఆచరణ సాధ్యమైన పరిష్కారాలతో వారం రోజుల్లో సమగ్ర నివేదికతో రావాలన్నారు. వైఎస్సార్ బీమా పథకానికి అర్హులైనప్పటికీ బ్యాంకుల్లో ఎన్‌రోల్ కాకుండా మిగిలిపోయి.. దురదృష్టవశాత్తు మృతి చెందిన 12,039 మందికి సంబంధించిన రూ.254 కోట్ల పరిహారాన్ని బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి ఆన్‌లైన్‌లో బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సంతృప్త స్థాయిలో వైఎస్సార్ బీమాను అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం అని స్పష్టం చేశారు. కుటుంబంలో సంపాదించే వ్యక్తికి హఠాత్తుగా ఏదైనా జరిగి, అతను దూరమైనప్పుడు ఆ కుటుంబం తల్లడిల్లిపోయే పరిస్థితిలో బీమా అన్నది చాలా ముఖ్యమని చెప్పారు. ఆ మనిషిని తిరిగి తీసుకురాలేక పోయినప్పటికీ, మానవత్వం ఉన్న ప్రభుత్వంగా ఆ కుటుంబం ఇబ్బందులు పడకుండా బీమా ద్వారా ఆదుకోవడానికి కృషి చేస్తున్నామని చెప్పారు.
వైఎస్సార్ బీమా పరిధిలోకి 1.31 కోట్ల కుటుంబాలు
► ఏటా మనం రూ.500 కోట్ల ఖర్చుతో దాదాపుగా బియ్యం కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ బీమా భరోసా కల్పిస్తున్నాం. ఈ లెక్కన 1.41 కోట్ల నిరుపేద కుటుంబాలకు, ఇందులో 70 ఏళ్ల వయసు దాటిపోయి ఉన్నవాళ్లు, బీమా వర్తించని వాళ్లను పక్కనబెడితే మిగిలిన 1.31 కోట్ల కుటుంబాలకు అండగా నిలుస్తున్నాం.
► వీరందరికీ వైఎస్సార్ బీమా ద్వారా ఉచిత బీమా రక్షణ కల్పిస్తూ, గత ఏడాది అక్టోబర్ 21న వైఎస్సార్ బీమా పథకాన్ని ప్రారంభించాం. ఆ కుటుంబాలలో సంపాదించే వ్యక్తికి ఏదైనా అనుకోని సంఘటన జరిగితే, ఆ వ్యక్తి కుటుంబానికి మనం తోడుగా నిలబడాలి అనే దృక్పథంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం.
వైఎస్సార్ బీమా చెక్కుతో సీఎం జగన్. చిత్రంలో మంత్రులు, అధికారులు, లబ్ధిదారులు
కేంద్రం వైదొలిగినా.. మనం భరిస్తున్నాం
► ఈ పథకం ప్రారంభించినప్పుడు వేరే రకమైన పరిస్థితులు ఉన్నాయి. అప్పట్లో ప్రధాన మంత్రి జన జీవన బీమా యోజన (పీఎంజేజేబీవై), ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన (పీఎంఎస్‌బీవై)కు కేంద్ర ప్రభుత్వం 50 శాతం ప్రీమియం చెల్లించేది.
► 2020 మార్చి 31 నుంచి కేంద్ర ప్రభుత్వం తన వాటా చెల్లించడం పూర్తిగా ఆపేసింది. రాష్ట్రాలు కావాలనుకుంటే కొనసాగించుకోవచ్చని చెప్పింది. దీంతో బీమా సొమ్ము చెల్లించే బాధ్యతను పూర్తిగా మనందరి ప్రభుత్వమే భుజస్కంధాలపై వేసుకుంది.
► దేశంలో ఎక్కడా లేని విధంగా పూర్తి ప్రీమియం మొత్తం రూ.510 కోట్లు మన ప్రభుత్వమే గత ఏడాది అక్టోబర్ 21న బ్యాంకులకు చెల్లించింది. అయితే కేంద్రం బ్యాంకుల ద్వారా ఒక్కొక్కరి పేరుపై ప్రత్యేక ఖాతా తెరవాలని మెలిక పెట్టించింది.
► ఇంతకు ముందు గ్రూప్ ఇన్సూరెన్స్ ఉండేది. ఈ రోజు బ్యాంకు నిబంధన కారణంగా మన వలంటీర్లు, మన గ్రామ సచివాలయ సిబ్బంది 1.30 కోట్ల మందిని.. ఒక్కొక్కరినీ తీసుకెళ్లి వారితో బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేయిస్తే తప్ప, ఇన్సూరెన్స్‌కు అర్హత రాని పరిస్థితి నెలకొంది.
ఇంకా 60 లక్షల అకౌంట్లు తెరవాలి
► విపరీతంగా కష్టపడితే దాదాపు 62 లక్షల అకౌంట్లు ఓపెన్ చేయించగలిగారు. ఈ లెక్కన ఇంకా దాదాపు 60 లక్షల అకౌంట్లు ఓపెన్ చేయలేని పరిస్థితి. తీరా అకౌంట్ ఓపెన్ చేసి, ఇన్సూరెన్స్ కంపెనీకి బ్యాంకులో ప్రీమియం చెల్లించాక, 45 రోజుల పాటు కూల్ ఆఫ్ పీరియడ్ అని కొత్తగా ఇంకొకటి తీసుకొచ్చారు.
► అంటే 45 రోజుల లోపు ఎవరైనా చనిపోతే వారికి పరిహారం ఇవ్వరట. ఇప్పుడు అదే జరిగింది. ప్రభుత్వం ప్రీమియం చెల్లించినప్పటికీ.. అకౌంట్ ఓపెన్ చేయలేదనో, ఎన్‌రోల్ కాలేదనో, కూల్ ఆఫ్ పీరియడ్ కింద ఉన్నారనో చెప్పి ఇవాళ 12,039 కుటుంబాలకు పరిహారం ఇవ్వలేదు. ఈ పరిస్థితిలో రూ.254 కోట్లు ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి రాకపోయినా, రాష్ట్ర ప్రభుత్వం తోడుగా నిలబడి మానవతా దృక్పథంతో క్లెయిమ్‌లను చెల్లిస్తోంది. ఇన్ని రకరకాల మెలికలు, ఇబ్బందులను అధిగమించి ఇవాళ ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం.
బీమా కోసం టోల్ ఫ్రీ నంబర్
► ఇంకా ఎవరైనా అర్హత ఉండీ, మిగిలిపోయి ఉంటే ట్రోల్ ఫ్రీ నంబర్ 155214 కు కాల్ చేయండి. ఎలాంటి సంకోచం లేకుండా రిజిష్టర్ చేసుకోండి. కచ్చితంగా వాళ్లకు కూడా మేలు జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.
► ఆ కుటుంబాలకు మంచి జరగాలని, మనిషిని తీసుకురాలేకపోయాం కానీ.. ఆ కుటుంబాల మీద దేవుడి దయ ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నా.
► ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం (రెవెన్యూ శాఖ) ధర్మాన కృష్ణదాస్, కార్మిక, ఉపాధి, శిక్షణ శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, గృహ నిర్మాణ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్, కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి బి.ఉదయ లక్ష్మి, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ఎం గిరిజా శంకర్, ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ ఎండీ బాబు.ఎ, ఏపీఎస్‌హెచ్‌సీఎల్ ఎండీ నారాయణ భరత్ గుప్తా, సెర్ప్ సీఈఓ పి రాజాబాబు, మెప్మా ఎండీ వి.విజయలక్ష్మి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment