సాక్షి,అమరావతి: 1931లో కులపరమైన జనాభా గణన జరిగిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. 90 ఏళ్లుగా కులపరమైన జనాభా లెక్కలు లేవని అన్నారు. ఏపీ అసెంబ్లీ నాలుగో రోజు సమావేశాల్లో భాగంగా సీఎం వైఎస్ జగన్ కులాల వారీగా బీసీ జనగణన అంశంపై మంగళవారం ప్రసంగించారు. దేశంలో బీసీల జనాభా 52 శాతమని పేర్కొన్నారు. వెనకబాటుతనం తెలుసుకోవాలంటే లెక్కలు అవసరమని సీఎం స్పష్టం చేశారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత కులగణన జరగలేదని తెలిపారు. కేంద్రానికి అనేక ప్రతిపాదనలు పంపామని గుర్తుచేశారు. కులగణన డిమాండ్‌కు తాము మద్దతు తెలుపుతున్నామని సీఎం జగన్ చెప్పారు.
చదవండి: AP Assembly Session 2021: శాసనమండలి రద్దు తీర్మానం ఉపసంహరణ
బీసీలంటే బ్యాక్‌వర్డ్ క్లాస్ కాదు.. బ్యాక్ బోన్ క్లాస్ అని సీఎం జగన్ తెలిపారు. బీసీలను రాజకీయంగా, ఆర్థికంగా పైకి తెస్తున్నామని, ఈ రెండున్నరేళ్లలో ఎన్నో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయన్నారు. బీసీ కులగణన జరిగితే మరింత వెసులుబాటు కలుగుతుందని అన్నారు. కులగణన చేయాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానం చేస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు.
నాటి నుంచి బీసీల జనాభా అందాజుగా లెక్కిస్తున్నారు తప్ప కచ్చితమైన లెక్కలేదని తెలిపారు. దశాబ్దాలుగా సామాజికంగా, ఆర్థికంగా బీసీలను ఎదగనివ్వడం లేదని అన్నారు. బీసీల ఎంతమంది ఉన్నారని తెలిస్తేనే వారికి న్యాయం చేయగలుగుతామని అన్నారు. బీసీల లేక్కలు తేలితే ప్రభుత్వానికి స్పష్టత వస్తుందని సీఎం తెలిపారు. జనగణన లేకపోవడంతో బీసీలు వెనకబడిపోయారని సీఎం అన్నారు. అందుకోసమే జనగణన చేయాలని సభ ద్వారా తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తున్నామని సీఎం జగన్ స్పష్టం చేశారు.
బీసీలను సామాజికంగా అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని సీఎం చెప్పారు. టీడీపీ హయాంలో ఓట్ల వారీగా కులాలను విభజించారని అన్నారు. తమ పాలనలో ఎక్కడ కూడా లంచాలు లేవని, అవినీతి లేదని తెలిపారు. గ్రామ సచివాలయాల ద్వారా గొప్ప వ్యవస్థను తీసుకొచ్చామని సీఎం అన్నారు. అడుగడుగునా సామాజిక న్యాయం కనపడేలా చేశామని తెలిపారు.
టీడీపీ పాలనలో రాజ్యసభకు ఒక్క బీసీని కూడా పంపిచలేదని సీఎం జగన్ అన్నారు. నామినేటెడ్ పదవుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించామని తెలిపారు. మున్సిపల్ ఛైర్మన్ పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 67 శాతం ఇచ్చామని చెప్పారు. జడ్పీ ఛైర్మన్ పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 69 శాతం ఇచ్చామని సీఎం పేర్కొన్నారు. 13 మేయర్ పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 92 శాతం ఇచ్చామని తెలిపారు. ప్రభుత్వ కార్పొరేషన్లలో 137 నామినేటెడ్ ఛైర్మన్ల పదవుల్లో బీసీలకు 53 ఇచ్చామని సీఎం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment