CM YS Jagan Two Days Tirupati District Tour Schedule - Sakshi
Sakshi News home page

CM Jagan Tirumala Tour: సీఎం జగన్‌ పర్యటన పూర్తి వివరాలిలా..

Published Tue, Sep 27 2022 8:38 AM | Last Updated on Tue, Sep 27 2022 10:01 AM

CM YS Jagan Two Days Tirupati District Tour Schedule - Sakshi

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ( ఫైల్‌ ఫోటో )

సాక్షి, తిరుపతి: జిల్లాల పునర్విభజన తర్వాత పది రోజుల వ్యవధిలోనే రెండో సారి చిత్తూరు ఉమ్మడి జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటించనున్నారు. ఇటీవల వైఎస్సార్‌ చేయూత మూడో విడత కార్యక్రమ ప్రారంభోత్సవాన్ని విపక్ష నేత చంద్రబాబునాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో అశేష జనవాహిని మధ్య అట్టహాసంగా ప్రారంభించి అక్కచెల్లెమ్మలకు అండగా నిలిచారు. ఆ తర్వాత ఇప్పుడు శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో రెండు రోజులపాటు పూర్తిగా ఆధ్యాత్మిక చింతనలో మునిగితేలనున్నారు.

మంగళవారం తిరుపతి గ్రామదేవత, శ్రీవారి సోదరి శ్రీతాతయ్యగుంట గంగమ్మను దర్శించుకుని చరిత్ర సృష్టించనున్నారు. రాజుల కాలం నుంచి వస్తున్న ఆచారవ్యవహారాల మేరకు ముందుగా గంగమ్మను దర్శించి తిరుమల కొండకు బయలుదేరి వెళ్లే పురాతన సంప్రదాయానికి నాందిపలకనున్నారు. అదేరోజు రాత్రి శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించి స్వామివారిని దర్శించుకుని పునీతులుకానున్నారు. అనంతరం పెద్దశేష వాహన సేవలో పాల్గొని తరించనున్నారు.

ఆ రోజు రాత్రికి కొండపైనే బసచేసి, మరుసటిరోజు బుధవారం ఉదయం మళ్లీ శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఇదిలావుండగా ఇటీవల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టీటీడీ సహకారంతో పేరూరుబండపై పునఃనిర్మించిన శ్రీవారి మాతృమూర్తి వకుళమాత ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్న సీఎం ఆధ్యాత్మిక ఆనందంలో మునిగితేలారు. సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పెద్దపీట వేస్తుండటంతో ఆధ్యాత్మికత కొత్త పుంతలు తొక్కుతోందని స్థానికులు చర్చించుకుంటున్నారు.  

ముఖ్యమంత్రి పర్యటన ఇలా.. 
►27వ తేదీ మంగళవారం సాయంత్రం 3.15 గంటలకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లి నుంచి బయలుదేరి 3.35 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు.  
►3.45గంటలకు గన్నవరం నుంచి బయలుదేరి 4.35 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి విచ్చేస్తారు.  
►సాయంత్రం 5.20 గంటలకు తిరుపతిలోని గంగమ్మ ఆలయానికి చేరుకొని పట్టువస్త్రాలు సమర్పిస్తారు. 
►6 నుంచి 6.15గంటల వరకు అలిపిరి టోల్‌గేట్‌ వద్ద విద్యుత్‌ బస్సులను ప్రారంభిస్తారు.  
►6.40కు తిరుమల పద్మావతి అతిథి గృహానికి చేరుకుంటారు. 
►7.45 నుంచి7.55 వరకు బేడి ఆంజనేయస్వామిని దర్శించుకుంటారు. 
►8.05 గంటలకు ఆంజనేయస్వామి ఆలయం నుంచి శ్రీవారి ఆలయానికి బయలుదేరుతారు. 
►8.05 నుంచి 8.20 గంటల వరకు పట్టువస్త్ర సమర్పణ కార్యక్రమంలో పాల్గొంటారు. 
►8.20 నుంచి 8.30 గంటల వరకు శ్రీవారిని దర్శించుకుంటారు. 
►8.30 నుంచి 8.40 గంటల వరకు వకుళమాత దర్శనం, ప్రదక్షిణం, వెండివాకిలి రంగనాయక మండపం  కార్యక్రమంలో పాల్గొంటారు. 
►8.40 నుంచి 8.50 వరకు రంగనాయక మండపంలో వేద ఆశీర్వచనం పొందుతారు. 
►8.55 నుంచి 9 గంటల వరకు శ్రీవారి ఆలయంలో వస్త్ర మండలం పెద్దశేష వాహనం కార్యక్రమంలో పాల్గొంటారు. 
►9.10కి వాహన మండపం నుంచి పద్మావతి గెస్ట్‌హౌస్‌కు బయలుదేరుతారు. 
►9.15 గంటలకు తిరుమల పద్మావతి అతిథిగృహం చేరుకొని రాత్రి అక్కడే బస చేస్తారు. 

28వ తేదీ ముఖ్యమంత్రి పర్యటన ఇలా.. 
►ఉదయం 6 గంటలకు పద్మావతి అతిథి గృహం నుంచి శ్రీవారి ఆలయానికి బయలుదేరుతారు. 
►6.05 నుంచి 6.30 వరకు శ్రీవేంకటేశ్వరస్వామి సేవలో పాల్గొంటారు. 
►6.45 నుంచి 7.05 వరకు పరకామని భవన ప్రారంభోత్సవంలో పాల్గొంటారు.  
►రాత్రి 7.05కు పరకామని నుంచి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి నిర్మించిన అతిథిగృహాన్ని ప్రారంభిస్తారు.  
►7.10కి తిరిగి పద్మావతి అతిథిగృహానికి చేరుకుంటారు. 
►7.10 నుంచి 7.30 గంటలకు లక్ష్మి వీపీఆర్‌ అతిథిగృహాన్ని ప్రారంభిస్తారు. 
►7.35కు పద్మావతి అతిథిగృహానికి చేరుకుంటారు. 
►8.35కి పద్మావతి నుంచి రేణిగుంట విమానాశ్రయానికి బయలుదేరుతారు. 
►9.55కి రేణిగుంట నుంచి గన్నవరానికి బయలుదేరి వెళ్లనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement